విమర్శకు విశాల ప్రాతిపదిక 'సర్దేశాయి'
డా|| సర్దేశాయి తిరుమలరావు ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకులలో ఒక ప్రత్యేక స్థానంగల విమర్శకుడు. విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అన్న కొడవటిగంటి కుటుంబరావుగారి అభిప్రాయానికి
అక్షరాలా సరిపడే విమర్శకులలో సర్దేశాయి ఒకరు. వైజ్ఞానికి శాస్త్రాలను అభ్యసించి శాస్త్ర సాంకేతిక రంగాలలో కృషి చేస్తూ సాహిత్య విమర్శకులలో సర్దేశాయి ఒకరు. “సాహిత్యతత్వం - శివభారత దర్శనం', 'కన్యాశుల్కం నాటకకళ' అనే రెండు
గ్రంథాలను, దాదాపు 250 వ్యాసాలను, లేఖలను రచించి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శను సుసంపన్నం చేసిన విమర్శకులు సర్దేశాయి. ఈయన కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా జొహరాపురంలో 28.11.1928న జన్మించారు. ఈయన మాతృభాష కన్నడం. ఉన్నత విద్య కోసం అనంతపురం వచ్చి దత్తమండల కళాశాలలో బియస్సీ చదివారు. రాజస్థాన్ లోని పిలానీలో బిర్లా కళాశాలలో యం.యస్సీ రసాయనశాస్త్రం చదివారు. అనంతపురం శ్రీసాయిబాబా జాతీయ కళాశాలలో
ఒక్క ఏడాది ఉపాధ్యాయుడుగా పనిచేసి, అక్కడి తైల సాంకేతిక పరిశోధన సంస్థలో 1954లో జూనియర్ కెమిస్ట్ గా చేరారు. క్రమక్రమంగా ఎదిగా ఆ సంస్థక సంచాలకులయ్యారు. 1986లో పదవీ విరమణ చేసి 10-05-1990న మరణించారు.
1965 ప్రాంతం నుండి భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, హిందూ,ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో ఆయన వ్యాసాలు, లేఖలు నిరంతరం వచ్చేవి.
ఆయన తనకు ఇష్టమైన మూడు గ్రంథాలున్నాయని అవి గురజాడ 'కన్యాశుల్కం', ఉన్నవ 'మాలపల్లి', గడియారం 'శివభారతం' అని చెప్పేవారు. మొదటి
రెండింటి మీద రెండు విమర్శగ్రంథాలు రాశారు. మూడవ గ్రంథం మీద అధ్యయనం చేస్తూనే మరణించారు.
సర్దేశాయిని సాహిత్య విమర్శకునిగా నిర్వచించాలంటే ఒక మంచి తులనాత్మక సాహిత్య విమర్శకునిగా పేర్కొనవచ్చు. కన్యాశుల్క నాటకకళనుగానీ శివభారత దర్శనాన్నిగానీ ఇతర వ్యాసాలను కానీ చదివిత మనకుపరిచయమయ్యేది
ఒక్క గురజాడ, ఒక్క గడియారం మాత్రమే కాదు. అసంఖ్యాకంగా ఇతర భారతీయ,విదేశీ రచయితల, రచనలు మనకు పరిచయం అవుతాయి.
కన్యాశుల్క నాటకాన్ని గురించి విమర్శ రాస్తూ, ఆ నాటకానికే పరిమితమైపోరు. ప్రపంచనాటక సాహిత్యంలో కన్యాశుల్క నాటకంతో సరిపోయే వాటన్నిటినీ ఒకచోట చేర్చి విమర్శిస్తారు.
సాహిత్యాన్ని సాహిత్యాంశాల పరిశీలనకే పరిమితం చేయరు. ఇతర కళలతో, శాస్త్ర సాంకేతిక మత రాజకీయ ఆర్థిక చారిత్రక విషయాలతో సమన్వయం చేస్తారు. పాఠకుల సంస్కారాన్ని విస్త్రతం చేయడం ఇటువంటి విమర్శకే సాధ్యం. శివభారత కావ్య నామౌచిత్యాన్ని చర్చిస్తూ కుందమాల,మహాప్రస్థానం, వేయిపడగలు వంటి సంస్కృత తెలుగు గ్రంథాలనే కాక రవీంద్రుని పోస్టాఫీసును, వాల్ట్ విట్ మస్ లీవ్స్
ఆఫ్ గ్రాస్ ను కూడా కలిపి చర్చించారు. ఈ చర్చను చదివిన పాఠకుడికి ప్రపంచ సాహిత్యంలో రచనలకు పేరు పెట్టడంలో గల మెలకువలు తెలుస్తాయి.
సాహిత్య విమర్శకుడుగా సర్దేశాయి దేశాల భౌగోళిక సరిహద్దుల్ని చెరిపి వేస్తారు. కన్యాశుల్కంలో గిరీశం నమ్మినవాళ్ళను మోసం చేయటం, స్వప్రయో
జనాలకు ఇతరులను ఇబ్బందులపాలు చేయడం వంటి విషయాలలో ఛార్లెస్ డికెన్స్ పిక్ విక్ పత్రాలలో జంగిల్ పాత్ర వంటివాడన్నారు. అంతేకాక గిరీశం కింగ్ లియర్ నాటకంలో ఫూల్ వంటి వాడని, మధురవాణి, ఎమిలీజోలా రచించిననానా నవలలో నానా అనే వేశ్యతో పోలికలు గలదని నిరూపించారు.
సాహిత్య విమర్శ కృతజ్ఞతారహిత ప్రక్రియ అని తెలిసిన సర్దేశాయి రచయితల పట్ల ఎంతో కృతజ్ఞతతతో విమర్శలు రాశారు. కవిత్వమంటే ఏమిటి అనే ప్రశ్నకు ప్రాచ్య, పాశ్చాత్యఅలంకారికులు అనేక నిర్వచనాలు చెప్పారు. అవన్నీశబ్ధం, అర్థం, అలంకారం వంటి వాటి చుట్టూ తిరిగాయి. సర్దేశాయి కవిత్వమంటేఏమిటి ? కవిత్వంవల్ల ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్నలకు సృజనాత్మక సమాధానం
చెప్పారు. కవిత్వం ఒక స్ప్రింగ్ బోర్డ్ అని చెబుతూ 'నడు నడు ముందుకు నడు'అనే ఐతరేయ బ్రాహ్మణ మంత్రం కవిత్వం అని, మార్క్స్, ఏంగెల్స్ ప్రచురించిన కమ్యూనిష్టు మానిఫెస్టోలోని కడపటి వాక్యం కవిత్వం అని, గాంధీ గర్జ న 'క్విట్
ఇండియా' కవిత్వం అని వాదించారు. కవిత్వం మనిషిని స్వావలంబునిగా, లోక శ్రేయోక్రియా పరునిగా ప్రేరేపించే ఉత్తమభావమని నిర్వచించారు.
సర్వేశాయికి భారతీయ అలంకార శాస్త్రాల మీద ఉన్న గౌరవం కొద్దిపాటిదే. సాహిత్యంలో
అలంకారవాదాలు దేహాభిమానం నుండివచ్చాయని, రస,పాక సిద్ధాంతాలు వంట ఇంటి నుంచి వచ్చాయ ని, చమత్కారవాదం సర్కస్ నుండి మ్యాజిక్ నుండి వచ్చిందని, వక్రోక్తి , ధ్వనివాదాలు పగటి వేషగాళ్ళ తత్వాలని, ఔచిత్యవాదం డ్రిల్ మాస్టర్ ప్రవత్తి
లేదా అత్తపోరు వంటిదని, రమణీయకత, సౌందర్యం, శయ్యావాదాలు భోగలాలసత నుండి వచ్చాయని సర్దేశాయి అభిప్రాయం, అలంకారిక సిద్ధాంతాలను ఎంతగా తిరస్కరించినా ధ్వని సిద్ధాంతం మీద ఆయనకొక గౌరవం ఉన్నది.
కావ్యాన్ని పరిశీలించే పద్ధతులు మూడున్నాయని సర్దేశాయి పేర్కొన్నారు. అవి
1. లక్ష్యానుసరణ పద్ధతి 2. లక్షణానుసరణ పద్ధతి 3. కవిమార్గానుసరణ పద్ధతి. వీటిలో మొదటిగా అంతగా ప్రమాదకారి కాదని, రెండవది పెద్దగా
అనుసరణీయం కాదని, మూడవది శ్రేష్టమైనదని సర్దేశాయి అభిప్రాయం. ప్రజల భాషను సాహిత్యంలో ఉపయోగించుకోవడం మీద సర్దేశాయికి గౌరవం ఉంది.
లోకోక్తులు కావ్యంలో ఉంటే కవిత్వస్థాయి పెరుగుతుందని, కవివాక్యాలు జనంలోకి
వెళితే జనం భాషకి గౌరవం పెరుగుతుందని ఆయన సిద్ధాంతం. ఈ విషయంలో శివభారతకవి అలెగ్జాండర్ పోప్ లాంటి వాడన్నారు. కవిత్వభాషలో సరళతను సర్దేశాయి గౌరవిస్తారు. ప్రజల భాషే కవిత్వ భాష కావాలని ఆయన అభిప్రాయం.
వచన ధోరణి కలిగిన పద్యకవిత అంటే సర్దేశాయికి ఇష్టం. కవిత్వంలో ఛందస్సు సాధించే ప్రయోజనం లయ అని ఆయన పేర్కొన్నారు. సృష్టిలో ప్రతి పదార్తంలోనూ ఒక లయ ఉందని, ఆ లయ కవిత్వం లో ప్రతిబింబిస్తుందని ఆయన సూత్రీకరించారు.
రెండు కాళ్ళు గల మనిషి ద్విపదను నిరాదరించే నాలుగు పాదాలు గల ఛందస్సును ఆదరించడం మనిషిలోన విపరీతబుద్ధి అంటారు సర్దేశాయి.
ప్రకృతిలో ఉన్నది ఉన్నట్లు చిత్రించడం కవి పనికాదని, అది ఫోటోగ్రాఫర్ దిఅని, ఉన్నదానిని సృజనాత్మకంగా చెప్పటమే కవి పని అని సర్దేశాయి భావన.కావ్యంలో నాటకీయతను దర్శించడం నాటకంలో కవిత్వాన్ని సర్దేశాయికి ఇష్టమైన
శిల్పం. అందరు రచయితల్లో కావ్య విశేషాలన్నీ లభించవని, ఒక్కొక్క కవిలోఒక్కొక్క విశేషం ప్రధానంగా ఉంటుందని ఈయన అభిప్రాయం. అందుకే తిక్కన, పింగళి సూరన, గౌరన నాటక కవులని, తిక్కన, తెనాలి రామకృష్ణుడు పాత్రోన్మీలనా శక్తి గల కవులని సూరన, గౌరనలు పాత్ర సృజనాత్మక శక్తిలో అద్వితీయులని
కీర్తించారు.
శివభారత కర్తృత్వం మీద వివాదం చెలరేగిన సందర్భంలో శివభారత కావ్యవిషయాల మీద దృష్టి పెట్టి 'శివభారత దర్శనం' రాసిన సర్దేశాయి, కన్యాశు
ల్కం నాటకమే కాదని ప్రచారం జరుగుతున్న సమయంలో 'కన్యాశుల్కం నాటకకళ రాశారు. సాహిత్య విమర్శలో వస్తుచర్చే ప్రధానమైపోయి, శిల్ప పరిశీలన చాదస్తంగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో 'కన్యాశుల్క నాటకకళ రాశారు. 'కావ్యంలోనూ నాటకంలోనూ కళను కని పెట్టి చెప్పడం కష్టం కాని, ప్రయోజనమున్నట్లు చెప్పడం
సుకరం' అనే అవగాహనతో ఈ గ్రంథం రాశారు సర్దేశాయి. కన్యాశుల్క నాటకంలో విభిన్న పాత్రలు మాట్లాడే మాటలన్నిటినీ గురజాడ వ్యతిరేకులు గురజాడకే అంట గట్టి ఆయన గౌరవ పతకాన్ని నేటి 'నవరసాల'లాగా వడగొట్టాలని ప్రయత్నిస్తుంటే ' కావ్యంలోని మాటలు ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పినారని విచారించడం సాహిత్య విమర్శలో మొదటి మెట్టు' అని గుర్తు చేశారు. మార్మీయ సౌందర్యశాస్త్రం సామాజిక పరిస్థితులలోంచే సాహిత్యం పుడుతుందనే అవగాహనతో సాహిత్య విమర్శలో సామాజిక నేపథ్యం వివరణకు ప్రాధాన్యమిస్తుంది. తిరుమలరావు దీనినిసమర్థిస్తున్నట్లుగా 'ఒక సమస్య ఉన్నందువల్లనే మహాగ్రంథం రాదు, గొప్ప రచయిత
ఉన్నందువల్లనే అది వస్తుంది' అని సూత్రీకరించారు. అలాగే గొప్ప గ్రంథం ఉన్నందువల్లనే సాంఘిక పరిణామం రాదు. సాంఘిక పరిణామం రాజకీయ శక్తుల వల్లనే సాధ్యమౌతుందని అన్నారు. 'కవితలో విప్లవం తేవడం వేరు, కవితతో విప్లవం తేవడం వేరు' అంటూ మొదటి దానికి గురజాడ, రెండవ దానికి కందుకూరి ప్రతినిధి అని ఆయన అన్నారు.
కన్యాశుల్క నాటకాన్ని భారతీయ నాటక లక్షణాలు ఆధారంగా పరిశీలించి అది నాటకం కాదని వాది స్తున్న పండితులకు కావ్యాన్ని పరిశీలించేటపుడు కవిఉద్దేశించిన సాహిత్య నియమాలను కావ్యాని కన్వయించాలిగాని బాహిరుడైనఅలంకారికుని లక్షణాలను ఝుళింపిచరాదు... లాక్షణికుని లక్షణాలు కూడాకావ్యంలో ఉన్నాయా? సరి, లేవా? కావ్యానికి వచ్చే లొచ్చులేదు, పోయే హెచ్చులేదు
అన్నారు.
కన్యాశుల్క నాటకంలో నాయికానాయకు లెవరని జరిగిన చర్చలో అలంకార శాస్త్రాల ప్రకారమైతే ఆ నాటకంలో నాయికానాయకులు కనిపించరన్నారు.అది నాయికానాయకులులేని, ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన పాత్రలున్న
నాటకమని తేల్చారు. కన్యాశుల్క నాటకంలో ఒక భావానికి ఒక పాత్రను సృష్టించే సంప్రదాయానికి భిన్నంగా గురుజాడ సామూహిక పాత్ర చిత్రణ చేశారని ఒక కొత్త విషయాన్ని చెప్పారు సర్దేశాయి. ముగ్గురు వితంతువులు, ముగ్గురు న్యాయ
వాదులు, ఇద్దరు అవధానులు - దీనికి సామూహిక పాత్రీకరణ లేదా పాత్ర సామూహీకరణ అని పేరు పెట్టారు. కన్యాశుల్క నాటకాన్ని నాటకమా, ప్రహసనమా అని చూడడం హ్రస్వదృష్టి అన్నారు. అది ఒక మహావ్యాజ్య మన్నారు. కన్యాశుల్క
నాటకం ప్రపంచ సాహిత్యంలోనే అరుదైనది అన్న శ్రీశ్రీ అభిప్రాయాన్ని నేటి నవరసాలలు చదువుకోకుండా అభ్యంతరం చెబుతున్నారు గాని, 1897 నాటికి
ప్రపంచ నాటక చరిత్రలో కన్యాశుల్కాన్ని నిలబెట్టి సర్దేశాయి పరిశీలించడాన్ని ఈ చెట్టుచాటు వీరులు చదువుకోవాలి. సర్దేశాయి మార్నిజాన్ని చదువుకున్నారుగాని ఆయన మార్క్సిస్టు కాదని కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సర్దేశాయి విమర్శను చదివితే వాళ్ళ పరిభాషలో మూర్ఖులెవరో తెలుస్తుంది. పాత్రశీల చిత్రణలో
సమంజసమార్గం కల వచ్చిందనో అశరీరవాణి చెప్పిందనో హఠాత్తుగా హృదయ పరివర్తనం చెందిందనో చెడ్డవాళ్లు మంచి వాళ్ళుగా మారినట్లు చెప్పకుండా కథ సాగాలి. 'మొలకెత్తి ఆకు తొడిగి, మొగ్గలేసి పూలు పూచి విరిసి గుభాళించేటట్లు
రాయడమే శ్రేష్టతరమైన కళ' అని సిద్ధాంతం చేసి మధురవాణి పాత్ర పరిణామాన్ని పరిశీలించిన తీరు ఒక ఇతిహాస రచనలో పాత్ర చిత్రణను పరిశీలించ డానికి నమూనాగా ఉంది. గిరీశం మంచివాడా చెడ్డవాడా అని పండితులు వాదించుకుంటూ ఉంటే, 'అతడు దేవాలయం మీద బూతుబొమ్మ' అని అన్నాడు సర్దేశాయి.
కన్యాశుల్క నాటకంలో హాస్యరసముందనే వాదాన్ని బాగా చర్చించారు. ఆ నాటకంలో నవ్వదగిన అంశాలకన్నా, నొవ్వదగిన అంశాలే ఎక్కువని, ఆ నాటకంలోని పాత్రలు ఏడవలేక నవ్వుతాయని తీర్పునిచ్చారు. కన్యాశుల్క నాటకం లో మానవత్వం,మనిషితనం ప్రధానమని అభిప్రాయపడ్డారు. మొదటి పేజీ తెరవగానే మనిషి వాసన వస్తుందన్నారు. మనుషులు తమ స్వస్వ రూపాలతో సుఖదు:ఖాలతో,జీవనపోరాటా లతో కనిపిస్తారన్నారు. ఆ నాటకంలో అగ్నిహోత్రా వధాని వంటివాళ్ళు మూసుకుపోయిన సమాజ ప్రతినిధులని, సౌజన్యారావు వంటి వాళ్ళు
తెరుచుకున్న సమాజ ప్రతినిధులని పరిశీలించడం కొత్తచూపు.
ఆస్కార్ వైల్డ్ రాసిన 'సమసమాజంలో మానవాత్మ' అనే పెద్ద వ్యాసాన్నిఅనువదించిన సర్దేశాయి 'మానవాత్మలో సమసమాజం' అనే వ్యాసాన్ని స్వయంగా రాశారు. సమసమాజనిర్మాణం కోసం ఆలోచించిన ప్రపంచ మేధావుల అభిప్రా
యాలను ప్రపంచసాహిత్యం ఆధారంగా పరామ ర్శించారు. సమాజంలో మార్పును గుర్తించటం మహాభారతకాలం నాటికే మొదలైంది అనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సర్ థామస్ మోర్, నీట్సే, బెర్నాడ్ షా, అరవిందుడు, గురజాడ, ఉన్నవ
లక్ష్మీనారాయణ, శ్రీశ్రీ, టాల్ స్టాయ్, జోనాథన్ స్విఫ్ట్ వంటి మేధావుల రచయితల అభిప్రాయాలను ఈ వ్యాసంలో సమన్వయం చేశారు. సమసమాజాన్ని ఆహ్వానిస్తూనే దాని సాధనలో పూర్తిగా మార్క్సిజమే ఉపయోగపడుతుందా అని చర్చించారు. ప్రాచీన సాహిత్యంలోనే కొన్ని సమసమాజ ఆలోచనలు ఉన్నాయని భావించేసంప్రదాయ వర్గానికి ప్రతినిధిగా కనిపిస్తూనే సర్దేశాయి వాళ్ళకు విభిన్నంగా
నిలబడతారు. రూసో గుర్తించిన సామాజిక సంకెళ్ళని కారల్ మార్క్స్ తెంచుకోమన్నారని,
రూసో సిద్ధాంతం భూస్వామయ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ విధానానికి దారితీయగా, మార్క్స్ సిద్ధాంతం పెట్టుబడిదారీ విధానం నుండి శాస్త్రీయ సమసమాజం వైపు దారితీస్తుందని సూత్రీకరించారు.
వర్తమాన సమాజంలో వర్తమాన సాహిత్యంలో ప్రస్తావనకు వచ్చే అనేకాంశాలను మన ప్రాచీన సాహిత్యంలో వెతికి చర్చించడం సర్దేశాయికి ఒక
అలవాటు. శ్రీశ్రీ పుడమి మనిషి భూమి మీద అవతరించినప్పటి నుండి ఉంది అని పేర్కొన్నారు. ఇందుకు రుగ్వేదం మొదలుకొని అనేకఉదాహరణలు ఇచ్చారు.
రాజస్థాన్ లోని సికార్ జిల్లా దేవరాల గ్రామంలో జరిగిన రూప్ కన్వర్ సతీసహగమనం ఆధారంగా పరిశోధన చేసి వేదాలలో సతీసహగమనం లేదని పురాణేతిహాసాల కాలంలోనే ఈ ఆచారం ప్రబలిందని తేల్చి చెప్పారు. నేటి మంత్రులకు, ఒకనాటి మంత్రులకు మధ్య సంపదలు సౌకర్యాలను గురించిన తేడాలను చర్చిస్తూ ' మంత్రులు నాడు, నేడు' అనే వ్యాసం రాశారు.చాణుక్యుని నిరాడంబర జీవన విధానాన్ని నేటి మంత్రులు సుఖలాలస భరితమైన జీవనాన్ని ఈ వ్యాసంలో పోల్చి చెప్పారు.
ఎయిడ్స్ వ్యాధి గుర్తించబడిన తొలి రోజులలో సర్దేశాయి పురాణాలలో ఎయిడ్స్ కేసులు అనే వ్యాసం రాశారు. మహాభారతంలోని విచిత్రవీర్యుడు, పాండురాజు, రఘువంశంలోని అగ్నివర్ణుడు ఈ ముగ్గురూ ఎయిడ్స్ వ్యాధితోనే మరణించారని
ఎయిడ్స్ అనే పేరు ఇవాళ వచ్చినా దీని లక్షణాలు ప్రాచీన కాలంలోనే భారతదేశంలో ఉన్నాయని చెప్పారు.
ఇలా ఎన్నో వ్యాసాలలో డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు తనఅధ్యయనంతో, వాక్పటిమతో తెలుగు సాహిత్య విమర్శను సుసంపన్నం చేశారు.
('చర్చ' గ్రంథం నుండి గ్రహింపబడినది)
__ డా॥ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి