అనంత కథా వికాసం
అనంత కథా వికాసం
___డా. శాంతి నారాయణ
ఆధునిక తెలుగుకథ (దిద్దుబాటు - గురజాడ 1910)పుట్టి ఎనభైఆరేళ్ళు గడిచిపోయింది. అప్పట్నుంచి తెలుగు కథ వస్తుశిల్పాలలో అనంతమైన వైవిధ్యాన్ని సంతరించుకుంటూ వచ్చి కథా సాహిత్యంలో తన కీర్తి పతాకను ఎగుర వేస్తున్నది. మానవ జీవితంలోని ఏ సూక్ష్మవిషయాన్నైనా కళాఖండాలుగా మలచడానికి, పాఠకుల మెదళ్ళలో కదలిక తేవడానికి అవకాశముండటమే కథ ఇంతవేగంగా అభివృద్ధి చెందడానికి కారణం. ఈశతాబ్ది ఉత్తరార్ధంలో నవలకన్నా కథ ప్రజలకు చేరువకావడానికి ఇదేకారణం.
అనంతమైన కాలంలో నూరేళ్ళు చిన్న పరిమాణమే అయినా, ఈ నూరేళ్ళ తెలుగు కథ సమాజసాంస్కృతిక వికాసంలో గొప్పబాధ్యతను నిర్వహించింది. క్రమక్రమంగా సంకీర్ణము, సంక్లిష్టము అవుతున్న మానవ జీవితాన్ని ముడులు విప్పి ప్రదర్శిస్తున్నది. తెలుగు కథ మధ్య తరగతి చిత్రణతో ప్రారంభమై, ఉద్యమాల ప్రతిబింబమై, క్రింది తరగతి జీవితానికి నిలువుటద్దమై ఇవాళ అధోజగత్సహోదరుల జీవన ప్రతిఫలనంగా నిలబడుతున్నది. 1910 నుంచే తీరాంధ్రప్రాంతంలో పుట్టి పెరిగి 1952 నాటికి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగు కథ తెలంగాణా ప్రజలసాయుధ పోరాట ప్రభావంతో 1940 ప్రాంతాల్లోనే తెలంగాణాలోకి అడుగు పెట్టినా, రాయలసీమలోకి 1950ముందు ప్రవేశించలేక పోయింది. ఒక రాష్ట్రంలోనే ఒక ప్రాంతంలో పుట్టినా నలభై ఏళ్ళుకుగాని మరోప్రాంతానికి కథరాకపోవడానికి కారణాలు బలమైనవిగానే ఉంటాయి. ఈ కారణాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాకు పరిమితమై పరిశీలిద్దాం.
ఉమ్మడిఅనంతపురం జిల్లాలో దొరిగల్లు, పాముదుర్తి, కౌకుంట్ల వంటి కొన్ని ప్రాంతాలలో తప్ప భూస్వామ్య విధానం అంతగాలేదు. చాలా గ్రామాలలో మెట్టభూములయితే నూరు, నూటయాభై ఎకరాలు, తరిభూములయితే ఇరవై ముప్పై ఎకరాలు కలిగిన రైతులు ఐదారుమంది ఉండడం, వాళ్ళమాట ప్రకారమే గ్రామమంతా నడవడం, ఆ రైతులు తమ పెద్దరికాన్ని నిలుపుకునే మార్గంలో గ్రామ ప్రజల్ని అదుపులో పెట్టుకోవడం, మిగిలిన చిన్నచిన్న రైతులు పెద్దరైతులలో ఎవరి కిష్టమైన పక్షంలో వాళ్ళ చేరడం - ఇదీ పరిస్థితి. కొన్ని గ్రామాలలో చాలా వరకు రైతులందరూ మధ్యకారు చిన్నకారు రైతులే. ఇలాంటి గ్రామాలలో వ్యవసాయం పరస్పరసహకారం మీద సాగుతూ ఉంటుంది.
ఆధునికతకు పునాదులైన పరిశ్రమలు, వర్తక వాణిజ్యాలు, ఆధునిక విద్యాసంస్థలు ఈప్రాంతానికి ఆలస్యంగానే వచ్చాయి. ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల్లో స్వాతంత్ర్యానికి ముందే విశ్వవిద్యాలయాలు వస్తే, రాయలసీమకు స్వాతంత్ర్యం వచ్చిన అయిదారు సంవత్సరాల తర్వాతగానీ యూనివర్శిటీరాలేదు. గోదావరి, కృష్ణ ఆనకట్టలవంటివి అసలేలేవు. తెలంగాణాలో లాగా లక్షలఎకరాలను స్వాధీనం చేసుకొని ప్రజల్ని హీనాతి హీనంగా అణచివేస్తే, దానిని తిప్పికొట్టే ప్రజోద్యమాలూ రాయలసీమలోరాలేదు. ఆధునికతా ప్రవేశానికి పరిశ్రమలు, ఆనకట్టలు కావాలి.లేదా ప్రజోద్యమాలు కావాలి. రాయలసీమలో ఈరెండూ కరువైనాయి. అందుకే ఇక్కడి మాన జీవితంలోకి సాహిత్యంలోకి ఆధునికత ప్రవేశించడం కూడా ఆలస్యమైంది.
కథా ప్రాచుర్యానికి బాగా తోడ్పడేవి పత్రికలని మనకు తెలుసు. అటువంటి పత్రికలు జిల్లాలో 1910లోనే ప్రారంభమయినా ఏపత్రిక కూడా కథను ప్రోత్సహించలేదు. 1910లో పుట్టిన 'శంకరవిజయం', 1922లో వెలువడిన 'పినాకిని', 1924లో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు స్థాపించిన 'మాతృసేవ', 1925లో వెలువడిన 'భారతమహిళ', 1926లో మొదలై ఇప్పటిదాకా వస్తున్న 'సాధన', 1962లో వచ్చిన 'సారధి', 1981నుండి ప్రారంభమైయిన 'కదలిక' వంటి పత్రిలేవీ కథా రచనను ప్రోత్సహించలేక పోయాయి. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రచారానికి, ప్రాంతీయ సమస్యల్ని వార్తలుగా చిత్రించడానికి పరిమితమయినందువల్ల కథావిర్భావానికి తోడ్పడలేక పోయాయి. సాంస్కృతిక పరిణామానికి, జాతీయ భావవికాసానికీ 'కథ' ఏమేరకు ఉపయోగపడుతుందో గుర్తించలేక పోయాయి.
అనంతపురం జిల్లాలో 19వ శతాబ్ది ఉత్తరార్ధం నాటికే కొన్ని సాహిత్యసంస్థలు ఏర్పడి సాహిత్య గ్రంథాలను వెలువరించాయి, 1893లో ధర్మవరంలో పుట్టిన 'సరస్వతీనిలయం', 1925 -26లో ఏర్పడిన 'క్రియాశక్తి వడయర్', 1931లో బళ్ళారిలో పుట్టి హిందూపురంలో నిలదొక్కుకున్న ‘శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల', మొదలగు సాహిత్యసంస్థలు జిల్లాలో సాంప్రదాయకమయిన పద్యకావ్యాలను ఖండ కావ్యాలను ప్రచురించాయేకాని కథవైపు దృష్టి సారించలేదు. ఈ సంస్థలన్నీ సనాతనులయిన పండితుల యాజమాన్యంలో ఉన్న కారణంగా పద్యరచనను తప్ప మరొకదాన్ని సాహిత్యంగా గుర్తించలేకపోయాయి. బంధకవిత్వాల బంధాలలో చిక్కి అరవయ్యోదశకం వరకూ అష్టావధాన, శతావధాన సర్కస్ గారడీ విద్యల మత్తులో మైమరచిపోయిన ఈజిల్లా సాహిత్యవేత్తలకు కథను ఒక సాహిత్యాంశంగా గుర్తించగలిగిన జ్ఞానమయినా లేక పోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇటువంటి సమయంలోనే అంటే 1943లో తూమాటి దోణప్ప రాసిన 'చంద్రుడు-కలువ' అనే కథ 'చంద్రగుప్త' పత్రికలో రావడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతవరకూ లభించిన ఆధారాలను బట్టి మొట్ట మొదటి అనంతకథ దొణప్పగారి 'చంద్రుడు - కలువ. ప్రమాణాల రీత్యా ఈకథ కథగా నిలువలేకపోయినా చారిత్రకంగా 'అనంత', కథా చరిత్రలో దీనికెంతో ప్రాధాన్యం వుంది. దీని తర్వాత 1956 -58 మధ్య కాలంలో ప్రముఖ జర్నలిస్టు జి.రామకృష్ణ గొప్ప కథావస్తువును తీసుకుని రాసిన 'గంజికేంద్రం', 'వడ్లగింజలో----', 'జొన్న చేను' కథలు మంచి కథా నిర్మాణం కోసం చేసిన ప్రయత్నాలకు గుర్తులుగా మిగిలిపోతాయి. ఇదే కాలంలోనే తలమర్ల కళానిధి అచ్చువేసుకున్న కొన్ని కథలు ఆధ్యాత్మిక విషయాన్ని ప్రచారం చెయ్యడం కోసం వేసుకున్న కరపత్రాల లాగానే కనిపిస్తాయి కానీ కథాలక్షణాలను సంతరించుకోలేక పోయాయి. గడ్డం గురుమూర్తి రాసిన కథలు అనంత కథావిర్భావానికి సూచికలుగా కనిపిస్తాయి. యాధాటి కాశీపతి మంచి వొడుపుతో కథానిర్మాణానికి ప్రయత్నం చేసినా కథలు వెలుగు చూడలేకపోయాయి.
'అనంత' కథ అంటే అనంతపురం జిల్లా నుంచి వచ్చే కథలు అనిఅర్థం. దానిని రెండు రకాలుగా విభజించుకొని పరిశీలించవచ్చు. ఒకటి : అనంతపురం జిల్లాకు సంబంధించిన నిర్దిష్టమైన జీవితాన్ని చిత్రించే కథలు, రెండు : అన్ని ప్రాంతాలూ ఎదుర్కొంటున్న సాధారణ మానవ జీవిత సమస్యల్ని చిత్రించే కథలు. ఈ రెండురకాల కథలూ వస్తున్నాయి. అనంతపురం జిల్లానుండి సాహిత్యాన్ని పరిశీలించడంలో ఈప్రాంతీయదృష్టి ఏమిటని కొందరనుకోవచ్చు.సమాజంలో అది ఉన్నప్పుడు సాహిత్యంలోను ఉంటుంది. అందువల్ల సాహిత్య పరిశీలనలోను ఉండటం సహజం, అనివార్యం. అంతే తప్ప ఇది సంకుచిత దృష్టి భూగోళంలో మనం ఎక్కడ ఎలా నిలబడి ఉన్నామో చూసుకోవడమే. అందుకు కారణాలు వెతుక్కోవడమే.
రాష్ట్రంలోని ఇతరప్రాంతాలతో పోల్చి చూస్తే రాయలసీమకు ఒక ప్రత్యేకమయిన ఆర్థిక, సాంఘిక సాంస్కృతిక పరమయిన జీవనవిధానం వుందన్న విషయం నగ్నసత్యం, కడివెడు నం మైళ్ళకు మైళ్ళు వెళ్ళవలసిన దుస్థితి ఇక్కడవుంది. తాగే నీళ్ళకోసం కక్షలు పెంచుకుని వీధుల్లో కత్తులూ కటార్లతో పోట్లాడుకుంటున్న దారుణస్థితి వుంది. నెలల తరబడి రైతులు ఆకాశం వైపు చూస్తున్న దైన్యంవుంది. వర్షాలురాక, తిండిగింజలు లేక, పశువులకు మేతలు లేక, గుండెల్లో అగాధాలు నింపుకొని పశువుల్ని కసాయి వాళ్ళకు అమ్మి, కడుపులు పట్టుకొని కూలికోసం కానని దేశాలకు వలస పోతున్న విషాదంవుంది. అటువంటి రాయలసీమలో మరీ వెనుకబడింది అనంతపురంజిల్లా.
భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం వున్న జిల్లాలలో రెండోది అనంతపురం. జిల్లా దుర్భర దారిద్ర్యానికి భౌగోళిక పరమైన శాపం ఒకకారణమయితే రాజకీయపరమైన మరొక కారణమవుతున్నది. ఈరెండు కారణాలమధ్య ఇక్కడి మనుషులు నలిగి తున్నారు. ఆ నలపటే ఇక్కడకథల సారం.
'అనంత కథా' వికాసంలో దాని రెండో దశ ప్రధానమయిందని ఇంతకు ముందనుకున్నాం. రెండోదశ 1975 లో తర్వాత ప్రారంభమై ఇప్పటి వరకూ కొనసాగుతున్నది. 'అనంతకథ' 1975 సర్వాతనే వికాసవంతమవడానికి కొన్ని కారణాలున్నాయి. బావుల కింద వ్యవసాయం మునపటి కంటే పెరిగింది. ఏతం, కపిలస్థానాలలో మోటార్లు వచ్చాయి. బావుల తవ్వకమే లేకుండా గొట్టపు బావులు వచ్చాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కొత్త రకం ఎరువులూ మందులూ పుట్టుకొచ్చాయి. ప్రయాణం, వాణిజ్య సౌకర్యాలు పెరిగాయి. పేదలకు బంజరు భూములు చేతికొచ్చాయి. కాలేజీలూ విశ్వవిద్యాలయాలూ, ప్రభుత్వశాఖలూ, వాటితో పాటు ఉద్యోగాలూ ఎక్కువయ్యాయి. చిన్నచిన్న పరిశ్రమలూ, వేరుశనగ, రైస్ మిల్లులూ, చక్కెర ప్యాక్టరీలూ, కుప్పలు తెప్పలుగా పాలిష్ బండల ఫ్యాక్టరీలూ, గ్రానైట్ గనులూ ఏర్పడ్డాయి. వర్షాలు పూర్తిగా బిగుసుకున్నాయి. అవసరాలు ఎక్కువై కరెంటు కోతలెక్కువయ్యాయి. బావుల్లో బోరింగులో ఏళ్ళు నిలిచిపోయాయి. ఆరకొరా పండిన పంటలకు గిట్టుబాటు ధరలేక వ్యాపారస్తులు చేసే మోసాలకు రైతాంగం నలిగిపోసాగింది. ఈ లోగా పేదలకిచ్చిన భూములను గ్రామదేవతలు లాక్కోడానికి ప్రయత్నాలు చేశారు. దాంతో పేదలు కమ్యూనిష్టుపార్టీల చెంతన చేరి సమ్మెలు మొదలు పెట్టారు. ఈ సమయంలోనే రాయలసీమ విమోచన సమితి కొంత స్ఫూర్తినిచ్చింది. పట్టణీకరణ ఎక్కువైంది. రాజకీయాలలో మార్పులొచ్చాయి. జిల్లాకంతటికి ఒకే ఒక్క నీటి ఆధారమున తుంగభద్ర కాలువ రాజకీయమైన ఇతరేతరములయిన కారణాలు వల్ల సరిగా ముందుకు సాగక ఆయకట్టుదారుల బతుకు శాపంగా మారుతూ వచ్చింది.
'అనంత' కథకులందరూ దాదాపు గ్రామీణ జీవితం నుండి వచ్చిన వాళ్ళు కావడం వల్ల తమ కళ్ళ ముందే రైతు జీవితాలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్ని గమనించి చలించి పోయారు. తరతమ భేధాలుండవచ్చును గానీ దాదాపు అందరూ ఈ ప్రాంత రైతాంగ జీవితంలోని విషాదాన్ని తమ కథల్లో గొప్పగా చిత్రించారు. ఈ కథలన్నిటినీ 'అనంత' జీవిత గాధలుగా పేర్కొనవచ్చు. ఈ జీవిత నేపథ్యంలో వచ్చినవే వాలిన మబ్బులు, జూదం, సీమకథలు అనే కథా పంపుటాలు. ఈ కథల వెనుక నిరంతరం జ్వలిస్తున్న రచయితలే సింగమనేని నారాయణ,చిలుకూరి దేవపుత్ర, స్వామి, శాంతి నారాయణ, బి.ఆర్. మహర్షి, సడ్లపల్లి చిదంబర రెడ్డి, నూర్ అహ్మద్, బాలగొండ ఆంజనేయులు, కె.యం. రాయుడు మొదలయిన వాళ్ళు. వీళ్ళ కలాల నుంచి ప్రాంతీయ ముద్ర వున్న కథలతో పాటు సంక్లిష్టమవుతున్న జీవితంలోని అనేకాంశాలను స్పృశిస్తూ వైవిధ్యంతో కూడుకొన్న వందలాది కథలొచ్చాయి.
ఈ ప్రాంత జీవితాన్ని ఈ ప్రాంత మాండలికంలో చిత్రించిన కథల్ని పరిశీలిస్తే దాదాపు అన్నీ రైతు జీవితాన్ని అంటి పెట్టుకున్నవే. పెద్దగా పరిశ్రమలకు నోచుకోని ఈ జిల్లాలో జనజీవితమంటే గ్రామజీవితమే. ఈరెండు దశాబ్దాల కాలంలో ఇక్కడి రైతు జీవితం విచ్ఛిన్నమయినంతగా మరేదీ కాలేదు. అందుకే 'అనంత' కథకులు ఈ విషయాన్ని చాలా బలంగా తమ కథల్లో చిత్రించారు.
అనంతపురంజిల్లా రైతు బతుకు క్రమంగా జూదంగా మారుతూ వుంది. 30-40 సంవత్సరాల కిందట పచ్చగా బతికిన నారప్ప వంటి మధ్యతరగతి రైతులకు వర్షాలు రాక, పంటలు పండక సొంతవూర్లో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పోయింది. లోను ఇచ్చిన తనఖా బ్యాంకు వారు అప్పుకట్టమని ఇంటిముందుకొచ్చి కూర్చున్నప్పుడు జవాబు చెప్పేందుకు నోట్లో తడిలేకపోయింది. ఒక అప్పును తీర్చడానికి వేరొక అప్పు దాన్ని తీర్చడానికి మరొక అప్పు చేస్తూ వ్యవసాయ జూదం పైన ఆశలు పెంచుకుంటూ రోజురోజుకూ దిగజారిపోయిన నారప్పవంటి రైతుల దయనీయ జీవనవిధానాన్ని సింగమనేని నారాయణ 'జూదం' కథ చిత్రిస్తూ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నారప్ప కల్లముందే ఇడ్లీవడలు అమ్ముకుంటూ తక్కువ కాలంలోనే తమ వ్యాపారాన్ని పెంచుకొని అప్పులిచ్చి రైతాంగాన్నంతా తమ గుప్పిట్లో పెట్టుకునే రామయ్య, శివయ్య లాంటి వ్యాపారస్తులు రైతుల అవసరాలను ఎంత చాకచక్యంగా డబ్బు చేసుకుంటున్నారో తెలిసినప్పుడు మన గుండెలు బరువయిపోతాయి.
బావుల్లో నీళ్ళు ఎండిపోయి భూములను బీడుపెట్టుకోలేక గొట్టపు బావుల మీద నమ్మకంతో నారప్ప పదీపదునైదు బోర్లు వేయించుకొని చారెడు నీళ్ళు కోసం చేసే భగీరథ ప్రయత్నంలో సర్వనాశనమవుతాడు. దారుణమయిన ఈ విషయాన్ని అద్భుతంగా చిత్రించిన 'ఊబి' కథను చదివినప్పుడు మనం కూడా నారప్పలమై వెర్రి చూపులతో మాటలు పడిపోయినవాళ్ళమవుతాం.
'రేపు' యెసిట్లేకి లేవు. ఆరంగప్పనన్నా యిన్నిగింజలడుగు అని మూడు రోజులనుండి అంటూవున్న భార్య మాటల్ని వింటూ 'అనంత' రైతు వెంకటప్ప ఇంట్లో నుంచి బయటకు నడుస్తాడు. దిక్కుతోచక కాసేపు రిలీఫ్ పొందడానికి బీడీ తాగుదామంటే చిల్లర అంగట్లో ఒక కట్ట బీడీలయినా అప్పుపుట్ట లేదు. కుక్కి మంచంలో చనిపోడానికి సిద్ధంగా వున్న కుష్టిరోగి శరీరం లాగా కనిపించే పొలం పంట పైన ఆశలు వదులుకున్నాడు. ఎదురుగా కమ్యూనిస్టులు చేసే భూమి కోసం పోరాటమంటూ కరపత్రాల పంపకం. భూమికోసం కాదు, భూమిని వదిలించుకోడానికి పోరాటం చెయ్యాలనుకుంటూ మధ్య తరగతి జీవితం నుండి విముక్తి పొందిన వెంకటప్ప తనబంధువు దగ్గరే మట్టి పనికి చేరిన దారుణ స్థితిని విముక్తి కథలో చదివినప్పుడు మనపెదవులు ఎండుకు పోతాయి.
ఎండమావులయిన చీనీ పంటల్ని నమ్ముకొని ఎదిగిన కూతురుకి పెళ్ళి నిశ్చయం చేసుకొని ఆశలు రేపిన చీనీ పంటను నారాయణప్ప నాగపూరుకు వేసుకొని పోతాడు. అక్కడ మార్కెట్టు మోసాలకు నిలువునా మోసపోతాడు. తాను పండించిన పంటకు ఎవడో రేటు నిర్ణయించడ మేమిటని ప్రశ్నించుకుంటూ వాళ్ళు ఇచ్చింది జేబులో పెట్టుకొని ఊరికి తిరిగి వచ్చి
తాను పెంచిన చీనీ చెట్లను తన చేతులతోనే నరికి వేస్తాడు. అతడు నరుకుతున్న గొడ్డలి శబ్దం ఈ దేశాన్నీ కాలాన్నీ ప్రశ్నిస్తున్న తీరును 'అడుసు' కథ గొప్పగా వివరిస్తుంది.
సింగమనేని నారాయణ గొప్ప కథాశిల్ప నిర్మాణాలతో అనంతరైతు జీవితంలోని విషాదాన్ని ఈ కథలలో ఆవిష్కరించిన విధానం పాఠకులను తీవ్రంగా ఆలోచింప చేస్తుంది.
స్వామి ఈ ప్రాంతం లోని మధ్య తరగతి రైతుల కడగండ్ల నేకుండా చిన్న సన్న కారు రైతుల, రైతు కూలీల జీవితాలలోని దయనీయతను, బడుగువర్గాల బతుకులోని అగాధాలను వాళ్ళ ఆలోచనా, విధానాలనూ, మమతలనూ, మమకారాలనూ వానరాలే బతుకు ఊబి, పిప్పి మనిషి, అగాధం, సావుకూడు, నీళ్ళు మొదలయిన కథలలో చాలా శక్తి వంతంగా చిత్రిస్తాడు.
చెళ్ళి కెరలో వేరుశెనగ విత్తనాలు అప్పుతెచ్చి నిరుటి అనుభవంతో భయపడి, ఉన్న భూమిలో సగం మాత్రమే విత్తుకొని పెన్నప్ప వంటి రైతులు వానకోసం ఆరాట వడుతూ ఆశానిరాశల మధ్య నలిగిపోతారు. చివరికి అందిన కొద్ది పంటనే చెళ్ళికెరకు వేసుకొని పోయి అక్కడ తూకాలతో నోరు ఎల్లబెట్టి చేసేది యేమీ లేక పాత అప్పును తీర్చి, కొత్త అప్పు నూటా అరవై కాకుండా ఎనభైరూపాయలే అయినందుకు తక్కనవ్వు నవ్వి కూతుళ్ళ పెళ్ళిళ్ళను వచ్చే సంవత్సరానికీ, భార్యకు రవిక గుడ్డ కొనడం మరోరెండునెలలకూ వాయిదా వేసుకుంటున్న వెన్పప్ప వంటి రైతుల దైన్యాన్ని వానరాలే కథలో చూసినప్పుడు మన గుండెలు బరువెక్కి పోతాయి. రజస్వల అయిన ఆడపిల్ల మాదిరి బంగారుపూతతో వున్న తమ వేరుశెనగ చేలను చూసి పళ్ళెంలో అన్నం పెట్టుకున్నట్లు సంతృప్తి పడుతున్న అనంత రైతుల అల్ప సంతోషాన్ని చూసి మన మనసులు జాలి పడతాయి.
మల్లల్లో బాడుగ మడకలు దున్ని, కట్టెల బండ్లు లాగి తెల్లెద్దు మెత్తబడి పోయింది. తన ప్రాణంలో ప్రాణంగా కని పెంచి పెద్ద చేసిన తండ్రి మెత్తబడినాడు. ఇంట్లో పూటకు గడవడమే గగనమైపోయింది. బళ్ళారి వైపు కూలికోసం బయలు దేరక తప్పలేదు మల్లన్నకు. భార్యాపిల్లలు కూడా బయలుదేరినారు. మెత్తబడిన తెల్లెద్దుకు సావు సన్నం చేసి మరో కుర్రదూడను తెచ్చుకోవల్లని ఆశ. ఇంట్లో దగ్గు తెరలలో వూగిపోతూ కాటికి కాలు చాపుకున్న తండ్రి. ఇల్లు వదలలేని స్థితి. వదలకుండా వుండలేని పరిస్థితి. బయలుదేరడానికి చార్జీలకు పైసలు లేవు. తొంభై రూపాయలు బలవంతంగా చేతిలో పెట్టి మాదిగ హనుమంతు తెల్లెద్దును బండిలో వేసుకు పోతున్న దృశ్యం ‘నాపక్క కాదు నాయనా నీపిల్లల పక్క సూడు. నేను నిన్ను పనెద్ద సేసినట్లే నీపిల్లోల్లను నువ్వు పెద్ద చెయ్యల్ల లగదా : పోయిరాపోండి' అన్న తండ్రి మాటల్లో గుండెల్ని పిండే ఆప్యాయత. అంతా చూస్తూ తన్నుతానే అసహ్యించుకుంటున్న మల్లన్నను 'బతుకు ఊబి' కథలో చూసినప్పుడు మన కడుపులో ఎవరో చేయి పెట్టి దేవినట్లవుతుంది. గుండెలోని అగాధాలను తాకి నట్లవుతుంది. ఈ విధంగానే పిప్పి మనిషి, సావుకూడు, ఊరుతల్లి కథలు, వస్తువు, శిల్పనిర్మాణాలతో మన గుండెల్ని పిండుతాయి. 'నీళ్ళు కథ గుక్కెడు నీళ్ళ' కోసం అనంతపురం మధ్య తరగతి మనిషి తప్పని సరిగా తన బతుకును నిస్సారంచేసుకోవలసి వస్తున్న పరిస్థితికి అద్దం పడుతుంది.
వర్షా భావంతో పంటలు పండక నిరుపయోగంగా వున్న ఆరవంత భూమినీ అమ్ముకొని బళ్ళారి వంటి పట్నాలలో చేరి ఏదోరకంగా బతక వచ్చునని ఈ తరం వాడైన రామచంద్రుడు ఇక్కడి వ్యవసాయ కుటుంబాలలో మెదిలే ఆలోచనలకు ప్రతిరూపంగా కనిపిస్తాడు. అతని తండ్రి చెన్నప్ప తరతరాల నుండి తననూ తన తాతముత్తాతలనూ సాకిన మట్టి తల్లి పైన మమకారాన్ని వదలు కోలేక, కొడుకు అభిప్రాయాన్ని మన్నించి భూమిని అమ్మలేకది, ఆ మట్టి తల్లి పాదాల దగ్గరేజీవితాన్ని చాలించు కుంటాడు. జిల్లాలో అక్కడక్కడ చోటు చేసు కుంటున్న ఈ జీవితవాస్తవాలను చిలుకూరి దేవపుత్ర కథ మన్ను తిన్న మనిషి సజీవమయిన మాండలికంలో ఆవిష్కరిస్తుంది.
అప్పు తెచ్చి విత్తనాలు భూమిసాలు చేసి వచ్చేపంటకోసం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని బ్రతుకులు వెలగబెడితే చివరికి చేతికందిన పంటంతా అప్పులిచ్చిన రామయ్య ఇంటికో, శేషయ్య ఇంటికో చేరడం తప్పలేదు. మరుసటి క్షణం నుండే మళ్ళీ అప్పుకోసం వెంపర్లాట. ఆ కాలంలో వచ్చిన వాన, మేతనంతా పేడ పేడ చేసి పశువులకడుపు గొట్టింది. ఇదంతా భూమి మీదే వెగటు పుట్టించడంతో మల్లప్ప వంటి రైతులు బతుకు తెరువు కోసం అనంతపురం లాంటి పట్నాలకు చేరుకొనే స్థితిని శాంతినారాయణ కల్లమయిపాయ' కథ చూపిస్తూ ఈ జిల్లాలోని రైతాంగ జీవితంలో వస్తున్న మార్పులను సూచిస్తుంది.
ఎన్ని ఇబ్బందులున్నా బూమమ్మను నమ్ముకొని బతికే వాల్లం. యెప్పుడో వొకసారి ఆతల్లి తప్పకుండా గడ్డకేస్తాది', అనే ఆశతో అనంత రైతులు ఇళ్ళను ఆయికం పెట్టి సంసారంలోని సారాన్నంతా చీనీ చెట్ల పాదుల్లో పోసి చెట్లను పసిపిల్లోల్లను సూసుకున్నట్ల చూసుకుంటారు. అవసరమయినప్పుడు వానరాదు. అవసరం లేనప్పుడు వస్తుంది. చీనీ చెట్లు 'వాడు' రావు. గెయిరంగం పంట తప్పిపోతుంది. 'ఎడగారు' పంట బ్రహ్మాండంగా తగుల్కొని గోళీ గుండ్లంత పిందెలు చెట్ల నిండా కనిపిస్తాయి. అంతలో కరెంటు డీపి కాలిపోతుంది. 'దున్నపోతుమింద వాన కురిసినట్ల' ఎంతచెప్పినా కరెంటు వాళ్ళు పట్టించు కోరు. తడిపెట్టక చీనీ చెట్ల పిందెలన్నీ రాలిపోతాయి. ఇక మళ్ళీ సీజను పంటే. ఈలోగా కట్నంగా బాకీపడిన బంగారు ఇవ్వలేదని అత్తింటి పోరుపడలేక కన్నకూతురు వచ్చి కన్నీళ్ళు పెడుతుంది. ఏమి చెయ్యాల్లో దిక్కుతోచదు. చిన్న కొడుక్కు మెడిసన్ ఎంట్రెన్సులో ర్యాంకు వచ్చింది. పెద్ద కొడుక్కు, వచ్చే సీజన్ పంట సరిగా చేతికి వస్తే తమ్ముణ్ణి డాక్టరు కోర్సు చదివించాలని ఆశ. రేటునిలకడలేని మార్కెట్టు. దేశంలో ఎక్కడ లేనంత చీనీ పంట అనంతపురం జిల్లాలో పండితే మార్కెట్టు ఇక్కడ కాకుండా హైదరాబాదులోనో నాగపూరులోనో పెట్టడం రైతుల్ని నాశనం చెయ్యడానికే. గత అనుభవంతో లోకల్ వ్యాపారస్తులకే అమ్మకం కుదురుతుంది. తీరా వ్యాపారస్థుడు అడ్డం తిరుగుతాడు. రైతుల గుండెలు ఆగిపోతాయి. నిజంగానే నారపరెడ్డి అనే రైతు కుప్ప కూలి రైతు బతుకునుండే శాశ్వతంగా విముక్తి పొందుతాడు. ఈదయనీయమైన అనంతపురం జిల్లా చీనీ చెట్ల రైతుల బతుకు చీకటిని 'పల్లేరు ముల్లు' అనే పెద్ద కథ మనకళ్ళ ముందు పరుస్తుంది.
కాయగూరలు ఆకాశాన్నంటే ధరలతో మండిపోతుంటే చూసి ఆశతో కాయగూరలు పండించి మార్కెట్టుకు వేసుకొని వెళ్ళి అక్కడ దళారీల చేతిలో 'అనంత' రైతు నలిగిపోతున్న విధానాన్ని ‘దళారి' కథలో, కూలివాని లాగా సంవత్సరమంతా సొంతభూమిలో పనిచేసుకున్నా చివరికి తాటిగింజలకు మాత్రమే నోచుకొని కూలివాని బతుకే మేలనుకుంటున్న రంగన్న లాంటి నిరాశామయ జీవితాన్ని 'తాటిగింజలు' కథలో శాంతినారాయణ చిత్రించి ఈ ప్రాంతంలో రైతు బతుకు ఎంత ఎగతాళిగా మారుతూవుందో సూచిస్తారు.
'ఎగ పెడుతున్న' వార్షాలకు అనుకూలంగా వంట మార్పిడి చేసుకుంటూ లాభదాయకమయిన రేషం చెట్లువేసుకొని ఈ ప్రాంతరైతులు పట్టు పురుగుల్ని పెంచుకుంటున్నారు. వాళ్ళకు సరైన పట్టుగూళ్ళు దొరకడంలేదు. నారాయణరెడ్డి వంటి కల్లాకపటం తెలియని రైతులు పట్నాల్లో పట్టుగూళ్ళ కోసం వెంపర్లాడుతూ వ్యాపారస్తుల్ని నమ్మి వేలువేలు గుమ్మరించి పట్టు గూళ్ళు తీసికొని పోయి రేషమాకు వేసి మేపుతారు. ఎంతమేసినా పురుగుల కదలికలు లేని పట్టుగూళ్ళను చూసి అవిపట్టు గుడ్లు కావు. గసగసాలని తెలిసినప్పుడు నవనాడుల్లో రక్తం ఆగిపోయినట్లు కూలిపోతారు. అయినా అట్లే బతుకుతూ ప్రయివేటు వ్యక్తుల్ని నమ్మడం చాలా ప్రమాదమని తెలుసుకొని ప్రభుత్వ 'గ్రెయినేజీ' లోని గుడ్లు తెచ్చి పెంచుతూ అవి 'ఒంగోలు గిత్తల లాగా కరకరా ఆకునములుతూ వుంటే' చూసి మురిసిపోతూ, పట్టుచీరకట్టుకున్న ధనలక్ష్మిలాగా ఇంట్లో గరగరా' తిరుగుతూ వుంటే వుబ్బిపోతూ, అకస్మాత్తుగా ఆపురుగులన్నీ ఒక్కసారిగా కుళ్ళిన శవాలై పోవడం చూసి నారాయణరెడ్డి వంటి రైతుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడం యాదృచ్ఛికమేమీ కాదు. ఈ జిల్లాలో అటువంటి దారుణమైన దృశ్యాన్ని సడ్లపల్లి చిదంబరరెడ్డి కధ 'సుడిగుండం' లో చూసినప్పుడు మన నరాలు బిగుసుకొని పోకుండా వుండలేవు.
కూడు పెట్టలేని వ్యవసాయమూ అప్పులూ, దరిద్రమూ ఎంత బాధపెడుతున్నా పుట్టిన కొడుకులందరినీ ప్రేమగా పెంచి, వాళ్ళు ప్రయోజకులవుతూ వుంటే చూసి తృప్తి పడుతున్న సమయంలో ఆ కొడుకులు ఉమ్మడి కుటుంబంలో వేరు కాపురాలుపెట్టడం, మధ్యతరగతి రైతు సంసారాలు బలహీనము నిస్సారంగా మారిపోతుండడం ఈ ప్రాంతంలో మరో దౌర్భాగ్యామయిన విషయం. ఈ అంశాన్ని మంచి మాండలికంలో బాలకొండ ఆంజనేయులు రాసిన 'బతుకుబండి' కధ మనముందుంచి కళ్ళను చెమ్మగిల్లజేస్తుంది. వర్షాలురాక, పనులు లేక మగవాళ్ళంతా నాగుల కట్టల మీదా, సత్రాల్లోనూ చేరి వానను గురించి మాట్లాడుకుంటారు. ఆవూర్లో ఎల్లమ్మ పయిలోకి వచ్చి వానగురించి చెప్పిందని, ఈ వూర్లో మారెమ్మ వానగురించి చెప్పిందని అమాయకంగా అనుకుంటూ వుంటారు. బొడ్రాళ్ళకు నీళ్ళుపోసి, తోలు బొమ్మల ఆటలు ఆడించి, విరాటపర్వాలు చదివించి, కడవసగినం పెట్టించి వానకోసం ఎదురుచూస్తారు. ఇదీ ఈ ప్రాంత రైతుల విశ్వాస సంస్కృతి. ఈ విషయాన్ని బాలకొండ ఆంజనేయులు కధ 'కడవసగనం'లో చూసినప్పుడు ఈ దేశ నాగరికతా, పురోభివృద్దీ గుర్తుకువచ్చి పెదవుల మీద నవ్వు, బాధగా పొందక తప్పదు. అట్లే పూలమ్మినచోట కట్టలు అమ్ముకోడానికి సిద్ధపడుతున్న ఈ జిల్లారైతు తిరోగతిని 'ముళ్ళదారి' కధలో గమనించినప్పుడు వేడి నిట్టూర్పులు రాకమానవు.
వ్యవసాయం వ్యర్ధమై బతుకు భారమై మొండి వాళ్ళలాగా బతకడం కోసం మనుషులు కసాయి వాళ్ళె పెంచి పెద్దచేసిన పశువుల్ని గోరంట్ల సంత వంటి సంతలకు తోలుకుపోతున్న ఈ జిల్లా దారిద్ర్యాన్ని నూర్ అహ్మద్ రాసిన 'అమ్మకానికి' అనే కథలో చదివినప్పుడు ఇది నిజంగా ఎడారిగా మారిపోతుందేమోనని శరీరంలో వణుకు పుడుతుంది.
తెలుగు సాహిత్యలోకానికి మొన్నటి దాకా పరిచయం లేని సజీవమయిన ఈ జిల్లా
మాండలికంలో దూసుకొచ్చిన ఈ కథలన్నీ ఇక్కడి వాస్తవిక జీవిత చిత్రాలు. బతుకులోని వ్యక్తులే
ఈ కథల్లో పాత్రలై మాయమర్మం తెలీని తమ సహజమయిన ఆలోచనలతో, మాటలతో తమ
గుండెల్లో దాగిన వెతలనూ కథలనూ 'నెర్లునూ' 'మర్లునూ' సెబ్బరలనూ, సెటములనూ సూటిగా
తెలుపుతూ మన గుండెల్ని తడి చేస్తాయి. పాత్రలు మాట్లాడే మాండలిక భాష సందర్భాలకు
అతుక్కున్న సామెతలు కథనశైలిని శక్తివంతం చేసి ఇవి కథలు కావన్న భ్రమను కలుగ జేస్తాయి.
ఈ కథలన్నీ, సమాజం పట్ల ఈ రచయితలు నిర్వహించిన బాధ్యతలకు నిదర్శనాలుగా
మిగిలిపోతాయి.
జాతికి వెన్నెముక వంటి రైతు జీవితమే, వెన్నుపూసలు విరిగి ఎందుకు కుప్పకూలిపోతూవుందో ఈ కథల్లోని రచయిత కంఠస్వరాలు (టోన్స్') కథాశిల్పనిర్మాణాల ద్వారా వ్యక్తం చేస్తున్నాయి. ఆ కంఠ స్వరాలను అర్ధం చేసుకొని తగిన చర్యలు చేపట్టకపోతే, ఈ సమాజం ఈ ప్రభుత్వం ఇలాగేనిర్లక్ష్యం చేస్తే' ' ఈ సొతంత్రానికంతా అగ్గిపుల్లగిసి పడెయ్యల్ల. ఈ రాష్ట్రం మీద శేకరచ్చిన వుమ్మెయ్యల్ల' అన్న నిరసన వ్యక్తం కాక తప్పదనీ, అది దేశానికి ప్రమాదకరమనీ ఈ కధలు సూచిస్తున్నాయి. సంక్లిష్ట సమాజాన్ని విశ్లేషిస్తూ
ప్రాంతీయ ముద్ర కలిగిన ఈ కథలనే కాకుండా 'అనంత' కథకులు సంక్లిష్టతతో, వైవిధ్యంతో కూడుకున్న ఈ సమాజం యొక్క బాహ్య ఆంతరంగ జీవితాలను అనేక దృష్టి కోణాల నుండి దర్శించి బహుముఖాలుగా కథారచన చేశారు. తాత్విక దృక్పధంతో మనిషిలోని అగాధాలను చిత్రించారు. మనిషిలోని మంచినీ, మానవత్వాన్నీ, దానవత్వాన్నీ రికార్డు చేశారు. మధ్యతరగతి జీవిత మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. ఉద్యోగి జీవితంలోని వికృతాన్నీ, పోలీసు వ్యవస్థలోని అనైతికాన్ని వెటకరించారు. నేటి ప్రజాస్వామ్య విధానాలను హేళన చేశారు. దళితకంఠంలో సమాజాన్ని ప్రశ్నించారు. స్త్రీ వాదాన్ని ఆహ్వానించారు. నడుస్తున్న చదువులనూ అవి కలిగిస్తున్న అవిటితనాన్ని ఎత్తి చూపారు. విశ్వవిద్యాలయాల వీరంగం వివరించారు. మనిషిలోని అహంకారాన్ని, అంతర్ముఖాన్నీ, ఆధ్యాత్మిక తత్వాన్నీ, స్వార్ధాన్నీ నిస్వార్ధాన్నీ విశ్లేషించారు. ఈ కథలన్నీ 'అనంత' కథకుల సామాజిక స్పృహనూ, సాహిత్యతత్వాన్నీ ఆవిష్కరిస్తాయి. వాటిని గురించి సూక్ష్మంగా పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
ఈనాడు మనకుటుంబ వ్యవస్థలో ఆత్మీయతీలూ అనుబంధాలూ తరిగిపోతున్నాయి. ప్రతిచోటా ప్రతిచర్య వెనకా ఆర్ధిక సంబంధాలు ప్రధాన పాత్ర వహిస్తూ జీవితాన్ని ఎడారిగా మారుస్తున విధానం మనసున్న మనిషిని తొలుస్తున్న విషయం. ఈ విషయ నేపథ్యంలో సాగిన స్వామి ‘నీడల ముడులు' కథ నేటి మానవ సంబంధాలను ప్రశ్నించే కథ. ఈ కథలో ఒక మగవానికి భార్య అయినప్పటి నుండి ఇంటికి గొడ్డు చాకిరీ చేసి పిల్లల్ని కని పడరాని పాట్లన్నీ పడి వాళ్ళను పెంచి పెద్ద చేస్తుంది తల్లి. ఆ తల్లి తనను ముసలితనంలోకొడుకయినా కూతురయినా ఆస్తివుంటేనే చూస్తారనుకొని తాను దాచుకున్న దానితో వాళ్ళ ఆదరణను పొందడానికి పడే యాతన, వయసు పైబడిన ఏ మనిషినయినా కుంగదీస్తుంది. ప్రేమానురాగాలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయో 'వ్యక్తం చేస్తుంది.
ఈ విధంగానే చిలుకూరి దేవపుత్ర ఏకాకి నౌకచప్పుడు' కథలోని శారదమ్మపాత్ర. ఎండిపోతున్న ఇప్పటి మానవ సంబంధాలను ఒక శిథిల సంజ్ఞగా కనిపిస్తుంది. తండ్రి మరణశయ్య మీదున్నాడని తెలిసి ఎక్కడెక్కడో వుద్యోగాలలో వున్న కొడుకులూ బిడ్డలూ అందరూ భార్య పిల్లలతో విచ్చి విషయం తెలుసుకొని తల్లికి ధైర్యం చెప్పి, వాళ్ళందరూ తమ ఆత్మీయులే నన్న భావనను ఆ తల్లికి కలిగిస్తారు. కొడుకులూ కోడళ్ళతో బిడ్డ అల్లుళ్ళతో మనుమలతో ఇల్లంతా నిండుగా వుంటే బాధనంతా మరిచిపోయివాళ్ళందరూ వుండగానే తన భర్త చనిపోతే ఎంతబాగుండునని శారదమ్మ కోరుకుంటుంది. వారం రోజులయినా తండ్రి పరిస్థితి ఎటూ తేలక పోవడంతో తమ ఉద్యోగాల విషయం చెప్పి కొడుకులందరూ కలసి తల్లికి సహాయంగా ఒక నర్సును ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు. తన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళందరూ ముసలితనంలో తమను ఆదుకుంటారని అనుకున్న వాళ్ళందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్న వైనం, ఆ తల్లి ఏకాకి నౌకగా మారి చివరి మజిలీలో కొట్టుమిట్టాడి తనను గుర్తించలేని భర్తమీద వాలి తుది శ్వాస వదలిన విధానం కథలో చూసినప్పుడు గుండె బరువై పెదవులు బిగుసుకుపోయి కనుగుడ్లమీద నీళ్ళు పారాడుతాయి. ఇలాగే ఆర్ధిక సంబంధాలు సృష్టిస్తున్న కృత్రిమపు విలువల మూలంగా మనిషి అందమైన బాల్య స్నేహాన్ని మరిచిపోతున్న పద్ధతిని స్వామి కథ 'ఆగాధం' చాలా స్పష్టంగా తెలుపుతుంది.
ఓరెండు తరాల కాలం వెనక్కివెళ్ళి చూస్తే మంచిగంధం లాంటి మంచితనం. కన్నవూరుమీదా, కన్నవాళ్ళమీదా, ఆదుకున్నవారిమీదా, తోటిమనుషుల మీదా మల్లెపువ్వు వంటి మమకారం, అవి గుబాళించే మానవత్వపు విలువలూ గుర్తుకు వచ్చి శరీరాలు పులకరిస్తాయి. కథకుని జ్ఞాపకాల్లో వాళ్ళవూరి మహావైద్యగాడుగా పేరుపొందినవాడు కొండయ్యతాత. నాటు వైద్యునిగా ఆవూరి వాళ్ళందరికీ కొండయ్య తాత ఆత్మబంధువు. అతని కళ్ళముందే బంగారుకాలం పోయి పిదప కాలం వచ్చింది. ఆటుపోట్లు ఎదురయ్యాయి. అక్కడ బతకడం కష్టమని కొడుకూ పిల్లలూ కూలికోసం సేలం వైపు వెళ్ళిపోయారు. అయినా తాను కన్నవూరును వదలలేకపోయాడు. వయసు పండబారిపోయినా ఎవరినీ దేవురించక కట్టెలుకొట్టి బతుకుతూనే తాను జీవించే జీవితం పట్ల గొప్ప ప్రేమను పెంచుకున్నాడు. మాయ మర్మం లేకుండా సరదాగా ఆరోగ్యంగా చివరికి తన చావుభారం కూడా కొడుకు మీద పడకుండా వాళ్ళకోసం దాచుకున్న దాన్ని పక్కనున్న వాళ్ళకు అందజేసి, తానుపోయిన తర్వాత తన వూరికి ఎవరు వైద్యం చేస్తారో అని దిగులుపడుతూ కళ్ళు మూస్తాడు. మానవ జీవితంలోని పరమార్ధాన్నంతా రంగరించి ప్రపంచమతాల సారాన్నంతా చిలికి కొండయ్య తాతగా చిత్రించిన జి.ఆర్. మహర్షికథ ' మా వూరి మహావైద్యగాడు' పాఠకుల గుండెల్లో దాగిన మంచితనాన్ని తట్టిలేపే కళాఖండం. ఇలాగే స్వామి కథ 'పిప్పి మనిషి'లో కూడా జీతగాని మంచితనంపైన మనకు ఎంతో ప్రేమ కలుగుతుంది. ఆ జీతగాని చెమటతో ఉన్నతులయిన వాళ్ళు అతని మీద చూపే కనికారపు చేష్టల్ని చూసి బాధవుతుంది.
మనిషయిన ప్రతివాడూ తన్ను తాను మరిచిపోయి తన అంతరంగం లోకి చూసుకున్నప్పుడు ఎంతో వికృతంగా భయంకరంగా కనిపిస్తాడు. తాను బతుకుతున్న జీవితం ఎంతో అపద్దం లాగా అగుపిస్తుంది. ఈ తాత్విక ధోరణిని సూచిస్తూ స్వామి రాసిన అద్దం, 'రెండు అపద్దాలు' వంటి కథలు, ప్రతి మనిషీ అంతర్ముఖుడు కావాలని చెప్పుతాయి.
మతమనేది మనిషి దైనందిన జీవితంతో సంబంధం లేనిది. అది మనిషి ఆధ్యాత్మిక భావనకు చెందినది. అటువంటి మతాన్ని రాజకీయం చేసి కపట రథయాత్రలు సాగించడమేమిటి?. మతాల పైన మక్కువ వుండడమంటే ఎగరడమూ నరుక్కోవడమేనా ? వృక్షమతం జంతుమతం పరస్పర ద్వేషభావంతో నాశనం కావడమేమిటని మతవాదులను ప్రశ్నిస్తున్న బద్వేలి రమేష్ కథలు 'అగ్ని సర్పం' 'వెంటాడే చీకటి' తాత్విక దృక్పథంలో మనిషిని ఆలోచింపజేస్తాయి. దైనందిన వ్యవహారంలో మనిషికి మతంతో అవసరం లేకపోయినా చావు మొదలైన సందర్భాలలో మతాన్ని ముడివేసుకున్న సంఘానికి ప్రతివాడూ బందీకాక తప్పదన్న లోక సత్యాన్ని చిలుకూరి దేవపుత్ర 'బందీ' కథ తెలుపుతుంది. సంఘజీవికీ, సంఘంపైన కొన్ని ప్రత్యేకమయిన సందర్భాలలో . ఆధిపత్యం వహిస్తున్న మతానికీ గల సంబంధాలను గురించి ఈ కథ ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. మనిషిలోని మంచితనాన్ని చూడకుండా అతడు తన మతసంఘంలో సభ్యుడాకాదా అని చూసే మతం మనకు అక్కరలేదని ఎంతనుకున్నా, మనిషి చనిపోయాక ఆ శవాన్ని ఎక్కడ పాతిపెట్టినా ఒకటేనని హేతువాద దృష్టితో ఎంత సమాధాన పరచుకున్నా ఆ అనుకోడాలనూ, ఆ సమాధానాలనూ అధిగమించి మనిషి కల్పించుకున్న మతం కొన్ని సందర్భాలలో మనిషిని బంధించడం మానదేమో అన్న అభిప్రాయాన్ని ఈకథ కలిగిస్తుంది.
ఇక ఈ సమాజంలోని చదువుల విషయానికొస్తే, అవి మనుషుల్ని విజ్ఞాన వంతుల్ని చేస్తున్నాయా లేక అప్రయోజకుల్ని చేస్తున్నాయా అనే సంశయం కలుగుతుంది. సామాజిక చైతన్యంకోసం, బతకడానికి మార్గాలను ఏర్పరచుకోవడం కోసం మనిషికి చదువు అవసరం. కానీచదువుకుంటే ప్రభుత్వం ఉద్యోగమిస్తుందన్న దురభిప్రాయంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాక స్వయంగా పని చేసుకోవడం చేతగాక కుమార్ వంటి యువకులు ఈ రోజు మానసికంగా అవిటి వాళ్ళవుతున్నారు. అతి తక్కువ విద్యాస్థాయితోనే చేతనయిన పనులు చేసుకుంటూ హాయిగా బతుకుతున్న తమ తోటి వాళ్ళ ముందు అవమానంగా ఫీలవుతున్నారు. ఈ విషయాన్ని దేవపుత్ర కథ 'అవిటివాడు' చక్కగా చిత్రిస్తుంది. అట్లే విద్యవల్ల మానసికంగా - అవిటివాడైన ఒక కొడుకు తనను ఎంతో ప్రేమగా పెంచిన తండ్రి చనిపోయినప్పుడు బాధలో భాగంగా, తండ్రి ఉద్యోగం తనకొస్తుందన్న ఆలోచనతో సంతృప్తి చెందడం ఒక రాక్షసనీడగా ఈ సమాజంలో పరచుకుంటూ వుంది. ఈవిషయాన్ని దేవపుత్ర మరోకథ 'రాక్షసనీడ' చాల గొప్పగా వివరిస్తుంది. ఈ రాక్షసనీడ ఆర్థిక సంబంధాలతో ముడివడి తక్కిన సంబంధాలనన్నిటినీ కేవలం నటనలుగా చేస్తున్న వైనాన్ని కూడా సూచిస్తుంది.
ఈనాటి యువతకు మానసిక అవిటితనం కలిగిస్తూ రాక్షసనీడలవైపు మళ్ళిస్తున్న ఈ చదువులు దేశాన్ని ఉద్ధరించేమాట ఏమోగానీ చదువుకుంటున్నవాళ్ళు మాత్రం, తమ కోసం జీవిత సారాన్నంతా తాకట్టుపెట్టి అన్ని సుఖాలకూ దూరమై నలిగిపోతున్న తల్లిదండ్రుల దుఃఖాన్ని అర్ధం చేసుకోవడం లేదనీ, పేదవాళ్ళను దోచుకోవడమే చదువుల అంతిమ లక్ష్యమవుతున్నదనీ జి.ఆర్. మహర్షి 'నన్ను క్షమించుకన్నా' కథలో వ్యక్తం చేసిన నిరసన విద్యా వంతులవుతున్న వాళ్ళ మూలాలను ప్రశ్నిస్తుంది. ఈ చదువుల కోసం తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు పడే తపనను బద్వేల్ రమేష్ 'ప్రెగ్నెంట్ కాన్వెంట్' కథ వ్యంగ్యంగా అధిక్షేపిస్తుంది. చదువు ద్వారా తమ పిల్లల్ని నీతివంతుల్ని చేయవలసిందిపోయి కేవలం సర్టిఫికెట్ల కోసం అధికారులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని అక్రమ మార్గంలో పాస్ చేయిచడానికి ఎంతగా అవినీతికి పాల్పడుతున్నారో, ఇతరుల పిల్లల విషయములో ఎంతనీతిమంతులుగా ఫోజులు పెడుతున్నారో, సింగమనేని నారాయణ కథ 'పరీక్ష' బట్టబయలు చేస్తూ ఈనాటి విద్యా విధానాన్ని ఎండగడుతుంది. జి. ఆర్. మహర్షి రాసిన 'శంకరం అనే ఆర్, ఎస్. కథ' విశ్వవిద్యాలయాల్లో శుష్కమేధావుల దగ్గర విధ్యాపరిశోధన ఎంత అపహాస్యం పాలవుతూ వుందో హాస్యవ్యంగ్యధోరణిలో చమత్కారంగా వివరిస్తుంది.
అవినీతిని ప్రోత్సహించే చదువుల పేరు చెప్పుకుని ఉద్యోగాల్లో చేరిన మన మేధావులు - ముఖ్యంగా పోలీసు రెవిన్యూవంటి శాఖల్లో చేరిన ఉద్యోగులు చదువుల ఫలితాన్ని ఏవిధంగా వెలగవెడుతున్నారో అందరికీ తెలుసు. ఏసాహిత్యమూ, ఏమతమూ, ఏచట్టమూ వీళ్ళను మార్చలేక పోతూవుంది. అట్లని చైతన్యవంతుడయిన రచయిత మౌనంగా వుండలేదు. అనంత కథకుడు కూడా వుండలేక పోయాడు. కేసుల కోసం అమాయకులను డెకాయిట్గాగా అరెస్టు చేసి నిజమయిన డెకాయిట్స్ వాళ్ళేనని సొమ్ముపోగొట్టున్న వాళ్ళ చేత ఐడెంటిఫై చేయించడానికి పోలీసులు తొక్కుతున్న అక్రమ మార్గాలను 'ఐడెంటిఫికేషన్' అనే కథ చిత్రించిన తీరు చూస్తే మనస్సు చివుక్కుమంటుంది. ఈదేశంలో ప్రజలకు భయమంతా రక్షక భటుల వల్లనే. వాళ్ళకు దొరకాలే గానీ 'ఈతలకాయలు మావి కావు, వేరేవాళ్ళవి, దొంగతనం చేసి తెచ్చాం' అని మనతోనయినా ఒప్పించ గలరు. అందుకే రామలింగం, సమయం తప్పి లారీలో వచ్చి అర్ధరాత్రప్పుడు బైపాస్ రోడ్డు దగ్గర దిగి టౌన్లోవున్న తన ఇంటివైపు నడుస్తూ పోలీసుల్ని గుర్తు చేసుకొని భయపడతాడు. దారి మధ్యలో హఠాత్తుగా అడ్డగించి తన దగ్గరున్న సూట్కేసును లాక్కున్న వ్యక్తి పోలీసు కాదని నిజంగా దొంగవాడనీ తెలిసి ఆనందంతో గంతులు వేస్తాడు. ఈ విషయాన్ని 'దొంగయితే బాగుణ్ణు కథలో చదివినప్పుడు మనం ఎగతాళిగా నవ్వుకుంటాం. ఈరెండు కథలేకాక పోలీసు వ్యవస్థ పొట్టవిప్పి అందులోని పురుగులు కూడా ఎంత క్రూరంగా వున్నాయో చూడండని దేవపుత్ర రాసిన 'ఆరుగ్లాసులు', 'విడుదల' కథలు చూపుతాయి. కేసుల కోసం రైల్వేప్లాట్ఫారాలమీద కాఫీలమ్ముకునేపసిపాల్లలపైన కూడా పోలీసులు కేసులు పెడుతున్న విధానాన్ని, ఏనేరమూ చేయకపోయినా అమాయకులు జైలుకు వెళ్ళి బయటకు వచ్చీరాగానే మళ్ళీ జైలు పాలవుతున్న పద్ధతిని ఈకధల్లో చూసినప్పుడు మనపిడికిళ్ళు అప్రయత్నంగా బిగుసుకుంటాయి. అయితే పోలీసులు సమాజానికి ఎంత భయంకరంగా కనిపిస్తారో అంత అణకువగా తమడిపార్టుమెంటులోని పైఅధికారుల దగ్గర మసలుకోవడాన్ని దేవపుత్ర 'ఆర్డర్లీ' 'మీసాలు' కథల్లో చదువుకొని జాలిపడతాం, ఎగతాళిగా మారుతున్న వాళ్ళ వేషాలను చూసి నవ్వుకుంటాం.
పోలీసు శాఖను వదలి పక్కకు వస్తే మిగిలిన అన్ని ప్రభుత్వశాఖల్లో కూడా ఎన్నో అక్రమ పద్ధతులూ వక్రమార్గాలూ దర్శనమిస్తాయి. అవి చూసినప్పుడు చదువుకొని మేధావులయిన, ఉద్యోగుల పైన ఒక విధమయిన జుగుప్సవుడుతుంది. బాధ కలుగుతుంది.
జీవితం పట్ల ఒక స్పష్టమయిన అవగాహన లేని వాడు ఎవరు ఏదిచెప్పినా స్పందిస్తూ,స్పందించడమే మంచి తనం అనుకుంటాడు. వేదాంతం వల్ల ప్రపంచమంతా మాయే అని తాను సిగరెట్టు తాగినామాయే తాగక పోయినా మాయే అనుకుంటూ లంచాలు తీసుకోవడం కూడా ఒకమాయే అనుకుంటాడు. అటువంటి ఒక రెవిన్యూ ఉద్యోగి అవినీతిని హేళన చేస్తూ దేవపుత్రరాసిన కథ 'తివిరి ఇసుమున', దసరా ఇనాముల పేరుతో పోలీసులూ, కరెంటు వాళ్ళు, సేల్ట్యాక్సు ఇన్కంటాక్సు మొదలైన ప్రభుత్వ శాఖల వాళ్ళూ ఎలా బిచ్చగాళ్ళవుతున్నారో తెలుపుతున్న కథ 'విజయవిహారం', ప్రభుత్వధర్మాసుపత్రి అవినీతి రొచ్చుతో ఎంతగా కంపుకొడుతూవుందో వివరించిన కథ 'రొంపి' మొదలయిన శాంతి నారాయణ కథలు పుచ్చుపడుతున్న ఈ సమాజ అంతరంగిక స్వరూపానికి ప్రతిబింబాలుగా కనిపిస్తాయి.
ఎన్నో కారణాల వల్ల వ్యవస్థలో ఆర్థిక బలహీనత ప్రధానమయిన భాగం అవుతూవుంది. తిండి పెట్ట వలసిన రైతే తిండి లేక అలమటిస్తున్నప్పుడు మధ్యతరగతి, బడుగు వర్గాల వాళ్ళ పరిస్థితి పట్టణాల్లో కానీ పల్లెల్లోకానీ కష్టంగానే వుంటుంది. వ్యవసాయకంగా అభివృద్ధి లేని ప్రాంతంలో ఏవర్గజీవితమయినా సుఖంగా వుండదు, పేదరికం తాండవిస్తూ వుంటుంది. ఎంత పేదరికమంటే, దిక్కులేని ఒక ఆడది జబ్బుచేసి ఆసుపత్రిలో చని పోయిన తన నాలుగేండ్ల కొడుకు శవాన్ని భుజాన వేసుకొని కొంగుకప్పుకొని, తాను ఏడిస్తే కారణంతెలుసుకొని రిక్షావాడు ఎంతడబ్బు డిమాండు చేస్తాడోనని భయపడుతుంది. బస్సులో ఎక్కించుకోరేమోనని దిగులు పడుతుంది. పుట్టెడు దుఃఖాన్ని జానెడు కడుపులో దాచుకున్న భయం కరమయిన విషయాన్ని, ఏడ్చడానికి కూడా ఇరుకయిన ఆమె పేదరికాన్ని దేవపుత్ర కథ 'ఇరుకు' లో చదివి చలించిపోతాం. అంగవైకల్యం కంటే ప్రభుత్వం అంగ వికలత్వానికి నెలనెల ఇచ్చే యాభైరూపాయలు కుటుంబానికి ఎంతో విలువయిందని భావిస్తున్న మధ్యతరగతి కుటుంబాల పేదరికంలోని ట్రాజెడీని సింగమనేని కథ‘ట్రాజెడీ'లో చూసినప్పుడు ఎంతోవేదన చెందుతాం.
ఏప్రాంతంలో నయినా ఉపరితలంలోని ఆర్ధికమైన వెనుకబాటుతనం ఆంతరంగిక జీవితంలో కూడా ఎంతో ప్రభావాన్ని చూపి సమస్యల్ని లేవనెత్తుతుంది. ఆత్మీయతలపైన అనుబంధాల పైన దెబ్బతీస్తుంది. ఈ విషయాన్ని మనం సింగమనేని నారాయణ కథ 'జవాబు'లో చూడవచ్చు. గ్లాసులో పోసిన కాఫీనంతా తాగేసిన కన్న కొడుకును తల్లి చితక బాదుతుంది, అది చూసినప్పుడు ఈమె ఒక మాతృమూర్తేనా అనిపిస్తుంది. ఎక్కడెక్కడోతిరిగి అప్పుడే ఇంట్లోకి వచ్చిన మగవాడు పిల్లవాణ్ణి కొడుతున్న భార్యను అడ్డుకొని పురుషాహంకారంతో ఆమెను గొడ్డును బాదినట్లు బాదుతూ కొడుకును కొట్టడానికి కారణం అడుగుతాడు. దెబ్బలు తింటూ ఎంత సేపటికి నోరు మెదపని ఆమె చివరికి 'నీకోసం తీసిపెట్టిన కాఫీ తాగితేను----' అని చెప్పిన జవాబు ఆమె దారిద్ర్యానికి కారణమయిన ఈవ్యవస్తనూ దాన్ని పరిష్కరించుకోవడానికి మగతనం లేని తన భర్తనూ మెత్తని చెప్పులతో చితకబాదినట్టు మనకు వినిపిస్తూ తల తిరిగేలాగా చేస్తుంది. అట్లేసింగమనేని 'హింస' కథలో మధ్యతరగతి జీవితం ఆర్థికంగా చిదిగి పోయినప్పుడు సమిష్టి కుటుంబంలో మనిషి ఎంత హింసకు గురి అవుతుందో తెలుసుకుంటాం.
రాయలసీమలో భాగంగా అనంతపురంలో కూడా 'హింస"" బాగా చోటుచేసుకుంటూ వుంది. బాంబుల సంస్కృతి పెరుగుతూవుంది. గ్రామీణ జీవితంతో పాటు పట్టణ జీవితం కూడా కక్షలతో, కార్పణ్యాలతో ఉడికి పోతూవుంది. ఏచిన్నతగాదాతలెత్తినా అక్కడ రాజకీయాలు చోటు చేసుకొని పరిస్థితిని మరింత తీవ్రం చేసి హింసను ప్రేరేపిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా ఇక్కడి రచయితలు రికార్డు చేశారు.
హిందూపురం ప్రాంతంలో వెన్నేటి పక్కనున్న పల్లెలు పెన్నలోని ఇసుకను హిందూపురానికి చేరవేస్తూ ప్రశాంతంగా బతుకుతున్నాయి. ఈమధ్యలో వచ్చిన రాజకీయ పరిణామాలు అప్రశాంతతను aerate చేస్తాయి. వెంకట రామప్పలాంటి వ్యక్తుల రాజకీయంలో భాగంగా సుబ్బిరెడ్డి వంటి రైతు బిడ్డలు వ్యవసాయం వదలి ఇసుక కంట్రాక్టుకోసం తమ కుటుంబాన్నే కాకుండా గ్రామాన్నంతా అగ్నిగుండంగా మారుస్తారు. ఈ మొరటుకక్షలు నాగరికతకు సవాలుగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని సడ్లపల్లి చిదంబర రెడ్డి 'ఇసుక' కథలో గొప్పగా చిత్రీకరించాడు. వ్యక్తి గతమయిన ఆధిక్యత కోసం అర్ధం లేని పౌరుషాలతో చెలరేగుతున్న ఇక్కడి హింస, ఈప్రాంతజీవితాన్నే కాకుండా మధురమయిన అనుబంధాలను కూడా ఎంతో నిస్సారం చేస్తూవుందని శాంతి నారాయణ 'గర్భస్రావం' తెలుపుతుంది.
తీపి
సమాజంలోని భిన్న భిన్న పార్శ్వాలలో కనిపించే జీవితాన్ని 'అనంత' కథలు పైవిధంగా చిత్రిస్తే, వ్యవస్థాపరమైన సమస్యలలోని మౌలికాంశాలను అంతకన్నా శక్తివంతంగా చిత్రించాయి. ఈ వ్యవస్థలో ఇప్పుడు రగులుతున్నవి దళిత సమస్య, స్త్రీ సమస్యలు. ఇంకా చెప్పాలంటే దళితవాద, స్త్రీవాదాలు. అనంత కధకులు ఈ విషయాల పట్ల కూడా ఉదాసీనంగా వుండలేక పోయారనడానికి ఎన్నో కధలు సాక్ష్యాలుగా కనిపిస్తాయి.
బూటకపు ప్రజాస్వామ్యం ఓట్ల కోసం చట్టాలు మార్చి ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా, ఉపరితలంలో మార్పును ఆశించినా వ్యవస్థలోని మూలాలలో మార్పులురానిదే చట్టాలు కాగాతాల వరకే పరిమితమవుతాయి. ఆమూలాలలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించ కుండా కేవలం హరిజనులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ప్రభుత్వాలు తృప్తిపడితే ప్రయోజనం వుండదు. కాబట్టి ఓబులు గాడు వంటి ఎంత మంది హరిజనులు గ్రామ సర్పంచులయినా పాతకాలపు సల్లడాలూ, చినిగిన గుడ్డ బనియన్లు తొడుక్కుని, చింపిరి తలలతో, తాము సర్పంచుమన్న స్పృహయినా లేకుండా భీమప్పలాంటి మోతుబరి రైతుల ఇళ్ళల్లో జీతగాళ్ళుగా పని చెయ్యక తప్పదనీ, అధికారమంతా ఉన్నత కులాల వాళ్ళదేనని చెబుతున్న దేవపుత్ర 'ఊడలమర్రి' కధ మన ప్రజాస్వామ్య విధానాలను ఎగతాళిచేస్తుంది, దేవపుత్రదే 'సమిధలు' అనే మరోకథ గ్రామాలలో ఆర్థికంగా, సాంఘికంగా ఉన్నతమయిన రెండు వర్గాల మధ్య దళితులు ఏవిధంగా మాడిపోతున్నారో రుజువు చేస్తూ దళితచైతన్యానికి ఊపిరిపోస్తుంది.
వైజ్ఞానికంగా దేశంలో ఎంతో మార్పు వొస్తున్న పల్లెల్లో టీ కొట్లదగ్గర ఇంకా దళితులకు ప్రత్యేకంగా కాఫీగ్లాసులు వుంచడం, విద్యావంతులయినా సరే దళితులకు దేవాలయ ప్రవేశాన్ని నిషేధించడం చాలా బాధ కలిగించే విషయాలు. పెళ్ళిల్ల వంటి శుభకార్యాలు చేసుకున్నా, ఊరి పెద్దలను గౌరవిస్తూ వాళ్ళకు బియ్యం బేడలు పంపినా గ్రామాలలో హరిజనులు మాత్రం ఊరినడివీధిలో బండ్లెక్కి ఊరేగ కూడదంటే వాళ్ళ దారి పబ్లిక్ లెట్రిన్ పక్కనే అని అగ్రకుల ఆధిక్యత శాసిస్తే గ్రామ జీవనాడుల్లో కొత్తసవ్వడులు ఈనాడు వినిపించక మానవు. ఈవిషయాలను సింగమనేని ‘మకరముఖం' శాంతి నారాయణ 'జీవనాడులు' అనే కధలు సహజంగా విశ్లేషిస్తాయి.
తరతరాలనుండి అణచి వేయబడిన స్త్రీ ఈరోజు తానెవరో తన అస్తిత్వమేమిటో ప్రశ్నించుకుంటూవుంది. స్వేచ్చను కోరుకుంటూ వుంది, గుర్తింపుకోసం ప్రయత్నిస్తూవుంది. ఎన్నో
ప్రాంతీయ కారణాల వల్ల ఇక్కడి స్త్రీ, స్వేచ్ఛకోసం ఉద్యమించకపోయినా తనమీద కుటుంబభారమంతా మోపి విచ్చల విడిగా తిరిగే మొగుణ్ణి, తన శ్రమను తక్కువగా చూసే కోరుకుల్నీ, బిడ్డల్నీ, చీదరించుకుంటూ తన ఉనికిని కాపాడుకోవాలనుకునే విషయాన్ని స్వామి 'రాసిన 'అమ్మ' కథ చక్కగా చిత్రిస్తుంది. విధవలైన తన తల్లీ అత్తల దయనీయస్థితికి ఆర్ధిక హక్కులు లేకపోవడమే కారణమని, విధవరాలయిన తనకు మళ్ళీ పెళ్ళి కంటే వైధవ్యం వల్ల వచ్చిన ఆస్తిహక్కూ ఉద్యోగమే ముఖ్యమంటున్న నేటి స్త్రీ ఆలోచనా విధానాన్ని 'బొమ్మా బొరుసూ' కథ హేతుబద్ధంగా విశ్లేషిస్తుంది. ఆశించినవి ఏవి అందక నిరాశా నిస్పృహల మధ్య నలిగి పోతున్న ఈ నాటి స్త్రీ వ్యక్తిత్వం కోసం మౌనంగా పోరాడడాన్ని షహనాజ్ రాసిన 'మౌనపోరాటం' కథ, ప్రజీవితంలోని కన్నీటి వెతలను 'త్యాగం', 'మబ్బుచాటు నక్షత్రం 'చీకటి పొరలు' చాలా సహజంగా అవిష్కరిస్తాయి.
వ్యవసాయ జీవితం ఎంత దిగజారి పోతున్నా, మధ్యతరగతి జీవితంలో అవినీతి ఎంత చోటు చేసుకుంటున్నా నిరుద్యోగ సమస్య ఎంతగా విస్తరిస్తున్నా ఎన్నోకారణాల వల్ల ఇక్కడ ఉద్యమాలు ఇప్పటికీ కార్యరూపం చెందడంలేదు. అవినీతిని నిలయమయిన మేధావి వర్గం మాత్రం ఎదుట కనిపించే అవినీతిని గురించి వ్యథచెందుతూ ధర్మావేశాన్ని కేవలం మాటల్లో చూపుతూ, చేతలలో దిగజారిపోతూ పబ్బం గడుపుకుంటున్న విధానాన్ని సింగమనేని కథ ''బుడగలు' చాలా వ్యంగ్యంగా శక్తివంతంగా ప్రస్తావిస్తుంది.
జీవితంలోని ఎన్నో అంశాలను వివిధ కోణాల నుండి చూసి సీరియస్ గా కథలు రాస్తున్న అనంతపురం కథకుల కంఠస్వరాలు ఏమిటో ఈ కథల్లో మనం చూడవచ్చు. వీళ్ళందరూ వ్యాపార దృష్టితో కాకుండా తమ చుట్టూవున్న సంఘం పట్ల బాధ్యతను ఫీలై రాస్తున్న రచయితలు. ఈజీవితం పట్ల వీళ్ళకు కొన్ని దృక్పధాలు ఉన్నాయి. భావజాలం విషయంలో నిబద్ధత వుంది. కొందరికి మానవీయతే రచనా నిబద్ధత అయితే, కొందరికి వాస్తవిక జీవితం గురించి శాస్త్రీయమయిన విశ్లేషణా తత్వమే నిబద్దత. మరి కొందరికి జీవితంలో కనిపించని ఆంతరంగిక పార్శ్వాన్ని చూడడమే నిబద్ధత.
ఇక్కడ పేర్కోన్న రచయితలే కాక దస్తగిరి, కె.యం.రాయుడు, రమణజీవి, విజయలక్ష్మీరాజు, దేసెట్టికేశవరావు, కె.కె. బాషా, జూపల్లి ప్రేంచంద్, కృష్ణవాణి, శశికళ, నిర్మలారాణి, రాప్తాడు గోపాలకృష్ణ మొదలయిన వాళ్ళు సీరియస్ గా రాస్తున్న కథలు జీవితంలోని అనేక అంశాలను శక్తి వంతంగా చిత్రిస్తున్నాయి. ఈ జిల్లా వాళ్ళు కాకపోయినా ఇక్కడ స్థిరపడిన ఆచార్య కొలకలూరి ఇనాక్, సగరం పార్ధసారధి, డా॥ కేతుబుచ్చిరెడ్డి, జి.నిర్మలారాణి, అమళ్ళదిన్నె పద్మజాశర్మ మొదలయిన కథకులు కథాసాహిత్యంలో నిలిచిపోదగిన కథలు రాశారు, రాస్తున్నారు.
దాదాపు రెండు డజన్లమంది కథారచయితలు పాపులర్ కథా రచన జోలికి పోకుండా తమదైన శైలిలో కథారచన చేస్తుండడం చూస్తే అనంతపురంలో కథ ఆలస్యంగా పుట్టినా చాలా తక్కువ కాలంలోనే మంచిదశకు ఎదిగిందనిపిస్తుంది. నూతలపాటి గంగాధరం అవార్డు (ఆరుగ్లాసులు), ఆంధ్రప్రభ ఉగాది కథల పోటీలలో ప్రధమ బహుమతి (వానరాలే), ఉదయం వార పత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి (నీడలముడులు), మయూరి కథల పోటీలలో ప్రధమ బహుమతితి (ఆరుగ్లాసులు), విపుల కథలపోటీలలో కన్సొలేషన్ బహుమతులు (బొమా బొరుసూ, అధోముఖం) పొందటం 'అనంత' కథల కథాస్థాయికి ఒక నిదర్శనం. వందలా కథలతో మంచి కథలతో, గొప్ప కథలతో 'అనంత' కథ వికాసం చెందుతూ మునుముందు విశ్వకథా సాహిత్యంలో చోటు చేసుకోగలదని ఆశిద్దాం.
(సీమసాహితి,మే జులై 1996)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి