హంద్రీనీవా



ప్రధాన నీటి వనరు హంద్రీనీవా 

డాక్టర్ శివరామకృష్ణయ్య గారు అనంతపురం జిల్లాలో సూపరిండెంట్ ఇంజనీరుగా ఉన్నప్పుడు జిల్లా కోసం అనేక నీటి పథకాలు సూచించారు. అంతవరకు అనంతపురం జిల్లా వాసులకు నీళ్లు లేవు అని సమాధానం వచ్చేది. ఇప్పుడున్న పీఏబీఆర్ రిజర్వాయర్ కూడా ఆయన రూపొందించిందే. ఆయన హంద్రీ నీవా రెండు నదులను కలుపుతూ ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు మళ్లించి సాగునీరు తాగునీరు అందించవచ్చునని సూచించారు. 1988లో స్వర్గీయ రామారావు గారు 40 టీఎంసీలకు పథకం ఆమోదించారు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు తాగునీటికి మాత్రమే అని 10 టీఎంసీలకు ఉరవకొండలో ఒకసారి, 1999లో 5 టిఎంసిల సామార్థానికి ఆత్మకూరులో రెండవసారి శిలాఫలకాలు వేయడం జరిగింది. డాక్టర్ శివరామకృష్ణయ్య సేవా సమితి తరపున ఈ పథకాన్ని 60 టీఎంసీలకు ప్రారంభించాలని జిల్లావ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించింది. అయితే డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడున్న పథకం మేరకు 40 టీఎంసీల సామర్థ్యానికి ఆమోదించారు. పనులు కూడా ప్రారంభించడం జరిగింది. 2005ను పనులు మొదలు పెట్టినా మొదటి దశలో అనంతపురం జిల్లాకు వాగ్దానం చేసినట్లుగా 1,18,800 ఎకరాల ఆయకట్టులో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేక పోతున్నారు. అడిగితే చెరువులకు ఇచ్చినామంటున్నారు. జీడిపల్లి నిర్మాణం పూర్తయి మొదటి దశ పూర్తయిందని ప్రభుత్వం చెబుతోంది. పిల్ల కాలువల నిర్మాణం ఇంకా శైశవ దశలోనే ఉంటే, రైతులకు నీళ్లు ఎలా ఇవ్వగలరు? ఈ లెక్కన రెండోదశలో అనంతపురం జిల్లా రైతాంగానికి 2,27,000 ఎకరాలకు నీరు ఇస్తామన్న నీరు ఎన్ని సంవత్సరాలకు ఇవ్వగలుగుతారో తెలియకున్నది. అయితే జీడిపల్లి ద్వారా మొదటి దశ అనంతపురానికి వచ్చిన కృష్ణా జలాలు ఈ విధంగా ఉన్నాయి.
2013-14. 5.353 టిఎంసిలు
2014-15. 12.581 టిఎంసిలు
2015-16. 5.960 టిఎంసిలు
2016-17. 26.307 టిఎంసిలు
2018-19. 26.943 టిఎంసిలు
2019-20. 30.632 టిఎంసిలు 

అయితే జిల్లాలో అందుబాటులో ఉన్న చెరువులకు నీళ్లు ఇస్తున్న కారణంగా గడిచిన 4-5 సంవత్సరాలుగా చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల ద్వారా రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు పోటీలు పడుతూ తమతమ నియోజకవర్గాలలో చెరువులకు నీళ్లు ఇవ్వాలని పోటీలు పడుతున్నారు. కానీ ఆమోదించిన ఆయకట్టుకు మాత్రం నీళ్లు ఇవ్వలేక పోతున్నారు. హంద్రీ నీవా సిస్టం కింద జిల్లాలో ఉన్న జలాశయాలు వాటి సామర్థ్యం ఈ విధంగా ఉన్నాయి.

(1) జీడిపల్లి రిజర్వాయర్

బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి గ్రామం వద్ద హంద్రీ-నీవా మొదటిదశ పథకం కింద దీనిని నిర్మించారు. దీని సామర్థ్యం 1,680 టీఎంసీలు.

(2) గొల్లపల్లి రిజర్వాయర్

పెనుకొండ మండలంలోని గొల్లపల్లి వద్ద 1,613 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.

(3) మారాల జలాశయం

బుక్కపట్నం మండలం లోని మారా ల గ్రామం వద్ద 0.465 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.

(4) చెర్లోపల్లి జలాశయం

కదిరి మండలంలోని చెర్లోపల్లి గ్రామం వద్ద 1.425 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.

          హంద్రీ నీవా పథకం కింద కాలువలు, తూముల నిర్మాణం అన్నీ నాసిరకంగా జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తుంగభద్ర ఎగువ కాలువ పథకం రెండవ దశ కింద నిర్మించిన పిఎజిఆర్ సుబ్బరాయ సాగర్, చాగల్లు, పెండేకల్లు, ముచ్చుకోట హాంద్రీ నీవా రిజర్వాయర్లు పథకం కింద మొదటి దశ కింద నిర్మించిన జీడిపల్లి రెండవ దశలో నిర్మించి గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, జలాశయాలన్నీ ఓటికుండలను తలపిస్తున్నాయి. జలాశయంలోని నీరు వూటల ద్వారా, కాలువలు కట్టి పారుతుండడం వల్ల చుట్టుపట్ల పొలాలను, గ్రామాలకు సమస్యగా మారింది. అద్భుత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన దశలో సాంకేతిక విద్యాధికుల పర్యవేక్షణలో నిర్మితమైన జలాశయాలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయో కారణాలు చెప్పలేకపోతున్నారు.. సాంకేతిక పరిజ్ఞానం లేని సామాజిక ఇంజినీర్లు వడ్డెరలు కాలంలో చదువు సంధ్యలు లేని నిర్మించిన చెరువులు వందల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉండడానికి కారణమేమిటో విజ్ఞానవేత్తలే చెప్పాలి.

1)గొల్లపల్లి జలాశయం నుంచి మడకశిర కు మంజూరు చేసిన బైపాస్ కెనాల్ పనులు చాలా నత్త నడకన జరుగుతున్నాయి. రాతి పొరలు ఉన్న చోట పనులు వదిలేసి, మట్టి మెత్తగా ఉన్న చోట మాత్రమె పనులు చేస్తున్నారని జల సాధన సమితి వారు ఆరోపిస్తున్నారు ఈ విధంగా పనులు జరిగితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేవలం సిబ్బంది జీతాలకు సరిపడ నిధులు కోసమే అన్నట్లు అరా కొర నిధులు విడుదల చేస్తున్నారు. పనుల వేగం పెంచి నిధుల కొరత లేకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిది.

2.) జగన్మోహన రెడ్డి గారు అనంతపురం జిల్లాలో 10.10.2019 న జరిపిన పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తను ఈ జిల్లా మనవడిని అని చెప్పి ఇపుడున్న ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2800 క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 6 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతూ, మరో నాలుగు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో సమాంతర కాలువ నిర్మిస్తానని ఒక వాగ్దానం ఇచ్చి పోయారు. వాగ్దానానికి వయస్సు నాలుగు సంవత్సరాలు. కానీ ఇంత వరకూ దాని ఊసే లేక పోవడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి తన వాగ్దానాన్ని నిలుపుకుంటూ వెంటనే పనులు మంజూరు చేయాలి. పనులు మొదలు పెట్టి విశ్వసనీయత చూపాలి.

3) ధర్మవరం నియోజక వర్గం పరిధిలో నిర్మిస్తున్న జిల్లేడు బండ రిజర్వాయరు నిర్మాణం ఆ ప్రాంత రైతులలో భయం, మనోవేదనకు గురి చేస్తున్నది. 2020లో 680 కోట్లతో మంజూరు అయిన ఈ పథకం 23 వేల ఎకరాలకు సాగు నీరు వాలు ద్వారా అందించడానికి, పరిసర గ్రామాలకు తాగు నీటి సౌకర్యం కల్పించడానికి ఈ ప్రాజెక్టును నిర్మిస్తామంటున్నారు.
అందుకోసం 2.41 టియంసిల నీటిని హంద్రి నీవా కాలువ ద్వారా మళ్ళిస్తామని అంటున్నారు. ఇందుకోసం 2327 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉందని, ప్రస్తుతం రిజర్వాయరు నిర్మాణానికి 1738 ఎకరాలు సేకరించి 2022 నుంచి హైదరాబాదుకు చెందిన ఒక కాంట్రాక్టు సంస్థ పనులు చేస్తోందని చెబుతున్నారు. భూసేకరణకు గెజెట్ కూడా ఇచ్చినారు. చాలా సంతోషం. అయితే గెజెట్ నోటిఫికేషన్ లో గ్రామం, మండలం, జిల్లా పేర్లతో సహా రైతు పేరు, సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణం సేకరిస్తున్నది, దేని కోసం సేకరిస్తున్నది అన్న వివరాలు తెలుపాలి. విచిత్రమేమంటే గెజెట్ నోటిఫికేషన్ లో రైతు పేరు సర్వే నెంబరు తప్ప ఎంత వేస్తీర్ణం సేకరిస్తున్నది పేర్కొన లేదు. దీనితో తమ భూములు ఎంత విస్తీర్ణంలో తీసుకుంటున్నారో తెలియని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. MLA చుట్టూ తిరుగుతున్నా గదమాయింపులు తప్ప ఫలితం ఉండడం లేదు. ఏ రైతు భూమి ఎంత విస్తీర్ణంలో సేకరిస్తున్నది గండికోట రహస్యం లాగా మారి పోయింది. అసలు రైతులకు ఏ పరిహారం చెల్లించకనే భూములు స్వాధీనం చేసుకోవడం పూర్తిగా అన్యాయమైనది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం లో సంక్షేమం- అభివృద్ధి రెండు మనిషికి రెండు కళ్ళ లాంటివి. అభివృద్ధిని మరిచి సంక్షేమం మాత్రమే కొనసాగిస్తే సమాజం ముందుకు నడవ లేదు.

ఉభయ జిల్లాల్లో తీరని తాగునీటి నీటి సమస్య - కానరాని జల్ జీవన్ పథకం.

ఈ జల్లాలలో మొదటినుంచి తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. గుంతకల్, హిందూపురం లాంటి కొన్ని పట్టణ ప్రాంతాలతో సహా గ్రామీణ ప్రాంతాలలో చాలా గ్రామాలకు నీటి వసతి ఉండడం లేదు. తాగు నీటి పంపిణీ పథకాలు ఎక్కువ భాగం భూగర్భ జలాల మీద ఆధార పడి ఉన్నాయి. కొన్ని గ్రామాలలో బోర్లకు అందనంత లోతుకు భూగర్భ జలాలు పడి
పోవడం చేత ఏ మాత్రం తాగడానికి పనికి రాని నీటినే వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులు ప్రధాన నది పెన్నా దాని ఉప నదులు. కేంద్ర జలవనరుల శాఖ 2014 లో ప్రచురించి విడుదల చేసిన "పెన్నార్ బేసిన్" లో అప్పర్ పెన్నా లో భాగంగా ఉన్న అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలలో హానికర రసాయనాలు, ఖనిజ లవణాల శాతం ఎక్కువగా ఉందని, పశువులతో పాటు మనుషులు కుడా తాగడానికి పనికి రావని పేర్కొన్నారు. (pennor basin page 47) అంతే కాకుండా ఈ నీటితో పండించే పంటలలో దిగుబడులు రావని, కేవలం క్షార నీటితో పండగల వరి పంట మాత్రమె సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ నీటి వియోగం వల్ల గ్రామీణ ప్రాంతాలలో 30-35 వయస్సు వారిలో కూడా
మూత్ర పిండాల సమస్యలు, కాన్సర్ లాంటి కేసులు పెరుగుతున్నాయి. 

గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 17,989 కోట్లతో రాష్ట్రం లోని 9 జిల్లాలలో (13 జిల్లాలు గా ఉన్నప్పుడు) జల్ జీవన్ పథకం ప్రారంభించి ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా ప్రతి మనషికి రోజుకు 55 లీటర్ల అవసరం చొప్పున రక్షిత మంచినీటిని అందిస్తానని ప్రకటిచింది. తీవ్ర సమస్య ఉన్న ప్రాంతాలలో మొదటగా పనులు ప్రారంభించి మార్చ్ 2024 నాటికల్లా పూర్తి చేస్తానని ప్రకటించింది..(సాక్షి 19.2.2022). ప్రకటించి సంవత్సర కాలం గడుస్తున్నా ఇంతవరకూ ఈ పథకం జాడ కనపడ్డం లేదు. వెంటనే ఈ పథకం ప్రారంభించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలిసి ఉంది.

చెరువులు, కుంటలను నీటి పారుదల కాలువతో అనుసంధానం చేయాలి.

నీటి పారుదల కాలువలతో గ్రావిటి ద్వారా చెరువులను, కుంటలను అనుసంధానం చేయాలని, చెరువులు లేని చోట కొత్తగా చెరువులను తవ్వాలని గత సంవత్సరం సెప్టెంబరు మాసంలో ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేసించినట్లుగా పత్రికలలో వార్తలు వచ్చినాయి (సాక్షి 10.9.2022). ఈ ఉభయ జిల్లాలలో పెన్నా దాని ఉపనదుల మీద 14 మైనర్ బేసిన్ లలో 1374 చెరువులు,2094 కుంటలు ఉన్నాయి. ఒక్కొక్క బేసిన్ లో చెరువులు, కుంటలు కలిపి ఒక దానితో మరొకటి గొలుసుకట్టుగా అనుసంధానింప బడి ఉన్నాయి. 14 చోట్ల నీటి పారుదల కాలువలతో అనుసంధానింప బడితే అన్ని చెరువులకు, కుంటలను నింప వచ్చును. అవసరమైన చోట్ల చెరువులను, కుంటలను తాగునీటి రిజర్వాయర్లుగా ఉపయోగించవచ్చును. ఈ మధ్య ప్రభుత్వం కొన్ని చోట్ల ఎంపిక చేసిన చెరువుల మరమ్మత్తును చేపడుతోంది. ఇది శాస్త్రీయ మైనది కాదు. ప్రతి మైనర్ బేసిన్ చెరువులు కుంటలతో కూడిన ఒక స్వతంత్ర వ్యవస్థ. ఫీడర్ చానల్లతో సహా మొత్తం మైనర్ బేసిన్ వ్యవస్థలోని చెరువులు కుంటల మరమత్తులు చేపట్టాలి.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

The unexplored relics of Rayalaseema

కదిరి