పోతరాజు పార్థసారథి


స్వాతంత్ర్య సమరయోధుడు – రాజకీయవేత్త – సాహితీవేత్త పోతరాజు పార్థసారథి

వైఎస్సార్ కడప నేల నుంచి జాతీయ స్థాయికి ఎదిగి స్వాతంత్ర్య సమరయోధుడిగా, పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా, జర్నలిస్టుగా, సాహితీవేత్తగా విశిష్ట సేవలందించిన ప్రముఖుల్లో పోతరాజు పార్థసారథి ఒకరు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి, సాహిత్య వికాసానికి విశేష కృషి చేశారు.

వ్యక్తిగత జీవితం

       పార్థసారథి  1916 జూలై 1న ప్రస్తుత కోడూరు లో జన్మించారు. ఆయన తండ్రి గంగిచెట్టి. చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలతో పెరిగిన ఆయన, విద్యార్థి దశలోనే జాతీయోద్యమ ప్రభావానికి లోనయ్యారు. వృత్తిరీత్యా జర్నలిస్టుగా పనిచేస్తూనే ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొన్నారు.

స్వాతంత్ర్య సమరంలో పాత్ర

1930 శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో చదువును మధ్యలోనే వదిలిపెట్టి జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. అనంతరం అటవీ సత్యాగ్రహం, వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.

అటవీ సత్యాగ్రహం సందర్భంగా పోలీసుల లాఠీచార్జికి గురయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు పలుమార్లు జైలు శిక్షలను అనుభవించారు.
1941లో జనవరి 8 నుండి ఎనిమిది నెలల జైలు శిక్ష,
1943 ఫిబ్రవరి 18 నుండి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు.
       మద్రాసులో విద్యార్థులను కళాశాలలను బహిష్కరించి స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చారు.

రాజకీయ ప్రస్థానం

       స్వాతంత్ర్యోద్యమంలో ఆయన  చూపిన నాయకత్వం కారణంగా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు.
1935–1938 మధ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా సేవలు అందించారు.ఎ.ఐ.సి.సి. సభ్యునిగా ఎంపికయ్యారు.
1953 డిసెంబర్ నుండి 1955 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు.

         1955 నుండి 1961 వరకు శాసనసభ సభ్యునిగా పనిచేశారు. అనంతరం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు.
         పార్థసారథి పార్లమెంటరీ నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970–71 మధ్య కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉపమంత్రిగా నియమించింది. ప్రజా సమస్యలను పార్లమెంటులో సమర్థంగా ప్రస్తావించిన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది.

సాహిత్య సేవ

రాజకీయాలతో పాటు సాహిత్య రంగంలోనూ ఆయన విశేష కృషి చేశారు. తెలుగు, ఆంగ్ల భాషలపై పట్టు కలిగిన పార్థసారథి గీతాంజలి,ది గార్డెనర్ , కుమార సంభవం,
షేక్స్పియర్ సోనెట్లు తెలుగు లోకి అనువదించారు 
ఈ అనువాదాల ద్వారా ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువ చేశారు.

క్రీడలు మరియు వ్యక్తిత్వం

    పార్థసారథి గారికి క్రీడలంటే మక్కువ. ముఖ్యంగా టెన్నిస్ ఆటను ఎంతో ఇష్టపడేవారు. రాజకీయాలు, సాహిత్యం, క్రీడలు—ఈ మూడు రంగాల్లోనూ ఆసక్తి చూపిన అరుదైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

విదేశీ పర్యటనలు

జ్ఞాన సముపార్జన కోసం ఆయన యూరప్, అమెరికా, కెనడా దేశాల్లో అధ్యయన పర్యటనలు నిర్వహించారు. అక్కడి రాజకీయ, సామాజిక, విద్యా వ్యవస్థలను పరిశీలించి భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడే అంశాలను అధ్యయనం చేశారు.

అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిధ్యం

1974లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ, కాన్‌బెర్రా, కైరో నగరాల్లో జరిగిన అంతర్జాతీయ పార్లమెంటరీ సమావేశాలకు హాజరై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

ఆధారాలు:
రాయలసీమ స్వాతంత్ర్య సమర చరిత్ర,
వికీపీడియా,
datais.info

సేకరణ: పిళ్లా కుమారస్వామి.9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యోగాలో ప్రసిద్ధురాలై కదిరికి వన్నెతెచ్చిన కృష్ణవేణి

The unexplored relics of Rayalaseema

పెనుకొండ కోట – విజయనగర వైభవానికి రెండవ రాజధాని