కదిరి ప్రాంతంలో ఉపాధి
కృష్ణదేవరాయల పాలన తర్వాత రాయలసీమ పాళెగాళ్ల రాజ్యమయింది.కదిరి కూడా కొక్కంటి పాళెగాడు కొండమ నాయుడు మొదలైన పాళెగాళ్ల పాలనలో ఉండింది. వీరెవరూ సామాన్య ప్రజల్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత, పాళెగాళ్లను బ్రిటిష్ వాళ్లు అణచివేశాక, కొంతమేరకైనా రాయలసీమ మేము సుస్థిరపాలనలోకి వచ్చింది. భూములు సర్వే చేయబడ్డాయి. కె.సి కెనాల్ బ్రిట్రస్ వాళ్ల ప్రయోజనార్థమైనా, తర్వాతి కాలంలో కర్నూల్-కడప జిల్లా రైతాంగాన్ని కొంతమేరకు సుభిక్షం చేసింది. వరుస కరువులతో సతమతమైన రాయలసీమ ప్రజల భూముల దాహార్థి తీర్చేందుకు రాయల కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలు పాళెగాళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మన్రోలాంటి బ్రిటీష్ గవర్నర్లు వాటిని పునర్నిర్మాణం చేసి, ప్రజల, భూముల దాహార్తిని తీర్చారు.
అనంతపురంలో ఐదు జిల్లాలకు ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కర్నూల్లో మిషనరీ హైస్కూల్లు ప్రారంభించబడ్డాయి. (ఆ తర్వాత స్వతంత్ర భారతంలో 1968 వరకు అనంతపురం జిల్లాకు మరొక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా రాలేదు. మన్రో పాలనా కాలాన్ని (1800-1807) ఇప్పటికీ 'స్వర్ణయుగంగా' అనంత(కదిరి)వాసులు భావిస్తున్నారంటే, ప్రజల ప్రయోజనాల పట్ల తర్వాతి పాలకులు ఎంత నిర్లక్ష్యం చూపారో అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి అనంతపురం జిల్లా కేవలం తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉంది. రకరకాల కారణాల వల్ల తుంగభద్ర నుండి జిల్లాకు కేటాయించిన నీరులో సగం కూడా రావడం లేదనేది చేదు నిజం. ఇప్పుడున్న కాలువకు సమాంతర కాలువ నిర్మించడమే అనంతపురం జిల్లావాసులు వారివాటా తుంగభద్ర పొందేందుకు ఏకైక మార్గమని ఎంతోమంది ఇంజనీర్లు చెప్పినా పట్టించుకున్న నాయకుడు లేడు.
రాయలసీమ ప్రాంతానికి ఏకైక జలవనరు క్రిష్ణా నది. ఇప్పుడు అందుతున్న నీరు ఇక్కడి ప్రాంత అవసరాలకు ఏ మాత్రం చాలదని అందరికీ తెలుసు. రాయలసీమలో మిగులు జలాలపై ఆధారపడే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు రాజశేఖరరెడ్డి. తగినంత నీరులేదు. ఎత్తిపోతలకవసరమైన విద్యుచ్ఛక్తి లేదు గాని, కాలువ మాత్రం తవ్వారు. రాయలసీమ వాసులు తమకు ప్రత్యేకంగా వేరే ప్రాంతం నుండి నీరు అందించమనడం లేదు. తమకు కృష్ణా జలాలలో ఉన్న న్యాయమైన వాటానందివ్వాలని మాత్రమే కోరుతున్నారు. కృష్ణా జలాల విషయంలో గతంలో పాలకులు ఇచ్చిన హామీలను అమలు పరచాలి.
1. ప్రాంతాల వారీగా వర్షపాతపు నిష్పత్తి 2) భూమి స్వభావం 3) జనాభా 4) తాగు, సాగు నీటి అవసరాల బట్టి నీటివనరు పంపిణీ చేయాలి. నీటివనరులు లేని చోటికి నీటిని అందించాలి తప్ప, వర్షపాతం తక్కువ, ఎత్తైన ప్రాంతాల నే పేరుతో, ప్రాంతాల వివక్షతకు గురిచేయకూడదు. అప్పుడే కదిరికి పుష్కలంగా నీరు అందుతుంది.
కేంద్ర సాగునీటి కమీషన్ అభిప్రాయం ప్రకారం, యే ప్రాంతమైనా జనజీవనానికి అనుకూలంగా వుండాలంటే. ఆ ప్రాంతంలోని సాగుకు యోగ్యమైన భూమిలో కనీసం 30% భూమికి నీటి వసతి వుండాలి. ఇప్పుడు కదిరిలో సాగుకు యోగ్యమయ్యే భూమిలో నీటివసతిగల భూమి కేవలం 13-14% మాత్రమే. కదిరి వ్యథలు, కన్నీటి గాథలు, ఎన్నిసార్లు చెప్పుకున్నా చిటికెడు సానుభూతి లభిస్తుందే గాని, మరే ఫలితం వుండదు.
దేశంలోనే అత్యధికంగా వెనుకబడిన 52 జిల్లాలో రాయల సీమలోని 4 జిల్లాలు వుండటం గమనార్హం. ఇక్కడ 4 జిల్లాలలో అత్యల్ప వర్షపాతం. అందులోనూ, అనంతపురం రాష్ట్రంలోనే అత్యంత వర్షపాతంగల జిల్లా - చాలామంది మేధావులనబడే వారు కదిరి వెనుకబాటుతనానికి ప్రకృతిని నిందించడం పరిపాటయింది. కాని, ఆ అభిప్రాయంతప్పు. వనరుల పంపిణీలో అన్యాయం జరగడం వల్లే కదిరి వెనుకబడి ఉంది.
కదిరి ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ఒక 1000 మందికి కూడా ఉపాధి కల్పించే పరిశ్రమలు గానీ, కేంద్ర, రాష్ట్ర, విద్య, వైద్య సంస్థలను గాని ఈ ప్రాంతంలో నెలకొల్పలేదు.
గుజరాత్ అభివృద్ధి', 'ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ గా మార్చడం, 'రాష్ట్రాన్ని సింగపూర్ చేయడం' లాంటి ప్రచారాలు జనాలను భ్రమల్లో ఉంచుతున్నాయి. గుజరాత్ చూసినవారు గాని, ఒకవేళ చూసినా, అక్కడి దళితుల, మైనారిటీల, పేదల పరిస్థితులను తెలుసుకున్న వారు గాని ఎవరూ లేరు. ఇక రాష్ట్ర విషయానికి వస్తే ''సింగపూర్' తరహా అభివృద్ధి సాధ్యమా? దాని విస్తీర్ణమెంత, జనాభా ఎంత? అక్కడి భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం ఇవేమీ అధ్యయనం చేయకుండా, కనీసం తెలుసుకోకుండా వాటిని నమ్మడం చాలా అవివేకం. ప్రధాన ఉపాధి కల్పనారంగం, మెజారిటీ ప్రజల బతుకు దెరువు అయిన వ్యవసాయాన్ని గురించి గాని, దానికి దోహదం చేసే నీటిపారుదల గురించి గాని ఎవరూ మాట్లాడడం లేదు. సామాన్య రైతు ఎటూ మాట్లాడలేడు. ఆకాశం వైపు చూడడం తప్ప, మరేమీ చేయలేని దుస్థితి. ఇక యువత, విద్యావంతులు, ఉద్యోగులే వ్యవసాయ రంగ అభివృద్ధి గురించి ఆలోచించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి