రాయలసీమ లో ఫ్యాక్షనిజం
*రాయలసీమ లో ఫ్యాక్షనిజం*
___ కిన్నెర శ్రీదేవి
ఫ్యాక్షనిజం అనేది ఒకప్పుడు ఆస్తుల ధ్వంసానికి, పంటల్ని నాశనం చేయటానికి పరిమితమై ఉండగా ఇవ్వాళ పరస్పరం హత్యలు చేసుకొనేదాకా విస్తరించింది. బాంబుల తయారీ కుటీర పరిశ్రమగా పరిణమించింది. ఫ్యాక్షన్ గ్రామాలలో అరాచకం పెరిగిపోయింది. పల్లెలు నివాస యోగ్యాలు కాకుండా పోయాయి. ఆర్థికంగా బలపడిన వాళ్ళంతాపల్లెల్ని విడచి, రాజధానికో లేకపోతే, దగ్గరగా ఉన్న నగరానికో, పట్టణానికో వలస పోతున్న క్రమం కూడా ఇవ్వాళ కన్పిస్తోంది.
ఫ్యాక్షన్ చర్యలలో పాల్గొనేవాళ్ళకు రాజకీయనాయకులు ఆసరా ఇవ్వటమే కాకుండా, వాళ్ళే స్వయంగా ఫ్యాక్షన్లను నడపడం సర్వసాధారణ విషయమై పోయింది. పోలీసు వ్యవస్థ ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్ని నియంత్రించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయినా సరే ఫ్యాక్షన్ చర్యల వల్ల పెంచుకున్న పరిధినిరాజకీయ నాయకులు ఎన్నికల్లో ఉపయోగించు కుంటున్నారు. అంతే కాకుండా ఈఫ్యాక్షనిస్టులు తమ పల్లెల్లో రిగ్గింగ్ చేసి ఎన్నికల్లో నెగ్గుతున్నారు. నిజానికి ఇవ్వాళ
రాయలసీమ లోని రాజకీయ కుటుంబాలు చాలా వాటికి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలతోసంబంధం వుంది. క్రమంగా ఈ ఫ్యాక్షనిస్టులు కేవలం రాజకీయాలకే పరిమితం కాక,
నీటిపారుదల, రోడ్డు సౌకర్యాలు సహకార పరపతి సంఘాలు, సంక్షేమ పథకాలు లాంటి వాటికి తమ అధికారాన్ని విస్తరించారు. వీళ్ళ ప్రమేయం లేకుండా ఈ శాఖలు పని
చేయటం దాదాపు అసాధ్యమవుతుంది. అలాగే మొత్తం కాంట్రాక్టు వ్యవస్థను ఈ ఫ్యాక్షనిస్టులు స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టు సైజును బట్టి అంతే స్థాయి గల ఫ్యాక్షనిస్టు ఆ
కాంట్రాక్టును మిగతా వాళ్ళను భయపెట్టి స్వాధీనం చేసుకుంటాడు. అసలు టెండర్లు వేయడం మిగతా చిన్న చిన్న కాంట్రాక్టర్లకు అసాధ్యమవుతుంది. ప్రభుత్వ పథకాలన్నీ ఈ
ఫ్యాక్షనిస్తుల కనుసన్నలలోనే నడుస్తాయి. ప్రజల్ని నిరంతరం భయభ్రాంతుల్ని చేయటం ఈ ఫ్యాక్షనిస్టుల చర్యలలో ఒకటి. అటువంటి భయాందోళనలకు లోనైన ప్రజలు ఫ్యాక్షనిస్టులు
ఎన్ని దుర్మార్గాలు చేస్తూ ఉన్నా నిస్సహాయులుగా చూస్తూ ఉంటారు తప్ప ప్రశ్నించలేరు.పౌరహక్కులనేవి నామమాత్రంగా కూడా ఫ్యాక్షన్ అమలులో వున్న గ్రామాలలో వుండవు.
పోలీసు వ్యవస్థ నిర్వీర్యమై ఉంటుంది
ఫ్యాక్షన్ వ్యవస్థ బలపడిన గ్రామాల్లో సాధారణ మానవ సంబంధాలు కొనసాగటం కూడా కష్టమవుతుంది. ఫ్యాక్షన్ గ్రామాల్లో వుండే యువతీ యువకులకు పెళ్ళిళ్ళు కావటంకూడా కష్టమవుతుంది. వేరే ప్రాంతాలనుంచి తమ పిల్లలను ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లోవుండే వాళ్ళకు ఇవ్వటానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు అంటే, ఫ్యాక్షన్ కక్ష్యలు భయోత్పాతంగా పరిణమించిన క్రమాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్షన్ గ్రామంగా (పార్టీ కట్టడం) పేరుబడిన వూర్లకు పిల్లనివ్వకపోవడాన్ని పాలగిరి విశ్వప్రసాద్ "చుక్కపొడిచింది”, “కరువొచ్చె కచ్ఛలూ వచ్చె” కథల్లో సాక్షీభూతం చేశారు. రచయిత కడపజిల్లా ప్రొద్దుటూరులోని పొట్లదుర్తి
గ్రామానికి చెందినవారు. ఈ వూరు ఫ్యాక్షన్ జోన్లో వుంది. ఈయన ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వలన మూడు తరాల స్త్రీల జీవితాలను 'చుక్క పొడిచింది' కథలో
వివరంగా చిత్రించారు. అంతేకాకుండా స్త్రీలు భర్త లేకుండా వంటరిగా జీవించడంలో దుర్భరత్వాన్ని ఈ కథల్లో చిత్రించారు.
రాయలసీమలోని అన్ని జిల్లాలలో కొంత భాగం ఫ్యాక్షన్ జోన్‌గా ఉంది. ఆజోన్లో ఫ్యాక్షన్ హత్యలు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాలలో అమలయ్యే ఫ్యాక్షనిజంలో కొన్నిసారూప్యతలు వున్నట్లే కొన్ని వ్యత్యాసాలు కూడా కనిపిస్తాయి. 1970ల తర్వాత రాయలసీమలో జరిగిన అనేక హత్యలు వెనుక ఫ్యాక్షన్ ముఠాల హస్తం, వాళ్ళు అనుసరిస్తున్న రాజకీయాలు, ఆ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు వున్నాయి. 1980ల తర్వాత ఇవి మరింత బలపడ్డాయి. వ్యక్తిగత ప్రతిష్ఠల కోసం, భూముల వద్ద, పొలాల గట్ల వద్ద అక్రమ సంబంధాల ఫలితంగా మొదలయ్యే తగాదాలు ఈ రాజకీయ పార్టీల అండదండల ఫలితంగా తీవ్ర రూపాన్ని దాలుస్తాయి. అంతకు ముందు ఆయా పల్లెటూళ్ళకు
మాత్రమే పరిమితమై వుండే గొడవలు, తగాదాలు క్రమంగా మొత్తం సీమ జిల్లాలకు విస్తరిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలన్నీ రెండు మూడు ఫ్యాక్షన్ ముఠాల చేతుల్లోకి ఆ
ముఠాలను నడుపుతున్న వ్యక్తుల, పార్టీల ఆధీనంలోకి వెళ్ళాయి. ఫలితంగా రాయలసీమ ప్రాంతం మొత్తంలో, చిన్న పల్లెల నుంచి పెద్ద పట్టణాల దాక భయం గుప్పెట్లో జీవిస్తున్నాయి.
కోర్టుల, చట్టాల అస్తిత్వం ఈ ప్రాంతంలో ఎక్కువ సందర్భాలలో అర్థరహితంగా కనిపిస్తుంది. .ప్రైవేటు న్యాయ వ్యవస్థ, ప్రైవేటు చట్టాలు ఇక్కడ నిరంతరం ప్రభుత్వ అస్తిత్వాన్ని, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ వుంటాయి.గ్రామాలకు గ్రామాలే నిరంతరం కలహాలతో రగిలిపోతూ ఉంటాయి. ఈ సామాజిక వాస్తవికతను కేతు విశ్వనాథరెడ్డి పీర్ల సావిడి,కూలిన బురుజు కథలు ప్రతిఫలిస్తాయి.
రాయలసీమలో అనేక పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం వుంది. పరిశ్రమల స్థాపనకు అనువైన ముడి పదార్థాలు, ఖనిజాలు పుష్కలంగా రాయలసీమ జిల్లాలలో
దొరుకుతాయి. విశేషంగా సున్నపురాయి, ముగ్గురాయి, ఆస్ బెస్టాస్, పింగాణి వుత్పత్తికి పనికివచ్చే మట్టి రాయలసీమ జిల్లాలలో వున్నాయి. ఫ్యాక్షనిస్టులంటేనే భయపడే పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టటానికి ఇంత వరకు ముందుకు రాకపోవటంతో రాయలసీమ పారిశ్రామికంగా వెనుకబడింది. ఫ్యాక్షనిస్టులు పర్సెంటీజీల పేరుతో వారిని వేధించడమో కార్మికులను అడ్డం పెట్టుకొని గూండాగిరి చేయడమో చేస్తున్నారు.దాంతో వారంతా పరిశ్రమలు నెలకొల్పడానికి భయపడుతున్నారు. ఫలితంగా రాయలసీమ పారిశ్రామికంగా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు ఎంతో వెనుకబడి వుంది. .
( సీమ అస్తిత్వం నుండి)
(సేకరణ: పిళ్లా విజయ్)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి