రాజకీయ చైతన్యం , సేవాతత్పరత కలిసిన కడప తేజం కడప రామసుబ్బమ్మ
రాజకీయ చైతన్యం , సేవాతత్పరత కలిసిన కడప తేజం కడప రామసుబ్బమ్మ
దేశ స్వాతంత్య్ర సాధనలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమఉజ్జీలుగా నిలిచి ఎన్నో త్యాగాలు చేశారు. మహిళా శక్తి స్వాతంత్ర్య ఉద్యమానికి సంపూర్ణత్వాన్ని, సమగ్రతను చేకూర్చింది.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వేలాది ఆంధ్ర మహిళలు అమితోత్సాహంతో పాల్గొన్నారు. ఆంగ్లేయుల దమననీతిని భారత నారీ లోకం తలఒగ్గక ఎదురొడ్డి నిలిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భారత నారీమణులలో పేర్కొనదగినవారు కస్తూరిబా గాంధీ, కవికోకిల సరోజినీనాయుడు, దుర్గాబాయి దేశ్ ముఖ్, ద్రోణంరాజు లక్ష్మిబాయమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, ఆచంట రుక్ష్మిణి దేవి, పొణకా కనకమ్మ, మాగంటి అన్నపూర్ణమ్మ సంస్మరణీయులు. అదే కోవకు చెందినఉత్తమ దేశభక్తురాలు శ్రీమతి రామసుబ్బమ్మ. కడప కోటిరెడ్డి సహధర్మచారిణి అయిన వీరు అన్ని ఉద్యమాలలోను, సంక్షేమ కార్యక్రమాలలోను పాల్గొంటూ జీవిత భాగస్వామికి చేదోడువాదోడుగా నిలిచారు. తమ జీవితాన్ని దేశ సేవకు వినియోగించారు. సమాజంలో మంచిని, మానవతను పెంచి అందరి ప్రశంసలను పొందారు.
1917లో రామసుబ్బమ్మ కడప కోటిరెడ్డిగారిని వివాహం చేసుకున్నారు. రామ సుబ్బమ్మ శ్రీమంతుల ఇంట్లో జన్మించినా, తాము అనుభవించాల్సిన భోగభాగ్యాలను ప్రక్కకునెట్టి జాతీయ ఉద్యమంలో పాల్గొని, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కృషి సలిపారు. శ్రీమతి రామసుబ్బమ్మ గారికి చిన్నతనం నుండి దేశభక్తి ఎక్కువ. కడప కోటిరెడ్డితో వివాహం జరిగాక ఆయన తో పాటు ఆమె దేశభక్తి పూల సువాసనలా, నలుదెసలకూ వ్యాపించింది. గాంధీజీ, కస్తూరిబా దంపతుల ఆదర్శాలు శ్రీమతి రామసుబ్బమ్మ గారిని కదిలించి వేశాయి. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడచేందుకు కంకణం కట్టుకొని, భర్త కోటిరెడ్డి గారితోపాటుగా, దేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు.
దేశంలో కెల్లా మొదటిసారిగా 1938 డిసెంబరున కడప జిల్లా బోర్డు అధ్యక్ష పీఠాన్ని అలంకరించింది శ్రీమతి రామసుబ్బమ్మ. కానీ గాంధీజీ ఆదేశానుసారం 1943 ఆగస్టు 15న తమ పదవిని త్యాగం చేస్తూ రాజీనామా చేశారు.
రామసుబ్బమ్మ కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లి గ్రామవాస్తవ్యులు. కొణదుల రామచంద్రారెడ్డి పుత్రిక అచ్చమాంబ ల తొలి సంతానం. వీరు 1902లో జన్మించారు. రామసుబ్బమ్మ తండ్రి గొప్ప సంస్కృత పండితులు. 1911లో ఐదవ జార్జి పట్టాభిషేకం మహోత్సవానికి రామసుబ్బమ్మ తండ్రిగారిని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానించింది. వీరు ప్రతి ఉగాదికి బండ్ల కొలది మామిడి పండ్లు, ప్రతి పీర్ల పండుగలకు సంచుల కొద్ది నాణాలను దానం చేసేవారు.
రామసుబ్బమ్మ చిన్ననాటి నుండే చురుకుగా ఉండేవారు. జన్మస్థలమైన సుద్దపల్లెలో విద్యాభ్యాసం తరువాత ప్రయివేటు ఉపాధ్యాయుల ద్వారా విద్యా విజ్ఞానాన్ని సముపార్జించి ప్రజ్ఞావంతులైనారు.
1928 ఫిబ్రవరిలో సైమన్ కమిషన్ బహిష్కరణ పిలుపు తో దేశమంతా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. మద్రాసు ప్రజలు ఈ ప్రదర్శనలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. హైకోర్డు సమీపంలో ప్రదర్శకులపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో ఒకరు మరణించారు. ఆనాటి ప్రదర్శనలలో చురుకుగా రామసుబ్బమ్మ గారు పాల్గొన్నారు.
ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లఘన ఉద్యమాల అణచివేతకు ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంది. సత్యాగ్రహుల శిబిరాలపై దాడులు జరిగాయి .వాలంటీర్ల మీద లాఠీచార్జిలు, వందలాదిమంది అరెస్టులు చేశారు.పత్రికల మీద, ప్రింటింగ్ ప్రెస్ ల మీద నిర్బంధం విధించారు. రహస్యంగా ప్రచురించిన కరపత్రాల నిషేధించారు. ప్రశాంతంగా సభలు, సమావేశాలు జరిపే కార్యకర్తల అరెస్టులు సర్వసామాన్యమైనాయి. ఈ సందర్భంగా కడపకోటిరెడ్డి, రామసుబ్బమ్మ ధైర్యంగా ఈ ఉద్యమాలను నడిపారు. వారి సాహాసాలకు కడప జిల్లా ప్రజలు హారతి పట్టారు.
కడప రామసుబ్బమ్మ ఆమె భర్త కోటిరెడ్డి తో పాటు ప్రజాసేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేవారు. 1938లో కడవ జిల్లా బోర్డు అధ్యక్షపదవిని చేపట్టారు. మహిళల్లో సామాజిక రాజకీయ చైతన్యం పెంపొందించడానికి ఆవిరళ కృషి చేశారు.
ఆమె త్యాగానికి గుర్తుగా ఆమె పేరుతో కడప రామసుబ్బమ్మ మహిళా డిగ్రీ కళాశాలను కడప నగరంలో ఏర్పాటు చేశారు.
సేకరణ: పిళ్ళా కుమారస్వామి,9490122229
(రాయలసీమ స్వాతంత్య్ర సమర చరిత్ర, స్వతంత్ర భారత సావనీర్ ఆధారంగా)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి