బ్రిటీషు వారి పాలనకిందకు వచ్చిన రాయలసీమ
రాయలసీమ ప్రాంతంపై తమ అధికారాన్ని నెలకొల్పటానికి మహారాష్ట్రులు నవాబులు నిజం పెనుగులాడే సమయంలో 1783లో మైసూర్ సుల్తాన్ హైదర్ ఆలీ ఈ ప్రాంతంపై దాడిచేసి రాయదుర్గం బళ్ళారి గుర్రంకొండ సిద్ధవటం మొదలైన దుర్గాలను వశపర్చుకొన్నాడు . 1782లో హైదరాలీ మరణించిన తరవాత మైసూర్ సుల్తానైన టిప్పు సుల్తాన్ ఆదోని మొదలైన కోటలను , రాయలసీమనూ పూర్తిగా ఆక్రమించాడు . హైదరాలీ , టిప్పు సుల్తాన్ తాము జయించిన ప్రాంతాల్లోని పాలెగాళ్ళను అణచివేసి శాంతి భద్రతలను నెలకొల్పారు . భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య విస్తరణను అరికట్టి , ఆంగ్లేయులను భారతదేశం నుండి పారద్రోలాలనే దృఢ సంకల్పంతో ఆంగ్లేయులను ప్రతిఘటించిన వారిలో మైసూర్ సుల్తానులైన హైదరాలీ , అతని కుమారుడు టిప్పు సుల్తాన్లు ముఖ్యులు . వీరు ఆంగ్లేయులతో చేసిన నాలుగు యుద్ధాలే ఆంగ్లో - మైసూరు యుద్ధాలుగా ప్రసిద్ధికెక్కాయి . ఈ యుద్ధాలు 1767 - 69 మధ్య , 1780 - 84 మధ్య , 1790 - 92 మధ్య 1799లో జరిగాయి . మూడో ఆంగ్ల - మైసూర్ యుద్ధ ఫలితంగా గుర్రంకొండ , గండికోట , కంభం , బళ్ళారి ప్రాంతాలు నిజాం ఆధీనమైనాయి . నాల్గో ఆంగ్ల - మైసూర్ యుద్ధంలో టిప్పు ప్రాణాలు కోల్పోయాడు . ఈసారి నిజాం గుత్తి దుర్గం , చిత్ర దుర్గం, నందిదుర్గం , కోలార్ ప్రాంతాలను వశపరచుకున్నాడు. మూడు , నాలుగు ఆంగ్ల - మైసూర్ యుద్దాల ఫలితంగా రాయలసీమలోని అత్యధిక భూభాగం నిజాం పాలన కిందికి వచ్చింది. అయినప్పటికీ కీ ఒకవైపు టిప్పు సుల్తాను మరోవైపు మరాఠాల దాడి నుండి తనను తాను రక్షించుకునేందుకు నిజాం బ్రిటిష్ వారి సహాయం తీసుకున్నందుకు ఒప్పందంలో భాగంగా రాయలసీమ ప్రాంతంలోని మండలాలను బ్రిటిష్ వారి మద్రాస్ ప్రెసిడెన్సీకి ధారాదత్తం చేశాడు.దాంతో కడప,కర్నూలు,అనంతపురం బళ్ళారి జిల్లాలను దత్తమండలాలని పిలిచారు. నాలుగవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం లో టిప్పుసుల్తాన్ మరణించాడు. కర్ణాటక నవాబు ఈ యుద్ధంలో కంపెనీ వ్యతిరేక చర్యలకు పాల్పడినాడనే అభియోగంతో కంపెనీ సైన్యాలు నెల్లూరు చిత్తూరు ప్రాంతాల్లో ప్రవేశించి కర్ణాటక నవాబును ఓడించి కంపెనీ పాలన కిందకు తెచ్చు కున్నాయి.ఆ విధంగా రాయలసీమ మొత్తం నెల్లూరు తో సహా బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది.
(సేకరణ:పిళ్లా విజయ్)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి