లంబాడి తెగ గిరిజనులు -- భాషా సంస్కృతులు
లంబాడి తెగ గిరిజనులు -- భాషా సంస్కృతులు
భారతదేశ చరిత్ర సంస్కృతి వాస్తవానికి పూర్తిగా అది గిరిజనులకు సంబంధించినది. ఆర్యులు ద్రావిడులు ఇతర ప్రాంతాల నుంచి భారతదేశంలోకి వలస వచ్చినారని పరిశోధనకులు చెబుతున్నారు గిరిజనులు మాత్రం భారతదేశ మూలవాసులు. వీరి చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు ఇప్పటికీ మైదాన ప్రాంత వాసులు కన్నా భిన్నంగా ఉన్నాయి. ఎరుకలు ఏనాధులు లంబాడీలు మొదలైన వారి సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేస్తే చాలా కొత్త విషయాలన్నీ మనకు తెలుస్తాయి ముఖ్యంగా మూలవాసుల చరిత్ర సంప్రదాయాలు మనకు స్పష్టంగా అర్థం అవుతాయి.
ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగలు లేదా గిరిజనులు అని రాష్ట్రపతి ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గిరిజన తెగలు 573. వారి జనాభా 10.43 కోట్లు (8.6%). ఇందులో పురుషులు 5.24 కోట్లు, స్త్రీలు 5.19 కోట్లు. దేశ జనాభాలో వీరి శాతం 8.6శాతం. గిరిజనుల్లో లింగ నిష్పత్తి దేశవ్యాప్తంగా 990.గిరిజనుల అక్షరాస్యత 58. ఇందులో పురుష అక్షరాస్యత 68.5. స్త్రీ అక్షరాస్యత 49.4శాతం.
కడప ప్రాంతంలో గిరిజనులు మైదానం ప్రాంత గిరిజనులు.వీరు 2004 లెక్కల ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో 14,541మంది లంబాడీలు ఉన్నారు.లంబాడీలు తమ సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఒకే చోట ఒక గుంపుగా తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గుంపు నివాసాన్నే తాండా అంటారు. వారు ఉప్పు మరియు ధాన్యం రవాణా చేసే వారు. మరికొందరు బియ్యం, తమలపాకులు మొదలైనవాటిని వ్యాపారం చేసేవారు. పూర్వం వీరు సంచార జాతుల వారు.బంజారాలు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు వివిధ రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తుండేవారు. స్థిరనివాసం ఏర్పరచుకున్న తర్వాత వీరు తమ వ్యాపారాలను విడిచిపెట్టి వ్యవసాయం పశువులు గొర్రెలు పెంపకం చేపట్టారు.
తాండా ప్రజలు, ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం. పంచాయితు వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, పండుగులను కలిగి ఉంటారు. గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంథాలు ఏ చరిత్ర కారులు, ఏ పుస్తకాలు రాయలేదు. గిరిజనుల లో మూఢ నమ్మకాలు ఎక్కువ. లంబాడీలు శారీరకంగా భారీ మనుషులు. దృఢమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు. వారిని బ్రిటిష్ వారు "long bodies"అని పిలిచారు.
లంబాడీలను బంజారాలను కూడా పిలుస్తారు.
ఈ లంబాడీ సుగాలీలు గిరిజనులలో 28 వ తెగ. వీరి భాషకు లిపి లేదు. సవర భాష దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు. లంబాడీలు మాట్లాడే భాషను “గోర్ బోలి” లేదా లంబాడీ భాష అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని బంజారీ మాండలికం చుట్టుపక్కల ఉన్న ద్రావిడ భాషలతో మిళితం చేయబడిందని పలువురు పేర్కొన్నారు.
లంబాడీలలో పుట్టినప్పటి నుండీ చనిపోయేవరకు సంస్కృతీ, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవనవిధానం, పెళ్లి, చావు, అన్ని ప్రత్యేకంగా ఉంటాయి.
వీరిలో బహు భార్య వ్యవస్థ ఉంది. లంబాడీల వివాహ పద్ధతులు భిన్నంగా ఉన్నప్పటికీ మైదాన ప్రాంత సంస్కృతులు వారిపై ప్రభావం ఎక్కువగా పడి పెళ్లి సమయంలో ఏడడుగులు నడిచే విధానం ఉంది. హిందూ సమాజంలో బ్రాహ్మణులు ఉన్నట్లుగానే వీరిలో రాస్పుత్రులు అనే వర్గం తమను తాము బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. వీరు ఇతర వర్గాలతో వివాహాలు కానీ భోజనాలు కానీ చేయరు. అపరిచితులను తమ వర్గం లోకి చేర్చుకుంటే వారిని జంగార్లు అంటారు వారిని మిగతా సభ్యులు తక్కువగా చూస్తారు. లంబాడీలు స్త్రీలు ప్రత్యేకంగా ఆకర్షణీయమైన దుస్తులు ధరించేవారు వారు ధరించే బట్టలపై తలుక్కుమనే విధంగా అద్దాలతో రకరకాల కళా నైపుణ్యాలతో కుట్టుకొని ధరించేవారు ఇప్పుడు దాదాపు అది కనుమరుగయింది.
పెళ్లి లో వధువుకు ఆమె తల్లిదండ్రులు కూడా పరికిణి, కాంచళి (రవిక) మొదలైన దుస్తులను, ముక్కెరను రూపాయల దండను, ఒక తాంగిడిని ఇస్తారు. తాంగిడి అంటే పెళ్ళిలో పుట్టింటివారు పెళ్ళి కూతురికి ఇచ్చే గోనె సంచి.పెళ్ళికి వారం రోజుల ముందు నుండే తండాలోని స్త్రీలందరూ కలసి వధువుకు పంపక సమయంలో ఏడ్చే విధానాన్ని నేర్పుతారు. దీనినే ఢావలో అంటారు. ఈ కార్యక్రమములో మూడు విధానాలుంటాయి. ఏడ్పును నేర్పించే ఆచారాన్ని ఢావలో అని, పంపక సమయంలో అందరినీ కౌగిలించుకొని ఏడ్వటం, మళేరో అని ఎద్దుపై నిల్చొని తన పుట్టింటి వారు సుభిక్షంగా వుండాలని కోరుకుంటూ పాడేపాటను దావేలి అని అంటారు.
లంబాడీ స్త్రీలు ధరించే దుస్తులు అందమైన కుట్టుపనులతో ఉంటాయి. అద్దాలు పొదిగించిన కాంచళి (రవిక), కుచ్చుల పేటియా (లంగా), అద్దాలు రూపాయి బిళ్లలతో తయారు చేసిన గుమ్‌టో (ముసుగు) ను ధరిస్తారు. లంబాడీ స్త్రీల ఆభరణాలు అందంగా ఉండటమే కాక బరువుగా కూడా వుంటాయి. వీరు ముక్కుకు భూరియా ముక్కెరను, చెవులకు వివిధరకాల కమ్మలను (ములును), మెడలో( హంస్)లో గొలుసును, చేతులకు బలియ గాజులును వాంక్ డీ కడియాలును, చేతి వేళ్లకు చాస్ (నగిషి కలిగినవి) చల్లా( నగిషిలేని) మొదలైన ఉంగరాలను ధరిస్తారు. లంబాడీల్లోని సాంప్రదాయక ఆభరణాలు ఈనాడు మార్పులు ఎన్నో లోనవుతున్నాయి. ఆధునిక కాలంలోని నాగరిక ప్రభావంతో ఈ నగలన్నీ అంతరించి పోతున్నాయి.
పుట్టిన బిడ్డలకు మొదటిసారి తలవెంట్రుకలను తీయడాన్ని లంబాడీ భాషలో లట్టాకాడేర్ అని అంటారు. లంబాడీల్లో ఒక్కరికే కాకుండా జంటగా పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు, ఒక్కరికే తీయవలసి వచ్చినపుడు పక్కన ఓక్రాను పెడతారు. ఓక్రా అంటే చిన్న గోనె సంచిలో మెత్తని గడ్డి నింపి కుట్టిన దిండు. లంబాడీలు సామాన్యంగా ఏదో ఒక దేవత ఎదుట వెంట్రుకలను తీస్తుంటారు.
లంబాడీల్లో రుతుమతి అయిన అమ్మాయిలకు ప్రత్యేక ఉత్సవాలు చేయరు. అయితే ఈ రోజుల్లో కొంతమంది లంబాడీలు తెలుగువారి సంస్కృతి ప్రభావంతో ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రతి తండాకు ఒక నాయక్ (తండా పెద్ద ) ఉంటాడు. అతను ఏం చెప్తే అదే లంబాడీ గిరిజన ప్రజలకు వేదం. అయితే బంజారాలందరికీ ఒక ఆరాధ్యదైవంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఉన్నారు. ఆయన ఒక సంఘసంస్కర్త, ప్రకృతి ప్రేమికుడు, బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్ధారకుడు. 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా రాంజీనాయక్ తండాలో సేవాలాల్ మహారాజ్ జన్మించారు. జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి బంజారాల సేవలో నిమగ్న మయ్యారు.
భారతదేశంలో సుమారు 10 కోట్లకు పైచిలుకు జనాభా కలిగిన బంజారాలు ఏటా సేవాలాల్ జయంతిని జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి వేడుకలు జరుపుతుంది. సేవాలాల్ జయంతి వేడుకలు జరిగే సమయంలో బంజారాలు గోరబోలి బాషాను 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, అలాగే ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నారు.
సేవాలాల్ తన పాటలు రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడు. అందులో ముఖ్యంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. అందుకే సంత్ సేవాలాల్ ఇతర కులాలవారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారు. సేవాలాల్ ప్రజల మూఢవిశ్వాసమైన జంతుబలలను తీవ్రంగా వ్యతిరేకించాడు. జాతి జాగృతి కోసం ఎంతో హితబోధ చేశాడు. తన జాతి వారిని బ్రిటిష్ వారి నుంచి కాపాడాడు. అందుకే బంజారాలు ఆయన జయంతిని జరుపుకుంటున్నారు.
బంజారా సమాజం సేవాలాల్ ధర్మాలను గొప్పగా చెప్పుకోవడమే గానీ ఆచరణకు దూరంగా ఉన్నారు. నేడు బంజారాల్లో వరకట్నం ప్రధాన సమస్యగా మారింది. పెళ్లిళ్ల పేర విపరీతమైన ఖర్చు చేస్తున్నారు. అలాగే ఎక్కువమంది తాగుడుకి బానిసలు అవుతున్నారు. ముందుగా బంజారాలు ఈ రుగ్మతలను పారదోలాలి.
____ పిళ్లా కుమారస్వామి,9490122229
ఆధారం వికిపీడియా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి