వైయస్సార్ నగర్ కాలనీ ఇక్కట్లు
వైయస్సార్ నగర్ కాలనీ ఇక్కట్లు
కడప మేయర్ వైయస్సార్ పార్టీ కి సంబంధించినప్పటికీ పేరుకు వైయస్సార్ నగర్ కాలనీకి సమస్యలు పెరిగాయే గానీ తగ్గలేదని
ఈ కాలనీ వాసులు వాపోతున్నారు. ఇక్కడ వివిధ పార్టీల నాయకులు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లున్నాయి. పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు కానీ కార్పొరేషన్ మాత్రం ఎటువంటి సౌకర్యాలు అందించలేదని ఇక్కడ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
తాగునీటి సమస్యలు:
కడప నగరంలోని వైయస్సార్ నగర్ కాలనీలో మంచినీటి సరఫరా సరిగా లేదు. వచ్చే నీళ్లన్నీ సుద్ధ నీళ్ళు. అవి తాగితే రోగాలు వస్తాయి తప్ప మనుషులు బాగుపడరు. పైగా పైప్‌లైన్ సమస్యలు. నీటి సరఫరా రాత్రి పూట జరుగుతోంది. దాంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాలు:
మెయిన్ రోడ్డు తప్ప ఇతర రోడ్లన్నీ ఇంతవరకు వేయలేదు. మెయిన్ రోడ్డు కూడా మేయర్ సురేష్ బాబు గారికి అవసరమై వేసుకున్నాడని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అతను తన స్థలాలను రియల్ ఎస్టేట్ గా మార్చుకోవడానికి ఈ దారి బాగా ఉపయోగపడుతున్నందున దానిని మాత్రం సిమెంట్ రోడ్డు గా వేసి తక్కిన వాటిని పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. వర్షం పడితే ప్రతిరోడ్డు ఒక వంకగా మారుతతోంది.దాంతో పిల్లలకు వృద్ధులకు నడవడం కాదు కదా ఈదులాడాల్సి వస్తోంది.
డ్రైనేజీ వ్యవస్థ అసలు లేనేలేదు. మురుగునీటి గుంతలు కొంతమంది తమ ఇంటి దగ్గర ఏర్పరచుకుంటే వాటిని రోడ్డు వెడల్పు పేరుతో తొలగించారు. ఇప్పుడు వారి మురుగు నీరు ఎక్కడికి పోవాలో తెలియక అగమ్యంగా ఉన్నది.
విద్యుత్ సరఫరా:
వైయస్సార్ కాలనీలో వీధిలైట్లు చాలా చోట్ల వెలగడం లేదు దాంతో చీకట్లో తడుములాడుకుంటూ వృద్దులు వెళ్తున్నారు. దానివల్ల మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉంది. కొండ మీద ఉన్న గుడికి దోవవెంబడి వీధిలైట్లు వేసినారు కానీ, కాలనీలో మాత్రం ప్రజల కోసం వీధిలైట్లు వెలగకుండా ఉన్నాయంటే సంబంధిత అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది.
పారిశుద్ధ్యం:
చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు.
చెత్త బండి అసలు వారానికి ఒక్కసారి ఎప్పుడో వచ్చి తీసుకెళ్తున్నారు.దాంతో ప్రజలు ఎక్కడ చూసినా చెత్త వేస్తున్నారు. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీ లోకి ప్రవేశించే చోటే చెత్తకుప్పలు ఉండి అక్కడ పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. దాంతో దోమల బెడద బాగా ఉంది. వ్యాధులు అడక్కుండానే చుట్టుముడుతున్నాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి.
డ్రైనేజీ లేకపోవడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.
ప్రజా రవాణా, కనెక్టివిటీ:
కాలనీ వాసులు తమ సచివాలయం వెళ్లాలంటే దేవుని కడపకు వెళ్లాలి. ఆ ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇది నివాసితులకు ఒక సమస్యగా ఉంది.
సేవలు: ప్రభుత్వ ఆసుపత్రులులో కేవలం మందులు మాత్రమే ఉన్నాయి. ఇతర ప్రాణాంతక వ్యాధులకు ఎలాంటి చికిత్స అక్కడ లేదు. ఇది పేదలపై పెను భారం పడుతోంది.
పాఠశాలకు కాంపౌండ్ నిర్మించలేదు. దాంతో పిల్లలకు ఆడుకోవడానికి తగిన పాఠశాలను లేక అక్కడంతా కంపచెట్లు మొలిచి నిరుపయోగంగా ఉంది.
అంగన్వాడి కేంద్రం అసలు లేదు. అక్కడున్న నివాస గృహాలు దాదాపు 1000కి పైన ఉన్నాయి కానీ ఓట్ల కోసం రాజకీయ నాయకులు అక్కడ తిరుగుతారే గాని వారి సమస్యలను పట్టించుకున్న పాపాన ఇంతవరకు పోలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ బతికింతే అని వాపోతున్నారు. వారు పాలకులపై పెట్టిన శాపనార్థాలు విపరీతంగా ఉన్నాయి. అవి ఫలిస్తే మాత్రం ఈ పాలకులు మాడి మసైపోతారు.
ఇళ్ల పట్టాలు
చాలామందికి ఇళ్ల పట్టాలు లేవు. పెన్షన్ సౌకర్యం లేదు. అర్హులైన మహిళలను గుర్తించి వారికి పెన్షన్ ను,ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
శ్మశాన వాటిక
ఈ కాలనీ వాసులకు శ్మశాన వాటిక లేక ఎవరైనా మరణిస్తే వారిని పూడ్చడానికి సరైన చోటు దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
____ పిళ్లా విజయ కుమారస్వామి రెడ్డి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి