రాయలసీమ చరిత్ర __భాషా సంస్కృతులు
రాయలసీమ చరిత్ర __భాషా సంస్కృతులు
రాయలసీమ చరిత్ర గురించే కాక భారతదేశ చరిత్ర ను తెలుసుకోవడానికి ఆయా ప్రాంతాల్లో త్రవ్వకాలలో లభించిన అనేక పనిముట్లు, వేయించిన శాసనాలు, ఆయా కాలాల్లో వున్న రచయితలు రచించిన గ్రంథాలే ప్రధాన ఆధారం.
కొత్త రాతి యుగం కంటే ముందు నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆదిమానవులు ఉన్నారు. కడప ప్రాంతంలో నివసించిన మానవులు హెమటైట్ రాతితోను పనిముట్లు తయారు చేసుకొనేవారు. కర్నూలుజిల్లాలో బిల్లసర్గం గుహలలోను, కడప, అనంతపురంజిల్లాలలోను క్రీ. పూ. 5000 నాటి పాత రాతియుగపు పనిముట్లు లభించాయి. జనాభా పెరిగేకొద్దీ ఈ ప్రాంతంలో జనపదాలు ఏర్పడి ఉండాలి. పైగా భాష కూడా ఏర్పడి ఉండాలి. జనపదాలు పెద్దవై రాజ్యాలు ఏర్పడిన తర్వాత తొలి శాసనాలు రాయలసీమలోనే లభించాయి.దీన్నిబట్టి తెలుగువారు రాయలసీమ వారై ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు.
చౌడేశ్వరీ పురాణం లో క్రీ.పూ. 320కన్నా ముందు నందరాజులు ఇప్పటి కర్నూలుజిల్లా లోని బనగానపల్లె సమీపంలోని నందవరాన్ని కేంద్రంగా చేసుకుని నందనుడు పాలించినట్లుంది. ఆ గ్రామాన్ని కాశీ నుంచి వలస వచ్చిన బ్రాహ్మణులకు దానం చేశాడు.దాంతో తన పేరు మీద 'నందాలయం' అనే పేరుతో మరొక పట్టణాన్ని నిర్మించాడట. అదే తరువాతి కాలంలో 'నంద్యాల'గా మారిందని చెబుతారు.
వాస్తవానికి అప్పటికి కడప జిల్లాలోని కొన్ని గ్రామాలు కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాలు కలిపి రేనాటి సీమ అని పిలిచేవారు ఇప్పట్లాగా ఆ రోజుల్లో కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ప్రాంతాల విభజన లేదు.
అశోకుని శాసనాలు
మౌర్య చంద్ర గుప్తుడు క్రీ.పూ.320లో నందులను జయించి మౌర్య సామ్రాజ్యాన్ని పాట్నా ను రాజధానిగా చేసుకుని స్థాపించాడు. ఆ సమయంలో రేనాటి ప్రాంతం వీరి ఆధీనంలో ఉంది. మౌర్యరాజులలో ప్రఖ్యాతి చెందిన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తన సామ్రాజ్యాన్ని అఖండ భారతమంతా విస్తరించాడు.
నేటి కర్నూలు జిల్లా ఎర్రగుడి, జొన్నగిరి, సిద్దాపురం దగ్గర లభించిన అశోకుని శాసనాల ద్వారా ఆనాటి రేనాటి సీమ ప్రాంతం క్రీ.పూ.2వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో ఉంది. ఈ శాసనాలను బ్రాహ్మిలీ లిపిలో రాశారు తెలుగు కన్నడ కలిపిన భాషలో బ్రాహ్మిలిపి ఉండేది. అతని కాలంలోనే బౌద్ధం రేనాటి సీమలో విస్తరించింది. అయితే అప్పటి రేనాటి సీమ ఒక జనపదం మాత్రమే. ఒక జనపదం దాదాపు పదివేల మంది జనాభాతో ఉంటుంది.
అప్పుడు రేనాడు ప్రాంతంలో దక్షిణ భారతదేశానికి 'సువర్ణగిరి'ని ఉప రాజధానిగా ఏర్పాటు చేసి తన ప్రతినిధిని నియమించాడు. ప్రస్తుతం పత్తికొండ వద్ద ఉన్న జొన్నగిరియే సువర్ణగిరి అని పరిశోధకుల అభిప్రాయం. సువర్ణగిరి కాలక్రమేణా జనవ్యవహారంలో సొన్నగిరిగా, ఆ తర్వాత జొన్నగిరిగా మారిందని చెబుతారు. అశోకుని శిలాశాసనాలు ఈ ప్రాంతంలోని ఎర్రగుడి, జొన్నగిరి, సిద్ధాపురం, మండగిరి ప్రాంతాలలో లభ్యమైనాయి. కానీ అప్పటికింకా ఈ ప్రాంతంలో కోటలు నిర్మించలేదు. కారణం బహుశా అప్పుటి జనాభా 10,000లోపే ఉండొచ్చు. ఆనాడవి రాజ్యాలు కాదు. కేవలం జనపదాలు మాత్రమే.
బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన అశోకుడు బౌద్ధ ధర్మాలను శిలాశాసనాలుగా చెక్కించాడు. ఇప్పటివరకు భారతదేశంలో లభిస్తున్న పురావస్తు శిలా శాసనాలు అశోకుని కాలం నాటివే. అంతకన్నా ముందువి లభించడం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో నందలూరు దగ్గర ఆడపూరు గ్రామంలో బౌద్ధ స్తూపాలు అశోకుని కాలంలో నిర్మించినవి ఉన్నాయి అలాగే కాజీపేట దగ్గర నాగ నాగేశ్వర కోనలో కూడా బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. అక్కడ బుద్ధుని పాదాలు కూడా లభిస్తున్నాయి. వాటిని ప్రస్తుతం ప్రజలు విష్ణుపాదాలుగా భావించి పూజిస్తున్నారు.
పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలనీ, అన్ని జీవరాశుల పట్ల దయ కలిగి వుండాలని, సత్యాన్నే ఎల్లప్పుడూ పలకాలని చెబుతూ ఎర్రగుడిపాడు ప్రాంతంలో రాయించిన ఆరు పెద్ద శిలాశాసనాలు లభించాయి.
అశోకుని అనంతరం ఈ ప్రాంతం క్రీ.పూ 236 తర్వాత శాతవాహన రాజుల పాలనలోకి వెళ్ళింది. వీరు ముప్పైమంది దాదాపు 450 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు.
దీన్ని దృష్టిలో పెట్టుకొనే తెలుగు ప్రజల మొదటి నివాస ప్రాంతం రాయలసీమ తర్వాత తెలంగాణ అని తుర్లపాటి రాజేశ్వరి తన తెలుగు ధనం గ్రంధంలో పేర్కొన్నారు.
మెగస్తనీసు క్రీ. పూ. 300 సం||లో మౌర్యుల ఆస్థానానికి గ్రీకు రాయబారిగా భారతదేశం సందర్శించి నప్పుడు ఆంధ్రుల గురించి ప్రస్తావించాడు. అప్పటికి ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యానికి సామంతులు. అశోకుని తర్వాత ఆంధ్రపాలకులు శాతవాహనుల పేరు ధరించి స్వతంత్రులయ్యారు. పశ్చిమాన పైథాన్ నుంచి గోదావరీతీరం వెంబడి తూర్పున కళింగ దేశంవరకూ, దక్షిణాన రాయలసీమ, దక్షిణాంధ్ర వరకూ శాతవాహన సామ్రాజ్యం విస్తరించింది. వీరు క్రీ. పూ. 220సం|| నుంచి క్రీ.శ.200సం॥ వరకు సుమారు 400 సం॥ రాజ్యపాలన చేశారు.
రేనాటి సీమ_ రేనాటి చోళులు
క్రీ.శ.6వ శతాబ్దం నాటికి రేనాడు ఏడువేల గ్రామాల సముదాయం.దీనిని రేనాటి చోళులు పాలించేవారు. అప్పటికి ఈ ప్రాంతం తక్కువ జనాభా తో అటవీ ప్రాంతం గా ఉండి ఉండొచ్చు. క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం మండలం లోని కలమల్లలో లభించిన శాసనం ప్రకారం ధనంజయుడనే రాజు రేనాడును పరిపాలించేవాడు. ఇప్పటివరకు మనకు తెలిసిన చరిత్ర ప్రకారం ఇతడే రాయలసీమ ప్రాంతం మొదటి రాజు.ఇతనికి ఎరికల్ ముత్తు రాజు అనే బిరుదు ఉండేదని ఆనాటి శాసనాలు ద్వారా తెలుస్తోంది.
కమలాపురం లోని ఎర్రగుడిపాడు దగ్గర లభించిన క్రీ.శ.600 నాటి శాసనం ఇతని ఏలుబడిని నిర్ధారిస్తోంది. కమలాపురంలోనే ఇందుకూరు లో లభించిన శాసనం ప్రకారం ధనంజయుని కొడుకు చోర మహారాజు అధికారంలోకి వచ్చాడు. ఇతను వేయించిన శాసనమే ఇది. క్రీ.శ. 630 నాటి కమలాపురం లోని తిప్పలూరు శాసనం ప్రకారం చోరమహారాజు తర్వాత అధికారంలోకి వచ్చినవాడు ఎరికల్ ముతురాజు పుణ్య కుమారుడు. ఇతను చిప్పలి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేశాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది.పుణ్య కుమారుడు ఈ ప్రాంతాన్ని హిరణ్య రాష్ట్రంగా ప్రస్తావించాడు. పుణ్య కుమారుడు రేనాటి రాజుల్లో గొప్పవాడు. ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి.
ఈ పుణ్య కుమారుని కొడుకు మొదటి విక్రమాదిత్యుడు.ఇతని కొడుకు శక్తి కుమారుడు. ఇతని కొడుకు రెండో విక్రమార్కుడు. ఇతని కొడుకు సత్యాదిత్యుడు. విక్రమాదిత్య అను పేరు పెట్టుకున్నప్పటి నుండి వీరు బాదామీ చాలుక్యులకు సామంతులయ్యారు.
బాదామీ చాళుక్య రాజు రెండవ పులకేసి వల్లభుడు క్రీ.పూ.611_ 643 వరకు పాలించాడు.ఇతని కొడుకు మొదటి విక్రమార్కుడు క్రీ.శ. 678 వరకు రాజ్యమేలాడు. తర్వాత అతని కొడుకు వినయాధిత్యుడు వచ్చాడు. ఇతని కొడుకు విజయాదిత్యుడు వరుసగా రాజ్యమేలారు. విజయాదిత్యుని కొడుకు రెండోవిక్రమాదిత్యుడు క్రీ.శ. 732లో రాజైనాడు.
రెండోవిక్రమాదిత్యుని సమకాలికుడే పైన చెప్పిన సత్యాదిత్యుడనే రేనాటి చోళ రాజు. ఈ రాజు క్రీస్తుపూర్వం 725లో వేసిన శిలాశాసనం కమలాపురం తాలూకు మండలంలోని మాలెపాడు లో ఉంది . ఈ శాసనం ప్రకారం ఇతను వేయి గ్రామాల సీమ గా ఉండిన సిద్ధవటాన్ని 7వేల గ్రామాల సీమ గా ఉండిన రేనాటి సీమను పరిపాలించేవాడు. వీరి కాలాన ఉన్న ప్రజలే
మన తెలుగు భాషకు మూల పురుషులు. ఈ రాజులు వేసిన శాసనాల వల్లనే మన తెలుగు భాష ప్రాచీనత్వాన్ని తెలియజేస్తుంది.
వైదంబులు
రేనాటి చోళుల తర్వాత ఎనిమిదో శతాబ్దం చివరలో కడప ప్రాంతాన్ని బాణరాజులు, వైదంబరాజులు వశపరుచుకున్నారు. వైదంబులు మొదట చిత్తూరు ప్రాంతంలో ఉండేవారు. వారి రాజధాని వైదంబవ్రోలు. ఈ వైదంబులు రేనాటి చోళులను ఓడించి కడప రాజ్యాన్ని ఆక్రమించారు. కొంతకాలానికి రాజంపేట ప్రాంతంలోని కొత్తపి నగరాన్ని, వాయల్పాడు ప్రాంతంలోని కలకడ నగరాన్ని రాజధానిగా చేసుకున్నట్లు శాసనాలు లభిస్తున్నాయి. వైదంబులు కూడా తెలుగు మాట్లాడేవారే.
వైదంబులు, బాణరాజులతో కలిసి నోలంబ, గంగ, చోళ రాజులతో యుద్ధం చేశారు. ఈ యుద్ధాన్ని క్రీస్తు శకం 830 ప్రాంతంలో సొరమేడి ప్రాంతంలో యుద్ధం చేశారు.ఇది పెనుగొండ లోని చోలే మరి అనే ప్రాంతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ముదిమడువనే వేరొక గ్రామం వద్ద కూడా యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వైదంబు మహారాజు గండ త్రినేత్రుడు పాల్గొన్నాడని రాయచోటి ప్రాంతంలో లభించిన వందాడి శాసనం చెపుతోంది. రాయలసీమ చరిత్రను తెలుసుకోవడానికి ఎటువంటి గ్రంథాలు లేనందువలన శాసనాల ఆధారంగానే చరిత్రను నిర్మించుకోవాల్సి వస్తోంది.
ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసు కోవడానికి ఈ శాసనాలే ఆధారం. అప్పటి గ్రామీణ ప్రజలు అనేక వృత్తులు చేసుకునేవారు. అప్పటికి కుల వ్యవస్థ లేదు. వృత్తులను అనుసరించి వారు సంఘాలుగా ఉండేవారు ఈ సంఘాలను సమయాలు లేదా శ్రేణులు అని పిలిచేవారు. ప్రజలు ఉత్పత్తి చేసే వస్తువుల క్రయ విక్రయాలకు సంబంధించి ఈ సంఘాల ద్వారానే జరిగేది. దాన ధర్మాలు కూడా ఈ సంఘం ద్వారానే జరిగేది. ఆ రోజుల్లో ఎక్కటి, పాంచాల, కుంభాలిక, తంతువాయ, వస్త్ర భేదక, తెలిక, దేవాంగ, గోరక్షక, పరికెల, కిరాత, రజక మొదలైన తెగలవారు ఉండేవారు. సంఘ నియమాలు ఉల్లంఘించిన వారికి శిక్ష విధించేవారు. ఆ శిక్షలను సమయ దండనం అనేవారు. ప్రజా జీవనం స్థానిక వ్యవస్థల నియంత్రణలో ఉండింది.
అప్పటి ప్రజలు జైన బౌద్ధ, శైవ ,వైష్ణవ మతాలను అవలంబించారు. అప్పుడు ఎటువంటి మతోన్మాదం లేదు.
క్రీ. శ. 1339 నాటికి పంగతప్పు, కర్రీ కొలుచు, ఒమ్ను కానుక ,పుల్లరి ,సాధము ,సుంకము, తలారి, కానుక ,సుంకేకానిక ,పుల్లరి కానుక, దరిశివకానిక పవిత్ర కానుక అని 13 రకాల పన్నులు విధించే వారిని తెలుస్తోంది. వీటి గురించి మనకు ఇప్పుడు కొంచెం కూడా తెలియదు. ఇవి గాక పుట్టు పేరు సుంకము, వడ్డ రావుళ సుంకము, బీరణాలు, అరి, అప్పనము, మగ్గరి, మృతి సుంకాలు, అంగడి సుంకాలు మొదలైనవి పేర్కొనబడ్డాయి. వీటిలో కొన్ని రాజ సుంకాలు ఉన్నాయి. మరికొన్ని గ్రామ సుంకాలు ఉన్నాయి. ఇవన్నీ వస్తు రూపంలో ఉన్నాయి.
శాసనాలన్నీ సంస్కృతంలో కాక ప్రాకృతం తెలుగు కలిపిన పదాలతో రాశారు. బ్రాహ్మణుల గోత్రాలు కూడా శాసనాల్లో తెలియజేశారు. మాట్లాడినప్పుడు వారు ద్రావిడ కన్నడ ప్రాకృతంలో కలిసిన తెలుగు భాషను మాట్లాడేవారు ఆనాటి భాష సరిగా రూపొంద లేదు. భాషను తయారు చేసుకునే కాలమది. అందువల్లనే శాసనాల్లో అసంబద్ధ వాక్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. వారు పడిన శ్రమ వల్లనే నేడు మనం తెలుగు వాళ్ళమని చెప్పుకోగలుగు తున్నామని, తెలుగువారికి ఆరేడు శతాబ్దంలో వారే మూలపురుషులని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మ శాస్త్రి అన్నారు.
పుష్పగిరి లో రాష్ట్రకూట రాజు కృష్ణుడు రాయించిన శాసనాలలో ముల్కినాడు గురించి ప్రస్తావించారు.ములికి నాడు తెగకు సంబంధించిన బ్రాహ్మణులు ఉన్న ప్రాంతాన్ని ములుక నాడు అన్నారు.
కాకతీయ రుద్రమదేవి పాలనలో దక్షిణ ఆంధ్ర సామంత పాలకుడు అంబదేవుడు 1292 CEలో పాలించాడు.ఇతని శాసనాలలో ముల్కినాడుతో పాటుగా పులివెండ్ల (ప్రస్తుత పులివెందుల), పొత్తాపి, పెనావది, సిరివోడు లను ప్రస్తావించారు.
కాకతీయ ప్రతాప రుద్రుడు 1319 CE లో కడప జిల్లాలోని సిద్దవటం లో వేయించిన చందువోయి శాసనం లో ముల్కినాడు గురించి ప్రస్తావించారు. పలు శాసనాలు, సమీప ప్రాంతాల చరిత్రలు పరిశీలించిన మీదట ములుకనాడు లేదా ముల్కినాడు కడప ప్రాంతానికి చెందినదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముల్కినాడుతో పాటు రేనాటి సీమ ప్రాంతములోని కొన్ని ప్రాంతాలు రేనాడు, మార్జావడి, పొత్తాపినాడు, పెదనాడు మొదలైన పేర్లతో పిలువబడినాయి.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
References:
కర్నూలు జిల్లా చరిత్ర__డా॥ ఎం. హరికిషన్
తెలుగు శాసనాలు___ జి. పరబ్రహ్మశాస్త్రి
తెలుగు ధనం__ తుర్లపాటి రాజేశ్వరి
వికిపీడియా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి