స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ మోదీన్ సాబ్,శ్రీమతి రాబియాబీ
భారతదేశ స్వాతంత్ర్యం ఎందఱో వీరుల త్యాగఫలితం. బానిస సంకెళ్ళు తెంచటానికి అందరూ తమ శక్త్యానుసారం సమ్మెట దెబ్బలు వేసినారు. ఈ భుజం భుజం కలపటంలో కులమత, ధనిక పేద అనే భేద భావమే వారి ఆలోచనలలో లేదు.యుద్ధం చేయడం తమ బాధ్యత. దేశ స్వాతంత్ర్యం కోసం కత్తులబాటలో నడిచేటప్పుడు ఎన్ని గాయాలైతే అంతకు రెట్టింపుగా తృపి పొందినారు, గర్వపడినారు.
అనంతపురము జిల్లాలో ముస్లిములు ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం మొదలు కొని అన్ని జాతీయోద్యమాలలోనూ పాల్గొన్నారు. అబ్దుల్లా సాహేబ్, కాంట్రాక్టర్ సులేమాన్ సాహెబ్ , షామాలిక్ షక్కర్ బాబా , మహబూబ్ సాహెబ్ పీరా సాహెబ్, ముల్లా మోదీన్ సాహేబ్ , వీరి సతీమణి రాబియాబీ మొదలగువారుపాల్గొన్నారు.
ముల్లా మోదీన్ సాహెబ్ 02-02-1917 న అనంతపురము తాలూకా, పూలకుంట గ్రామంలో జన్మించినాడు. తండ్రి ముల్లా గౌస్ సాహెబ్, తల్లి ముల్లా ఇమాంబీ. గౌస్ సాహెబ్ పూలకుంటలో ఉపాధ్యాయుడుగా ఉండేవారు.ఆయనకు తెలుగు సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. కవీ, పండితుడు. “నానార్థ పద్మాకరం” అనే నిఘంటువును రాసినట్లు చెబుతారు. రామాయణ కావ్యం రాసినాడనీ చెబుతారు. శ్రీ రాముడు “ తన రామను ఆరామమున వెదకుచు “ వంటి ఆయన రాసిన రామాయణ కావ్యంలోని కొన్ని వాక్యాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఆయన భజనలు చేయటంలో ప్రసిద్ది పొందిన వాడు. పురాణ పఠనం వినసొంపుగా చేసేవాడు. కాంగ్రెసు ప్రచార పాటలు రాసి పాడేవాడు.
మోదీన్ సాబ్ ఎనిమిదో తరగతి చదివి, ఉపాధ్యాయ శిక్షణ పూర్తీ చేసినాడు. అయితే ఉపాధ్యాయుడుగా చేరలేదు. ఓ పదిమంది యువకులను గుంపేసి నాటకాలు ఆడేవాడు. పద్యాలు , పాటలు పాడించేవాడు. నాటకంలో ఆంజనేయ పాత్రకు ఈయన ప్రసిద్ది. తన కోతిచేష్టలతో, శ్రావ్యమైన రాగాలాపనతో జనాలను బాగా ఆకట్టుకొనేవాడు. నాటకం మధ్య,మద్య విరామంలో హాస్య పాత్ర ధారిగా వచ్చి మాటలతో, చేష్టలతో కడుపుబ్బా నవ్వించేవాడు. “ కోడి పాయ లక్ష్మమ్మ కోడి పాయనే ; కోడిపోతే పీడపాయ గంపెడంత బొచ్చుపాయ “ వంటి జానపద గేయాలను కేవలం పాడటం కాక నటిస్తూ పాడేటప్పుడు ఎంత వద్దనుకున్నా కడుపుబ్బా నవ్వే వాళ్ళు.
పసలూరు ఎరికలప్ప (sc) స్వాతంత్ర్యసమర యోధుడు , కాంగ్రెసు పార్టీ కార్యకర్త, జిల్లా బోర్డు సభ్యడు. ఈయన గ్రామాలు తిరుగుతూ , పాటలు పాడుతూ కాంగ్రెసు ప్రచారం చేసేవారు . ఎర్రమల కొండప్ప మరో స్వాతంత్ర్య సమరయోధుడు. గొప్ప త్యాగి. కేశవ విద్యానికేతన్ హాస్టలుకు (యిపుడు అంబేద్కర్ భవన్ పక్కనున్న హాస్టలు స్థలం మహాత్మా గాంధీ సమక్షంలో దానం చేసినవాడు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ సమయంలో అనంతపురంలోనే ఉప్పు తయారు చేసి , పంచినవాడు.) ఎరికలప్ప, కొండప్ప కల్సి శిస్తు తగ్గించమని కోరుతూ గ్రామాలనుండి జనాలను పోగు చేసి కలెక్టరుకు అర్జీలు యిచ్చేవారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూలకుంటకు వచ్చినపుడు మోదీన్ సాబ్ వీరికి బాగా సహకరించేవాడు. 1934 జనవరి మొదటి వారంలో అనంతపురానికి “హరిజన పర్యటన” గా గాంధీ వచ్చినపుడు ఎద్దుల బండ్ల లోనూ , కాలినడకనా గ్రామ ప్రజలు వేలాదిగా తరలి వచ్చినారు. ఎరికలప్ప, కొండప్ప గార్ల ప్రోత్సాహంతో తన మిత్రులతో కలసి మోదీన్ సాబ్ 17 కి.లో.నడచి, అనంతపురం చేరుకున్నారు. అక్కడ ఎరికిలప్ప వీరికి కాంగ్రెసు జండాలు , కాంగ్రెసు టోపీలు సమకూర్చినాడు. ఆ సమావేశం నుండి ఉత్సాహంతో తిరిగి వచ్చి గాంధీ గారి గురించి పాటలు పాడుతూ వూరంతా తిరిగినారు మోదీన్ సాబ్ మిత్రబృందం.
ఈ ఉత్సాహంతోనే యువజన సంఘం ఏర్పాటు చేసినాడు. మొదట సమావే శానికి పసలూరి ఎరికలప్ప అధ్యక్షులు. ఈ సమావేశం లోనే సంఘానికి అధ్యక్షులుగా మోదీన్ సాబ్, కార్యదర్శిగా కె. నరసింహారెడ్డి , కోశాధికారిగా కె.లక్ష్మిరెడ్డి ఎన్నికైనారు. ప్రతి సభ్యున్నుంచి నెలకు రెండు అణాలు (దాదాపు 12 పైసలు ) సభ్యత్వ రుసుము వసూలుa చేసేవారు. ఆ డబ్బుతో
ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, సాధన పత్రికలను , వీరేశలింగం గారి రచనలు తెప్పించేవారు. ప్రతి రాత్రీ సమావేశం జరిగేది. సమావేశానికి ప్రతి సభ్యుడూ ప్రతి రోజు హాజరు కావాలనే నియమం పెట్టుకు న్నారు. సభ్యులు పత్రికలను విధిగా చదవాలనే నియమం పట్టుకున్నారు. చదువురాని వారికి పత్రిక చదివి వినిపించడమే గాక , వారికీ చదువు నేర్పించేవారు. పూలకుంట లోనూ, చుట్టుపట్ల గ్రామాలలోను రాత్రీ పూట పాటలు పాడుతూ , నినాదాలు చేస్తూ కాంగ్రెసు ప్రచారం చేసే వారు. సభ్యత్వం చేర్పించే వారు. భక్త రామదాసు, కృష్ణ లీల మొదలగు నాటకాలు నేర్చుకొని , టికెట్టు నాటకాలు ఆడేవారు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో నాటకాలు వేయడానికి కావాల్సిన పరదాలు, డ్రస్సులు, కొన్నారు. వీటిని లక్ష్మీస్వదేశీ ప్రెస్ యజమాని రాజా (కాంగ్రెస్) తక్కువ వెలకు యిప్పించినాడు. వీరు వాటిని బాడుగులకు యిచ్చి సంఘానికి డబ్బులు పోగుచేసేవారు. అపుడపుడు కల్లూరు సుబ్బారావు , పప్పూరు రామాచార్యులు, కె. రాఘవాచార్యులు, గొట్టిపాటిసుబ్బరాయ కవి, ఆర్. నాగేశ్వర రావు, జి. వెంకటరెడ్డి, వడ్డేనారాయణప్ప మొదలగు వారిని ఆహ్వానించి ఉపన్యాసాలు యిప్పించేవారు. మోదీన్ సాబ్ నాయకత్వంలో సంఘ సభ్యులు పూలకుంటే గాక చియ్యేడు, పసలూరు,దుర్గం మన్నీల మొదలగు గ్రామాలకు వెళ్ళి కల్లంగల్ల ముందు మద్యపాన వ్యతిరేక ప్రచారం చేసేవారు. కల్లు తాగొద్దని పాటలు పాడేవారు. కల్లు తాగేవాళ్ళ కాళ్ళు బిర్రుగా పట్టుకొని తాగొద్దని బతిమలాడేవారు. తాగుబోతులు ఎంత విదలించుకున్నా కాళ్ళను వీరు వదలేవారు కాదు.అందువల్ల తాగుబోతులు కొట్టేవారు. రాళ్ళు విసిరేవారు. కల్లు నెత్తిమీద పోసే వారు. పిల్లలను చెడగొడుతున్నాడని ఎరికిలప్పను బాగా తన్నేవారు. ఈ దేశభక్తులు ఆ తిట్లను , తన్నులను గౌరవాలుగా భావించి పరమ సంతోష పడేవారు. దేశం కోసం ఎంత బాధ అనుభవిస్తే అంత ఎక్కువ తృప్తి పడేవాళ్ళు.
అనంతపురంలో ఇదుకల్లు సదాశివన్ (స్వాతంత్ర్య సమర యోధుడు, జిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో ఒకరు )”కేశవ విద్యా నికేతన్ “హరిజన హాస్టల్” నిర్వాహకుడుగా ఉన్నారు. హాస్టలు విద్యార్థుల కోసం గ్రామాలు తిరిగి, ధాన్యం, డబ్బు వసూలు చేసేవాడు. ఈ పని మీద సదాశివన్ పూలకుంట కు వచ్చినపుడు వెంట ఎరికిలప్ప కూడా వచ్చేవాడు. ఆ రాత్రిపూట మోదీన్ సాబ్ మిత్రబృందం కాంగ్రెస్ పాటలు పాడుతూ ప్రచారంచేసి సభ ఏర్పాటు చేసేవారు. సదాశివన్ ఉపన్యాసం యిచ్చేవాడు. మరుసటి రోజు ఉదయం యింటింటికి తిరిగి ధాన్యం వసూలు చేసేవారు. వసూలు అయిన ధాన్యాన్ని మోదీన్ సాబ్, పూలకుంట సంజీవులు గాడుదల మీద వేసుకొని పోయి కేశవ విద్యానికేతన్ చేర్చేవారు. హాస్టలుకు వచ్చిన వీళ్ళకు సదాశివన్ రాజకీయాలు చెప్పేవాడు. కార్యకలాపాలు ఎట్లా వుధృతం చేయాలో చెప్పేవాడు. గ్రామంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయమని సలహా యిచ్చినాడు. గ్రంథాలయం ఎట్లా నిర్వహించాలో చెప్పి, కొన్ని పుస్తకాలు కూడా యిచ్చినాడు ఆ స్ఫూర్తితో మోదీన్ సాబ్
గ్రంథాలయం ఏర్పాటు చేసినాడు.
చరఖా సంఘం కూడా ఏర్పాటు చేసినాడు. కాంగ్రెసు సభ్యులైన చియ్యేడు గ్రామ కరణం రామ
చంద్ర రావు చరఖా సంఘం ఏర్పాటుకు గృహవసతి కల్పించినాడు.ప్రారంభ సభకు ఐదుకల్లు సదాశివన్ అధ్యక్షత వహించినాడు. బ్లాక్ డెవలప్ మెంట్ అగ్రి కల్చర్ డెమాన్ స్ట్రేట్ పతాకావిష్కరణ చేసినాడు. కలెక్టర్ యాగంటి గారు ఒకసారి సందర్శించినారు.
గుత్తి తాలుకా ఛాయాపురం గ్రామ నివాసి పత్తిపాటి రంగయ్య నాయుడు స్వాతంత్ర్య సమరయోధుడు.1941 వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొని వెల్లూరు, అల్లిపురం(బళ్ళారి ) జైళ్లలో ఆరు నెలలు శిక్ష అనుభవించిన వాడు. ఈయన “ కమ్ర మహారాజు” అనే పత్రిక నడిపేవాడు. అందులో గొట్టిపాటి సుబ్బరాయ కవి రైతు గేయాలు రాసేవాడు. ఈయన గ్యాదిగకుంటలో(పెనుగొండ తాలుకా నసనకోట యేరియా.) కమ్యునిస్టు నాయకులు సి. ముత్యాలప్ప దగ్గర ఉండేవాడు. ఈ సుబ్బరాయ కవి రాసిన “రైతు గేయాల”ను పాడుతూ ధనిక తత్త్వం నశించాలని , కూలి రేట్లు పెంచాలని యువజన సంఘ సభ్యులు నినాదాలు చేస్తూ గ్రామాలు తిరిగేవారు. అందువల్ల ఈ నినాదాలు గిట్టని ధనికులు, వైశ్యులు యువజన సంఘాన్ని వదలి పెట్టడమే కాక, వ్యతిరేకమైనారు కూడా . అయినా వీరు నినాదాలు మార్చలేదు, మానలేదు. అస్ప్రుస్యతా నివారణ ఉత్సవాలు జరిపే వారు. ఒకసారి చియ్యేడులో పెద్ద సభ జరిపినారు. పసలూరి ఎరికిలప్ప అధ్యక్షత వహించినాడు. ఆ రోజు గ్రామ కరణం రామచంద్ర రావు(బ్రాహ్మణుడు ) యింట్లో హరిజనుల తోనే వంటలు చేయించి ,సహపంక్తి భోజనం నిర్వహించినారు.
వ్యష్టి సత్యాగ్రహ సమయంలో సత్యగ్రహులను సిద్దం చేసే బాద్యత సదాశివన్ కు యిచ్చింది కాంగ్రెసు పార్టీ. ఆయన గ్రామాలు తిరిగి చాలామందిని సిద్దం చేసినాడు.పూలకుంటలో మోదీన్సాబ్, పూలకుంట సంజీవులు వారి మిత్రులను సిద్దం చేసినాడు. 27-02-1941న కరాది లక్ష్మిరెడ్డి, 02-03 -1941న యం ఖాజా హుసేన్, 03-03-1941న పూలకుంట సంజీవులు పెద్ద వూరేగింపుతో సత్యాగ్రహం చేసినారు. కానీ ప్రభుత్వం వీరిని అరెస్టు చేయ లేదు. అందువల్ల వీరికి చాలా నిరాశకలిగింది. మోదీన్ సాబ్ బదులు ఆయన సతీమణి శ్రీమతి రాబియాబీతో సత్యాగ్రహం చేయిద్దాం అని సదాశివన్ గారు ప్రతిపాదించినారు. అందుకు మోదీన్ సాబ్, రాబియమ్మలు సంతోషంగా అంగీకరించి నారు
బయటకు వచ్చిన స్త్రీలను అనేకులు అనేక రకాలుగా అనుకొనే సామజిక స్థితి అది. కాని,స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న స్త్రీలపట్ల జనం చాలా వినయవంతులై , గౌరవాభిమానాలు చూపినారు.సహాయ సహకారాలు అందించినారు. శ్రీమతి రాబియాబీ పుట్టపర్తి దగ్గరవున్న కొత్తచెర్వులో 06-04-1926 న జన్మించింది.వీరి తండ్రి యస్.మోదీన్ సాబ్ , తల్లి జైనబీ. ఏడవ తరగతి వరకు చదువుకుంది. హట్టిశంకరరావు అధ్యక్షతన 04 -03 -1941న అనంతపురంలో కో ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో శ్రీమతి రాబియాబీ సత్యాగ్రహం చేసింది. రాష్ట్రంలోనే మొదటి ముస్లిం యువతి సత్యాగ్రహిగా చరిత్రకెక్కింది. జవహర్ లాల్ నెహ్రూ , మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈమెకు ప్రశంసా పత్రాలు పంపినారు. Reference Asia companion- vol 11 లో Asia’s first who’s who of men & women of Achivevements and Distinction అనే పుస్తకంలో శ్రీమతి రాబియాబీ సంక్షిప్త జీవిత చరిత్రను ఫోటోతో సహా ప్రచురించినారు.
దేశమంతటా జరిగినట్లే అనంతపురం జిల్లాలో కూడా 1942లో క్విట్ యిండియా
ఉద్యమం ఉధృతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, ఫారెస్ట్ బంగళాలు కాల్చడం, టెలిఫోను తీగలు తెగ్గొట్టడం వగైరా విధ్వంసకర కార్యక్రమాలు చేపట్టినారు దేశభక్తులు. మోదీన్ సాబ్ మిత్రబృందం తాము కూడా ఏదో ఒక వీరోచిత కార్యక్రమం చేయాలని కాలేపెనుం మీద గింజలా చిటపట లాడినారు. చిగిచెర్ల దగ్గరకు పోయి 06-09-1942 రాత్రి “భారతమాతాకి జై “ అనే నినాదాలు చేస్తూ రైలు పట్టాలు పెరికేసినారు.సంఘవ్యతిరేకులు పోలీసులకు ఈ సమాచారం అందజేసినారు. 07-09 -1942 ఉదయమే పోలీసులు వచ్చి మోదీన్ సాబ్, కె.నరసింహా రెడ్డి, పూలకుంట సంజీవులు, చాకల గురప్ప, పాటూరు అక్కులప్ప , మన్నీల నరసింహా రెడ్డి మొత్తం ఆరుమందిని అరెస్టు చేసినారు. ఆ రోజంతా అనంతపురం పోలీసు స్టేషన్ లోనే వుంచి, మరుసటి రోజు కోర్టులో హాజరు పరచినారు. కోర్టు తీర్పు మేరకు సబ్ జైలులో ఉంచినారు. అదే జైలులో వివిధ కేసులకింద శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులు జి. వెంకట రెడ్డి, కె.యస్.రాఘవాచారి, గొంది కొండప్ప, బెల్లం కొండ నారాయణ శెట్టి ; కమ్యూనిస్టు నాయకులు నీలం రాజశేఖర్ రెడ్డి, ఐదుకల్లు సదాశివన్, వి.కె.ఆదినారాయణ రెడ్డి, ఆ జైలులోనే ఉన్నారు .
మోదీన్ సాబ్ 07-09-1942 నుండి 30-12 -1942 వరకు శిక్ష అనుభవించినారు. జైలునుండి బయటకు వచ్చిన తరువాత ఉపాద్యాయ వృత్తి చేపట్టినాడు. వివిధ ప్రాంతాలలో పనిచేసి చివర చియ్యేడు లో పదవీవిరమణ చేసినారు. శ్రీమతి రాబియాబీ గారు చియ్యేడులోనే పోస్టు మాస్టారుగా పదవీవిరమణ చేసినారు. వీరిద్దరూ జీవితాంతం కాంగ్రెసువారుగానే వున్నారు.
___విద్వాన్ దస్తగిరి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి