కరువుసీమ కదిరి శ్రామికుల వలస భారతం



కరువుసీమ కదిరి శ్రామికుల వలస భారతం

       రాయలసీమ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉంది. శతాబ్దాలుగా ఇది కరువు ప్రాంతం అయిపోయింది. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం మెట్టభూములే. కొన్నిచోట్ల పాక్షిక నీటిపారుదల సౌకర్యం ఉంది. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది 67.29 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ కోటి 30 లక్షల జనాభా వుంది. సాగుభూమి 24.16 లక్షల హెక్టార్లు. ఇందులో 5.57 లక్షల హెక్టార్లలో (23 శాతం) భూగర్భ జలాలతో, కొంత భాగం నదుల నీటితో వ్యవసాయం కొనసాగుతున్నది. ఈ ప్రాంతంలో 14.9 లక్షల హెక్టార్లలో(22 శాతం) అడవులు ఉన్నాయి, వీటిలో ఎక్కువ భాగంలో చెట్లు కూడా ఉండవు. ఇక్కడ భూగర్భ జలాలతో, నదుల నీటితో సాగే వ్యవసాయంపై ఆధారపడటం కూడా కష్టమే. ఇక్కడ పరిశ్రమలు తక్కువ, వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ జీవనంకొనసాగిస్తుంటారు. అందువల్ల తరచుగా కరువులు కూడా తప్పడం లేదు. వార్షిక సగటు వర్షపాతం అంటే నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో కలిపి 350 నుంచి 650 మిల్లీమీటర్ల వరకు ఉంది (ప్రసాద్ పురేంద్ర, 1998),

           1996 నుంచి ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా ఇక్కడ కరువులు చోటుచేసుకుంటున్నాయి. గత 14 సంవత్సరాలలో రెండుసార్లు మాత్రమే పంట చేతికి వచ్చిందని ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు 2012 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. 1999- 2017 సంవత్సరాలలో 3వేల మంది రైతులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాలంలో వలస కార్మికుల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా వ్యవసాయ కూలీలు, చిన్న, మధ్యతరగతి వారు, ధనిక భూస్వాములు కూడా, గత దశాబ్దంలో తప్పనిసరి పరిస్థితులలో వలసలు పోతున్నారనేది జగమెరిగిన సత్యం.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 25 లక్షల ఎకరాలలో సేద్యం చేస్తున్నారు. దీనిలో వేరుశెనగ ఎక్కువ. రైతులలో 90 శాతం చిన్న, సన్నకారు రైతులే. ఈ 25 లక్షల ఎకరాలలో 2013-2017 సంవత్సరాల నుంచి సాగుకు పనికి వచ్చే మూడోవంతు భూమిలో నీటి వనరులు సరిగా లేనందువల్ల సాగుచేయడం సాధ్యం కాలేదు. అందువల్ల ప్రజలు తప్పనిసరి పరిస్థితిలో వలస పోతున్నారు. మరో 20 శాతం రైతులు విత్తనాలు సరిగా మొలవక పెద్దఎత్తున నష్టపోతున్నారు. అనంతపురం జిల్లాలో 2లక్షల బోరు బావులు ఉన్నట్టు అంచనా. వీటిలో మూడింట రెండు వంతులు ఎండిపోయాయి. ప్రస్తుతం 30,000 బోరు బావులు మాత్రమే పనిచేస్తున్నాయి . భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్నందువల్ల భూగర్భజల మట్టం తగ్గుతున్నది. ఎండిపోతున్న బోరుబావుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ, పంటలు దెబ్బతింటున్నాయి. నిమ్మ. బత్తాయి, దానిమ్మ, అరటి, బొప్పాయి తోటలు కూడా ఎండిపోతున్నాయి.

          కొంతమంది రైతులు వేరుశనగకే పరిమితం కాకుండా కర్బూజా, దానిమ్మ, టమాటా, కాకర, మిరపకాయలు పండిస్తున్నట్టు క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనంలో తెలిసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది నీటివనరులను గుర్తించి, చౌకగా భూములు కొనుగోలు చేసి, దానిమ్మ, జామ, మామిడి పండ్ల తోటలను పెంచుతున్నారు. అనంతపురం బెంగళూరుకు దగ్గర. అందువల్ల వాస్తవ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కేవలం లాభార్జన కోసం ఈ భూములను కొనుగోలు చేస్తున్నారు. గొర్రెలు, పశువులు తమ భూములలో ప్రవేశించకుండా ఫెన్సింగ్ వేస్తున్నారు.   
               వరుసగా ప్రతి ఏటా కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయి. అందువల్ల రైతులు ఉద్యోగాల కోసం, పశువుల మేతకోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడం మినహా వేరే ఏమీ చేయలేకపోతున్నారు. పశువుల మేతకు కొరత ఏర్పడటంతో పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. భూమి దున్నడానికి పశువులు లేకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు కూడా ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నట్లు తెలుస్తున్నది. సేద్యంచేస్తున్న భూములలో కూడా భూగర్భ జలాలు తగ్గిపోవడంతో, బోర్లు ఎండిపోతున్నాయి. అందువల్ల కొత్త బోరుబావుల కోసం రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తున్నది. ఫలితంగా వారు రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. నిరుపేదలు అవుతున్నారు.

        కదిరి ప్రాంతంలోని 120 గ్రామాలలో కర్బూజా సాగుచేయడంతో కొంతమంది విత్తన విక్రేతలు అందరికీ విత్తనాలు సరఫరా చేయలేక నకిలీ విత్తనాలు అమ్మి బాగా సొమ్ము చేసుకున్నారు. కిలో కర్బుజా విత్తనాలు 30 వేల నుంచి 35వేల రూపాయల వరకు పలుకుతాయి. నకిలీ విత్తనాల వల్ల ఈ ప్రాంతంలో రైతులకు పెద్ద ఎత్తున కష్టాలు వచ్చాయి. "నకిలీ విత్తనాల గురించి వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటి బిల్లులు తీసుకురమ్మని చెప్పారు. మేము ఏ రోజు పురుగుమందులకు కానీ విత్తనాలకు గాని బిల్లులు అడగలేదు. వారు ఇవ్వలేదు." అంతేకాకుండా వారు చెప్పిందేమంటే, "నకిలీ విత్తనాలతో పాటు ఏ కారణంగా నష్టపోయినప్పటికీ మమ్మల్ని ఆదుకునే నాథుడు లేడు. విత్తనాల విక్రేతలకు వ్యవసాయాధికారులతో, రాజకీయ నాయకులతో దగ్గర సంబంధాలు ఉన్నందువల్ల ప్రభుత్వ అనుమతులు లేకుండానే విత్తనాలు అమ్ముతున్నారు." అని వారు గోడు చెప్పుకున్నారు.

ఈ పరిస్థితులలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు, ధనిక రైతులు కూడా వలసలు పోతున్నారు. వలసల వ్యూహం ఎలా ఉంటుందంటే కొంతమంది ప్రతిరోజూ పనికి వెళుతుంటారు. కొంతమంది సీజన్లో వెళతారు. మరికొంతమంది శాశ్వత ప్రాతిపదికన వలసపోతారు. ఈతోడు గ్రామానికి చెందిన ఉత్తన్న అనే రైతు " బోరుబావులు ఎండిపోయి, తాను ఆరు లక్షల రూపాయల మేర అప్పులపాలైనాను" అని తెలిపాడు. అప్పులు చెల్లించకపోతే తమకున్న ఒకే ఒక జీవనాధారమైన భూమిని అమ్ముకోవలసి వస్తుందన్నాడు. ఈ గ్రామంలో దాదాపు పదిమంది బి.టెక్. పాసైన వారు ఉన్నారని, వారు నిరుద్యోగులని, వారు కొద్ది నెలలు గ్రామంలో పనిచేస్తారని, తర్వాత వలస పోతారని తెలిసింది. గ్రామంలో మగవారికి 120 రూపాయల కూలి దొరుకుతుంది. కానీ సమీపంలోని పుంగనూరు వెళితే 250 రూపాయల వరకు లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తారు. రాత్రి ఇంటికి చేరుకునే సరికి 10:00 అవుతుంది. గత మూడు సంవత్సరాలలో పశువులను అన్నిటినీ అమ్మివేశామని అనేకమంది రైతులు వెల్లడించారు. గ్రామంలోని యువత పనుల కోసం బెంగుళూరు వెళతారు. పెద్దవారైనా స్త్రీ, పురుషులు రోజువారి పద్ధతిన సమీపంలోని చిన్న చిన్న పట్టణాలకు వెళ్లి పనులు చేసుకుంటారు. ఆవిధంగా పిల్లలను హాస్టల్లో చేర్పిస్తారు. వృద్ధులు గ్రామాలలో ఉండిపోతారు. గత రెండు దశాబ్దాలుగా నిరవధికంగా సాగుతున్న కరువు పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు మరింత దిగువకు దిగజారుతున్నాయి. వ్యవసాయంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. వివిధ గ్రూపుల వారు వలసపోవడానికి వేరు వేరు వ్యూహాలను అనుసరించవలసిన తప్పనిసరి సరిస్థితి ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకారం సత్యసాయి జిల్లాలో 701779 ఎకరాలు భూమి సాగు కావలసి ఉండగా. సకాలంలో వర్షం రాక 243399 ఎకరాలు (35 శాతం) మాత్రమే 2023 లో సాగు అయింది. ఇందులో వేరుశనగ పంట సాధారణంగా 632590 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 74 వేల ఎకరాలు మాత్రమే పంట సాగు అయింది ఈ 2023లో. 
 కంది పంట 72896 ఎకరాలు గాను 27182 ఎకరాలు మాత్రమే 
సాగయింది. మొక్కజొన్న పంట 32124 ఎకరాలకు గాను 13590 ఎకరాలు మాత్రమే సాగయ్యింది.
చిరుధాన్యాలు 44479 ఎకరాలకుకు గాను 19027 ఎకరాలు మాత్రమే సాగయింది. మిగిలిన మొత్తం భూమి అంతా కూడా బీడు భూములుగా ఉన్నాయి.
           రైతులు వ్యవసాయ పెట్టుబడులు పెట్టినతీవ్రంగా నష్టపోతున్నారు.
  రైతుల అన్ని రకాల అప్పులు మాఫీ చేయాలి. పంట పెట్టుబడుల కోసం రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వాలి. పంట పెట్టి నష్టపోయిన రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరానికి 40 వేల రూపాయలు ఇవ్వాలి. ఇతర పంటలు బొప్పాయి టమాటా ఆర్టికల్చర్ పంటలు అన్నిటికీ కూడా ఈ ఎకరానికి 50వేల రూపాయలు ఇవ్వాలి.


వలసపోయిన వారి దయనీయ పరిస్థితులు 

1. వలసపోతున్న వారిలో ఎక్కువమంది కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వలన పోతున్నట్టు తెలిసింది. వారిలో ఎక్కువమంది బిచ్చమెత్తుకుంటున్నారు. కదిరిలో కొంతమంది ఆదివాసి, ముస్లిం మహిళలు వేశ్యావృత్తికి పాల్పడే దుస్థితికి నెట్టబడినారు. మధ్య తరగతికి చెందిన రైతులతో పాటు ధనిక రైతులు కూడా వలసపోయి పెట్రోల్ పంపులలోను, సెక్యూరిటీ గార్డులుగాను పనిచేస్తున్నట్టు తెలిసింది.

 2. గ్రామాలలో ఉండిపోయిన వృద్ధులతో మాట్లాడే దిక్కుకూడా లేరు. వలసపోయినప్పుడు పనిలోనూ, జీవితంలోనూ కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయని తెలిసినప్పటికీ వారికి వలసపోక తప్పడంలేదు. వారు వంతెనల కింద, దేవాలయాలలో, శిథిలమైన ఇళ్లలో, పేవ్మెంట్లల పైన నివసిస్తూ కాలం వెళ్ళదీయవలసి వస్తున్నది. 

3. దండువారిపల్లెలో 40 ఎకరాల భూమి ఉన్న ధనిక రైతులు కూడా సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. 30 లేదా 40 ఎకరాల భూములున్న ఆసాములు కూడా వలసపోవడం ఇక్కడ పెద్ద విశేషమేమీ కాదు. ఇంతకు పూర్వం ఎస్.సి., ఎస్.టి., ఇతర వెనుకబడిన వర్గాల వారు వలసపోయేవారు. కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి అగ్రకులాల వారు కూడా వలసపోవడం మామూలైపోయింది. అయితే గ్రామాలలో భూములు ఉన్నందువల్ల వలసల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయంపై ఖర్చు పెడుతున్నారు. వరుసగా కరువులు, పంట నష్టం వస్తున్నప్పటికీ వారు వలసతో వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయం పై వెచ్చిస్తున్నారు. వాటితో రుణం తీర్చుకోవాలని వారి తాపత్రయం. ఇతర సామాజికవర్గాల కంటే అగ్రకులాల వారిలో వ్యవసాయం కొనసాగించాలన్న కోరిక తీవ్రంగా ఉంది.

          వలస వెళ్లిన వారు పండుగలకు మాత్రమే తిరిగి వస్తుండేవారు. కానీ చౌక బియ్యం తీసుకోడానికి రాష్ట్రప్రభుత్వం బయోమెట్రిక్ పద్ధతిని, వేలిముద్రల పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రతి అంశాన్ని బయోమెట్రిక్ విధానంతో ముడిపెట్టారు. వారు చౌక బియ్యం వదులుకోడానికి సిద్ధపడినప్పటికీ రేషన్ కార్డు గుర్తింపు కోల్పోవడానికి సిద్ధంగా లేరు. భవిష్యత్తు అభివృద్ధి కోసం అంటే హెల్త్ కార్డులు, ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఏ. కార్డులు, పంట రుణాల మాఫీ, ఇన్సూరెన్స్, సబ్సిడీలు కోల్పోవడానికి వారు సిద్ధంగా లేరు. అందువలన నెలకోసారి వచ్చి తమ గుర్తింపు పోకుండా ప్రభుత్వ సౌకర్యాలను బయోమెట్రిక్ ద్వారా పొందుతున్నారు. దీనివల్ల వారిపై అదనపు భారం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
 నిజానికి వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, తదితర ప్రయోజనాలు రాజకీయ లబ్ధికోసం కల్పిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడయ్యింది. వాస్తవమైన సమాచారాన్ని బట్టి కాకుండా, రాజకీయ పార్టీల సాన్నిహిత్యాన్ని బట్టి ఈ ప్రయోజనాలకు లబ్దిదారులను ఎంపికచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

             వలసదారులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని కోరుకుంటున్నారు. ఆ ఆశతోనే వారు నిత్యజీవన సమరం కొనసాగిస్తున్నారు. విద్యా, వైద్య సౌకర్యాలను పెద్ద ఎత్తున ప్రైవేటీకరించడంతో వీటి పై వ్యయం అనేక రెట్లు పెరిగింది. సగటున ఒక్కొక్క కుటుంబం నెలకు 1000 నుంచి 3000 వరకు విద్య కోసం వ్యయం చేస్తున్నది. కుటుంబంలో ఒక్కరికైనా రక్తపోటు, మధుమేహం, లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. ప్రతి కుటుంబం వైద్యం కోసం దాదాపు వెయ్యి రూపాయలు వ్యయం చేస్తున్నది. దీనితోపాటు మాతాశిశు వైద్యం కోసం, ప్రసవం కోసం, ఇతర వైద్య అవసరాల కోసం ప్రతి కుటుంబం సంవత్సరానికి రెండుసార్లు 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ప్రతి ఇంటిలోనూ సగటున 2 సెల్ ఫోన్లు ఉన్నాయి. వాటికోసం నెలకు దాదాపు 500 రూపాయలు వ్యయం చేస్తున్నారు. అదనంగా వంటగ్యాస్ లేదా వంటచెరకు, పండుగలు, ఇతర ఉత్సవాల కోసం కూడా ఖర్చులుంటాయి. ఈ ఖర్చులన్నీ తప్పనిసరి అవసరాలుగా మారిపోయాయి. కొరత, కరువు, పెళ్లిళ్లు, ప్రమాదాలు, అనుకోని ఖర్చులకోసం వారు భారీ వడ్డీలతో రుణాలు చేస్తారు. అనేక కుటుంబాలలో అవివాహితులు, నిరుద్యోగ యువత, వృద్ధులు, దివ్యాంగుల వలన, సంపాదిస్తున్న వారిపై తీవ్రమైన భారం పడుతోంది. ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్న విషయమేమంటే- కరువులు, దిక్కుతోచని పరిస్థితి, పంట నష్టం మాత్రమే కాకుండా తప్పనిసరి అవసరాలను చెప్పుకుంటున్న వాటికోసం కూడా వలసలు కొనసాగు తున్నాయి. అందువల్ల ప్రజలు అటు గ్రామాల్లోనూ ఇటు పట్టణాలలోనూ కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నారు.

__ పిళ్లా కుమారస్వామి,9490122229








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The unexplored relics of Rayalaseema

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

నిస్వార్థ ప్రజానాయకుడు ఎద్దుల ఈశ్వర రెడ్డి