తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ
తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ
ఇనుప యుగం కంటే ముందు నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆదిమానవులు ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో జనపదాలు ఏర్పడి ఉండాలి. పైగా భాష కూడా ఏర్పడి ఉండాలి. జనపదాలు పెద్దవై రాజ్యాలు ఏర్పడిన తర్వాత తొలి శాసనాలు రాయలసీమలోనే లభించాయు. దీన్నిబట్టి తెలుగువారు రాయలసీమ వారై ఉంటారని భావించవచ్చు . క్రీ.శ.6వ శతాబ్దం నాటికి దానిని రేనాడు అనిపిలిచే వారు.రేనాడు ఏడువేల గ్రామాల సముదాయం.దీనిని రేనాటి చోళులు పాలించేవారు. కర్నూలు జిల్లా ఎర్రగుడిపాడు ఎర్రగుడి దగ్గర లభించిన శాసనాల ద్వారా సీమాంధ్ర ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ తర్వాత తెలంగాణ అని తుర్లపాటి రాజేశ్వరి పేర్కొన్నారు.
క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో ఎరికల్ ముత్తు రాజు బిరుదు గల ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలిస్తున్న కాలంలో వేయించిన శాసనం తెలుగులో వుంది. కమలాపురం లోని ఎర్రగుడిపాడు దగ్గర లభించిన క్రీ.శ.600 నాటి శాసనం కూడా తెలుగులోనే వుంది. కమలాపురంలోనే ఇందుకూరు లో ధనంజయుని కొడుకు చోర మహారాజు కూడా ఒక శాసనాన్ని తెలుగులో వేయించాడు.క్రీ.శ. 630 నాటి కమలాపురం లోని తిప్పలూరు శాసనం కూడా తెలుగులో ఉంది. క్రీస్తు శకం 643 లో తూర్పు చాళుక్య రాజైన జయసింహ వల్లభుడు వేసిన విప్పర్ల చేజెర్ల శాసనాలు ఆనాటి తెలుగుభాషకు అద్దం పడుతున్నాయి. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చాళుక్య సేనాని పండరంగడు వేయించిన అద్దంకి శాసనం ఉంది.అది తరువోజ లో ఉంది.చాళుక్య భీముడు వేయించిన శాసనం సీస,గీత పద్యాలలో, యుద్ధ మల్లుడి బెజవాడ శాసనం మధ్యాక్కర లో రాశారు. ఇవన్నీ నన్నయకు పూర్వం శాసనాలు. దేశీయమైన కవితలు.
క్రీ.శ.575 నాటి నుంచే తెలుగు లిపి పరిణామం చెందుతూ వచ్చింది. ఇది బ్రాహ్మిలిపి నుంచి వచ్చింది.
భారతదేశంలోని లిపులన్నింటికి మూలం బ్రాహ్మీ లిపే.ఇది అశోకుని కాలానికి ముందే రెండు శాఖలుగా చీలిపోయింది.1.ఉత్తర బ్రాహ్మీ లిపి 2.దక్షిణ బ్రాహ్మీ లిపి.
ఉత్తర భారతదేశంలోని లిపులన్నింటికి మూలం "ఉత్తర బ్రాహ్మీ లిపి" కాగా,, దక్షిణ భారత దేశంలోని లిపులన్నింటికి "దక్షిణ బ్రాహ్మీ లిపి" మూలాధారం.
ఈ విధంగా దక్షిణ భారతంలోని తమిళభాష, మలయాళ భాష,, కన్నడ భాష,, తెలుగు భాష, మొదలగు భాషల లిపులన్నింటికి దక్షిణ బ్రాహ్మీ లిపినే మూలాధారం. దక్షిణ బ్రాహ్మీ లిపి నుండి 11 వ శతాబ్దం కాలంలో 'కదంబ' లిపి నుండి కన్నడ, తెలుగు లిపులు ఏర్పడ్డాయి. ప్రారంభంలో తెలుగు,కన్నడ లిపులు ఒకే రకంగా ఉండేవి. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు.
నన్నయకు పూర్వం తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని తూర్పు చాళుక్య లిపి లేదా
వేంగీచాళుక్య లిపి అనేవారు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే రాసినారు. ఆ లిపిలో తాటాకుపైనగాని గంటంతో రాసేటప్పుడు తలకట్లు దీర్ఘాలు రాస్తే తాటాకు చినిగిపోయేది. నన్నయ దీనికి పరిష్కారంగా ఇప్పటి తలకట్లను దీర్గాలను రూపొందించాడు.
భాషాపరంగా కన్నడ తమిళ భాషలు ద్రావిడ కుటుంబానికి చెందినవి. అయితే, ఆ మూలభాష నుండి ఒక భాష ముందుగా విడివడింది. ఆ భాష క్రమేపీ కన్నడ, తెలుగు భాషలుగా విడిపోయింది. విడిపోయినా లిపి మాత్రం ఒకటే ఉంది. ఆ లిపి కన్నడ భాషకి స్థిరపడగా, సా. శ. 10..11 శతాబ్దాల నాటికి ప్రత్యేకంగా తెలుగుకు కూడా లిపి ఏర్పడింది. కన్నడ లిపికి చాలా సమీపంగా ఉన్న లిపిలో వేసిన శాసనాలను "తెలుగన్నడ" (తెలుగు+ కన్నడ) శాసనాలు అన్నారు చరిత్రకారులు. కానీ ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది.కాల గమనంలో రెండు భాషలకు వేరు వేరు లిపి రూపొందింది.
____ పిళ్లా కుమారస్వామి,949012229
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి