తోలుబొమ్మలాట



తోలుబొమ్మలాట(updated)

       ఆప్టన్ సింక్లేర్ అన్నట్లు కళలు,సాహిత్యం ఒక ప్రచార సాధనం. అలాగే  తోలుబొమ్మలాట కూడా ఒక ప్రచార సాధనం. రాచరికపు కాలంలో చక్రవర్తులు, మత ప్రచారకులు, ధర్మప్రచారకులు బుర్రకథ, వొగ్గుకథ, తోలుబోమ్మలాట, హరికథ లాంటి వివిధ జానపదుల కళారూపాల్లో  తమ సందేశాలను, భావాలను,ధర్మాలను ప్రచారం చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా,టి.వి., సినిమా, పత్రికలు మొదలైన వాటి ద్వారా చేస్తున్నారు. అంతేగాక విజ్ఞాన ప్రచార సాధనంగా, వినోదాత్మకంగా ఆధునిక కాలంలో ఉపయోగిస్తున్నారు.

    క్రీ.పూ 3000 సం॥నికి చెందిన హరప్పా, మొహంజోదారో లో  తవ్వకాల్లో  తల భాగాన్ని ఒక తీగతో అతకించగల ఒక టెర్రకోట ఎద్దు లభించింది. ఇది ఒక పరిమితమైన యానిమేషన్ లాంటిది . పైకి క్రిందకు జారగల ఒక టెర్రకోట కోతి బొమ్మ కూడా దొరికింది. ఇది ఒక వాహన కదలికను సూచిస్తుంది.
తరువాత వచ్చిన వేదకాలంలో ఇలాంటివాటికి ఆదరణ లేక పోయింది.
  
       క్రీ.పూ 6వ శతాబ్దం మగధ సామ్రాజ్యం ఏర్పడిన నాటికి భారతదేశం లో తోలుబొమ్మల ప్రదర్శనశాల (Shadow theater) మొదలైంది.క్రీ.పూ 3 వ శతాబ్ధానికి చెందిన అశోకుని శిలా శాసనాల్లో  బొమ్మలాట ప్రదర్శన గురించి ప్రస్తావించారు.
క్రీ.పూ 3 వ శతాబ్దం నాటికే తెలుగు దేశంలో తోలుబొమ్మలాట  ఉన్నట్లు కొన్ని శాసనాలు,రచనలు  ద్వారా తెలుస్తోంది. బౌద్ధ జాతక కథలైన  థేరి గాథల్లో బొమ్మలాటకు సంబంధించిన ప్రస్తావన ఉంది. కన్యలను ఆకర్షించడానికి బొమ్మలాటల ప్రదర్శన అవసరమని వాత్సాయనుడు చెపుతాడు క్రీ.పూ.4వ శతాబ్దం లో రాయబడిన వ్యాసమహాభారతంలో తోలుబొమ్మలాట ప్రస్తావన ఉంది. సంస్కృత సాహిత్యంలో 11వ శతాబ్దంలో సోమదేవ భట్టుడు రాసిన కథా సరిత్సాగం లో,   భవభూతి రాసిన మహావీర చరితం లో, రాజశేఖరుని బాలరామాయణంలో,జయదేవుని ప్రసన్న రాఘవంలోనూ తోలుబొమ్మలాటల ప్రస్తావన  కనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో నాచన సోమన, పాల్కురికి సోమన  తదితర కవుల రచనలలోతోలుబొమ్మలాటల ప్రస్తావన ఉంది .
చీరమరుగున బొమ్మలనాడించు వారు అని ఒక పద్యంలో తోలుబొమ్మల గురించి ప్రస్తావించారు.  
     ఈ ఆట  రాజులను  సంతోష పెట్టడానికి ప్రదర్శించేవారు. 2డి యానిమేషన్ దిశగా మొదటి అడుగు బొమ్మాలటదే. చాయచిత్రం, నీడల్తో ఆకృతులు వంటివి బొమ్మలాటకు దారితీశాయి. ఈ తోలుబొమ్మలాట లోని తెర, సినిమాకు వెండి తెరగా మారింది. నృత్య దశ నుండి మానవుడు నాటక దశలోకి మారే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ప్రముఖ పాత్ర వహించింది. ఇది జానపదుల కళారూపం. జానపదుని మొదటి రంగస్థల ప్రదర్శన కళ ఈ కళారూపం. 

        తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో  ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి వుంది.     సంగీత, నాట్య కళారూపమైన తోలుబొమ్మలాట  భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొందింది. 
కొయ్యబొమ్మలాటలు, కట్టెబొమ్మలాటలు, తొడుగు బొమ్మలాటలు, తళ్ళబొమ్మలాటలు, బుట్టబొమ్మలాటలు, తోలుబొమ్మలాటలు అని బొమ్మలాటల్లో రకాలున్నాయి.

      బొమ్మలాటలు భారతదేశంలో, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి.  వీటిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు.
తమిళనాడులో తోలు బొమ్మలాట్టం అని, బొమ్మలాట్టం,కర్ణాటకలో గొంబె - ఆట్ట అని, తొగలుగొంబె అనీ, కేరళలో తోల్ పావకూత్తు అనీ, పావకూత్తు అనీ, ఒరిస్సాలో కాఢీ కుందేయ్ నాచా,  రావణచ్చాయ, మహారాష్ట్రలో కళాసూత్రి బాహుల్యే చంద్యాచ బాహుల్యే, రాజస్తాన్లో కట్ పుత్లీ, పశ్చిమబెంగాల్ లో పుతుల్ నాచ్ ,  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలోతోలుబొమ్మలాట అనీ పిలుస్తున్నారు.
       
    తోలుబొమ్మలాట ఆంధ్ర రాష్ట్రం నుండి పాశ్చాత్యదేశాలకు విస్తరించింది. పర్షియా(ఇరాన్), టర్కీ ల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించింది.  గ్రీసులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికా లోని ముస్లిం దేశాలకు, ఇటలీ కి, అక్కడినుండి ఫ్రాన్స్ లోని వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించాయి. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్నరూపాలు ధరించాయి. వీటన్నింటికీ భారతదేశమే మాతృక.

     తోలుబొమ్మలాట (Shadow Puppetry) కోసం తేలికపాటి తొలు (చర్మం) పై చిత్రలేఖనం చేస్తారు.  తెల్ల తెరను  కట్టి తెర వెనుకనుంచి
మేకతోలుతో చేసిన పలుచని బొమ్మలకు కళ్ళు, మోచేయి, మోకాళ్ళ దగ్గర కదలికలిచ్చే విధంగా కాళ్ళకు, చేతులకు, తలలకు దారాలు   కడతారు.
ఒక దబ్బతో ఆ బొమ్మనుపట్టి నిలబెడతారు. సందర్భానుసారంగా అవసరమైన దారాలను లాగుతూ వదులుతూ బొమ్మ లాడిస్తారు.
ఈ బొమ్మలను తెర వెనుక నుండి వెలుతురుతో నీడలుగా తెరపై ప్రదర్శిస్తారు. దాంతో తెర ముందున్న ప్రేక్షకులకు ఆ బొమ్మ కథానుసారంగా కదిలినట్లు అనుభూతి చెందుతారు.  బొమ్మల నీడల ద్వారా కథ చెబుతారు. కథ కనుగుణంగా తాళం వేస్తూ కథకు సంబంధించిన పాట పాడతారు. పౌరాణిక ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, భక్తి కథలు ఈ ఆటలలో ప్రదర్శిస్తారు.
అశోకుని ధేలీ (ఒరిస్సా), గిర్నారు(మహారాష్ట్ర) శాసనాల ద్వారా ఉత్సవాల్లో వినోదానికి, బౌద్ధ ధర్మ ప్రచారానికి తోలు బొమ్మలాటలు విరివిగా ప్రదర్శించబడినాయని తెలుస్తోంది.
         
      బొమ్మలను సూత్రాలతో(దారాలతో) నాడిస్తారు కాబట్టి ఆ ప్రదర్శకుని "సూత్రధారుడు" అంటారు.   నాటక  ప్రారంభంలో 'సూత్రధారుడు' ప్రవేశించి  నాటకం గురించి కొన్ని మాటలు చెప్పిపోతాడు. కాని  ఆదినుండి తుదివరకు సూత్రదారుడే  బొమ్మలాడిస్తాడు. ఈ బొమ్మలాటలో మధ్య మధ్య హాస్యప్రదర్శన కూడా చేస్తారు. అది చాలా మొరటు హాస్యం.
     
తోలుబొమ్మలాట లో కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు ముఖ్య హస్యపాత్రలు.   ప్రధానకథతో పాటు హస్యపాత్రలకూ ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రలను సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలిపి, ఆ పాత్రల ద్వారా సమాజంలో ఉండే దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగడతారు. ఇందులో సామెతలు, లోకోక్తులు, పొడుపుకథలు, నీతికథలు  చోటు చేసుకుంటాయి.  అభినయాలకు అనుగుణంగా  వాద్యాలు కూడా ప్రధాన భూమికను నిర్వహిస్తాయి. వాద్యానికి సంబంధించి హర్మోనియం, తాళాలు, తొక్కుడుబిళ్ల, మద్దెల, డప్పు, గజ్జెలు వంటివి ఉంటాయి. తోలుబొమ్మల ప్రదర్శనలో రామాయణం, భారతం లకు సంబంధించిన లంకాదహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయబారం, మైరావణవధ, విరాటపర్వం, పద్యవ్యూహం, ఉత్తరగోగ్రహణం వంటి కథలను ప్రదర్శిస్తారు.



తోలుబొమ్మలాటలు మనోరంజకంతో పాటు  ఆయా పాత్రల స్వరూప స్వభావాల ద్వారా సామాజిక జీవన సరళిలోని  నాగరికతను పెంపొందించుకునేందుకు దోహదం చేశాయి.సమాచార మాధ్యమంగా పనిచేసింది.ఆరోగ్యవిషయాలు, నీతి నియమాలు, రాజకీయ మార్పులు, దొంగవ్యాపారుల గుట్టు మొదలైన ఆనాటి స్థితిగతులను బొమ్మలతో దృశ్యరూపంగా వివరించేవారు.టెలివిజన్, సినిమా, మొబైల్ వినోదం వల్ల ఈ కళా రూపం క్రమంగా నేడు క్షీణిస్తోంది. తోలుబొమ్మలాటలను  ఆరెమరాఠీవారు ప్రదర్శించేవారు. వీరు తంజావూరు నుండి   వచ్చి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో బొమ్మలాట కళాకారులుగా స్థిరపడి పోయారు ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో  స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రదేశంలోని హిందూపురం, బొమ్మలాటపల్లి, అనంతపురం, ధర్మవరం, చెరుకుపల్లి, మదిరి, బసవయ్యపాలెం, గుండాలమ్మ పల్లె, వాడపల్లి, నెల్లూరు, వంటి అతికొద్ది ప్రాంతాల్లో తోలుబొమ్మల బృందాలు కొన ఊపిరితో ఉన్నాయి.నందలూరు, రాజంపేట, యర్రగుంట్లలో; దోర్నాల, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ కళ మరింత అభివృద్ధి చెందింది. అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట అనే మారుమూల గ్రామం తోలు బొమ్మలాట కళకు ప్రసిద్ధి చెందింది.   ఈ గ్రామానికి చెందిన దళవాయి చలపతిరావుకు తోలుబొమ్మలాటలో  పద్మశ్రీ అవార్డు లభించింది.ఈ గ్రామంలో 200 పైగా కుటుంబాలు తోలుబొమ్మలాట పై ఆధారపడి జీవిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రఖ్యాత కళాకారులుగా కొలిమి రంగయ్య, బొమ్మలతాటి రామయ్య, కొంగర వెంకటయ్య, శ్రీనివాసులు వంటి వారు రాణిస్తున్నారు.

     ఇంటాక్  సంస్థ తొలుబొమ్మలాట ప్రాచీన కళను సంరక్షించేందుకు అనేక ప్రదర్శనలు, డాక్యుమెంటేషన్ ప్రాజెక్టులు నిర్వహించింది.
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది, నల్లమడుగు, దర్మవరంలో బొమ్మలాట కళాకారుల పట్ల INTACH పరిశోధనలు చేసింది.   "Intangible Cultural Heritage"గా భారత పప్పెట్ కళల ఉనికిని UNESCO గుర్తించింది.

__ పిళ్లా కుమారస్వామి,9490122229

Sources:
1www. puppetindia.com, Wikipedia, నాల్గవ తెలుగు ప్రపంచ మహాసభలు ప్రత్యేక సంచిక
2.Theatres of India: A Concise Companion"  Ananda Lal (Ed.) – పప్పెట్రీపై చక్కటి చారిత్రక విశ్లేషణ.
3."Traditional Shadow Puppets of Andhra Pradesh" – N. Krishna Kumari
4."Puppets and Performing Objects" – Dass, M. V.






































కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

The unexplored relics of Rayalaseema

పెనుకొండ కోట – విజయనగర వైభవానికి రెండవ రాజధాని