రాయలసీమలో కొత్త రాతి యుగపు (Neolithic Period) అవశేషాలు
*రాయలసీమలో కొత్త రాతి యుగపు (Neolithic Period) అవశేషాలు*
కొత్త రాతి యుగం 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమై 4000 సంవత్సరాల వరకు సాగింది. ఈ యుగంలోనే మనిషి ఒకచోట స్థిరంగా ఆహారాన్ని వ్యవసాయం చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. దానికోసం శిలాపనిముట్లను తయారు చేసుకున్నాడు.
దాంతో గ్రామాలు ఏర్పడినాయి. నాగరిక జీవనానికీది నాంది పలికింది. ఈ కాలపు అవశేషాలు తెలుగు రాష్ట్రాల్లో 4000 ఏళ్ల కింద కనిపించాయి.
చరిత్రపూర్వయుగానికి పితామహుడిగా పేరొందిన రాబర్ట్ బ్రూస్ ఫుట్ కడప జిల్లాలో హనుమంతరావు పేట, పెద్దముడియం, బలిజపల్లె లో , అనంతపురంజిల్లాలో 25 స్థావరాల్లో త్రవ్వకాలు జరిపి ఈ యుగానికి చెందిన ఆధారాలు వెలికితీశాడు.
పశువుల పేడను కుప్పగా కాల్చడం వల్ల ఏర్పడిన బూడిద కుప్పలు (ash mounds)
అనంతపురం జిల్లాలోని పాలవాయి, కర్ణాటకలోని కుపల్, పిక్లిహాల్లో కనిపించాయి. కానీ ఇవి వైఎస్ఆర్ జిల్లాలో కనిపించలేదు.
ధర్మోలు మినిసెన్స్ పద్ధతి ద్వారా ఈ బూడిద దిబ్బలు సుమారు క్రీ.పూ 2000 కాలంలో కాల్చినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనిని బట్టే అప్పటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణపైన ఆధారపడ్డారని నిర్ధారించారు. ఈ కాలంలో జొన్న, రాగి, ఉలవ, పెసర మొదలైన పంటలు పండించారు. కర్నూలు జిల్లాలో రామాపురంలో బార్లీ, మినుములను ఎక్కువగా పండించారు.ఈ కాలం నాటి వ్యవసాయ క్షేత్రాలు అనంతపురం జిల్లాలోని పాలవాయి, లత్తవరం, కర్నూలు జిల్లాలోని బేతంచర్లలో కనిపించాయి.
వ్యవసాయం చేయడానికి పశువులు అవసరం అయ్యాయి. దానికోసం గేదెలు(ఎనుములు), ఆవులు, మేకలు, గొర్రెలు, పందులను పెంచారు. కుక్క, ఎద్దు, మొదలైన జంతువులను మచ్చిక చేసుకున్నారు.
నియోలిథిక్ మనిషి సాగుతో పాటు, వేట, చేపలు పట్టడం అతనికి సహజంగా లభించే పండ్లు, కూరగాయలు, తినదగిన గడ్డి లేదా దుంపలు వంటివాటిపై ఆధారపడి ఉన్నాడు.
ఆది మానపుడు కుండలు తయారు చేయడం నేర్చుకుంది ఈ యుగంలోనే.మొదట్లో కుండలను చేత్తో తయారు చేసి, పట్టుకొని కాల్చాడు. ఆ కుండ అడుగు భాగం కాలి ఎర్రగా వుంది. పై భాగం కాలకుండా నల్లగా ఉంది. చేతి గుర్తులు కూడా ఉన్నాయి. కుమ్మరి సారెను తరువాత కొనుక్కున్నాడు. కుండలతో పాటు అన్ని రకాల పాత్రలను తయారు చేసుకున్నాడు.రాతి విగ్రహాలను కూడా తయారు చేశాడు.ఈ యుగపు ఆనవాళ్లు కడప జిల్లాలోని మైలవరంలో ఎక్కువగా కనిపించాయి. పులివెందుల, వేముల, ఎల్లటూరు,పెద్దముడియం బలిజేపల్లి లో ఎరుపు రంగులో పెయింట్ వేయబడిన కుండలు కొన్ని తవ్వకాల్లో లభించాయి. కార్బన్ డేటింగ్ పద్ధతిలో ఇవి క్రీ.పూ. 1540, క్రీ.పూ. 1100 మధ్య కాలానికి చెందినవిగా నిర్ధారించారు. ఇవి దాదాపు కర్ణాటకలోని వాట్ గల్ ప్రాంతంలో లభించిన కుండల కాలానికి సమకాలీనంగా ఉన్నాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలానికి చెందిన వేల్పుమడుగు గ్రామప్రాంతంలో మూపురం గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం లభ్యమైంది.తెనగల ప్రాంతంలో ఎరుపు రంగులో ఉన్న కుక్క, జింక చిత్రాలు లభించాయి.
చెర్ట్ (సహజంగా ప్రకృతిలో లభించే పదునైన రాయి)నుంచి చిన్న బ్లేడ్‌లు తయారు చేసి వాటిని బహుశా బార్బ్‌లు లేదా బాణం తలలుగా ఉపయోగించేవారు.లేదా వాటిని కత్తులు, కొడవళ్లు లాగా ఉపయోగించేందుకు రెసిన్(బంక)తో చెక్క ముక్క లకు లేదా ఎముకకు అమర్చబడి ఉండవచ్చు.
ప్రధానంగా గొడ్డలి, సుత్తి, ఉలి అనే పనిముట్లు ఉపయోగించారు. వీటికొరకు నల్లశాణం, బసాల్ట్, చెర్ట్ శిలను వాడారు. ఆయుధాలు డోలమైట్ తో తయారుచేశారు.
గుంటూరు జిల్లాలోని వడ్డమాను గ్రామం దగ్గర ఈ కాలపు రాతి గొడ్డలిని కనుగొన్నారు. రాయితో చేసిన బ్లేడులు కూడా దొరికాయి. బేతంచర్ల (కర్నూలు జిల్లా), వీరాపురం, నాగార్జునకొండ, గిద్దలూరు, తాడిపత్రి మొదలైన ప్రాంతాల్లో కొత్త రాతి యుగపు పనిముట్లు లభించాయి. బండి చక్రాన్ని కూడా ఈ యుగంలోనే కనుగొని బండ్లను తయారు చేసుకున్నాడు. పిడికర్ర పెట్టేందుకు చెక్కిన రాతి ముక్క లభించినది
గిడుగనూరు వద్ద ఒకవిధమైన పాలరాతితో చేసిన కత్తులు లభించాయి. తెలంగాణా లోని కరీంనగర్ జిల్లా కు చెందిన కదంబాపూర్ లో పనిముట్లు తయారు చేసే కేంద్రం కూడా ఒకటి బయటపడింది.
వలయాకృతిలో రాళ్లను పేర్చి కర్రలను కడ్డీలుగా అమర్చి, రెల్లుగడ్డితో కప్పును వేసుకున్నారు.ఇంటి వెనుక నుండి జంతువులు దాడి చేయడానికి వీలు లేకుండా, ఇళ్ళను ఒకదానికి మరొకటి అనించి నిర్మించుకున్నారు.ఇటువంటి ఇళ్ల ఆనవాల్లు వైఎస్ఆర్ జిల్లాలోని పెద్దముడియం
లో ఇలాంటి అవశేషాలు రెండు గుర్తించారు.
ఇవి 1540 В.С.,1100 В.С.కాలానికి చెందినవిగా రేడియో కార్బన్ ద్వారా నిర్ధారించారు.
అనంతపురం జిల్లాలోని హుళికల్లు, లత్తవరం, మహబూబ్ నగర్ జిల్లాలోని చినమారూరులో కూడా ఇలాంటి వే కనిపించాయి.టెక్కల్‌కోట (కర్ణాటక) వద్ద 3 మీటర్ల నుండి 5 మీటర్ల వ్యాసం కలిగిన చిన్న వృత్తాకార గుడిసెల అవశేషాలు చేయబడ్డాయి. ఇవి 1780 బి.సి. నుండి 1540 B.C. కాలానికి చెందినవని గుర్తించారు.
ఈ కాలంలోనే రాతి బండను తొలిచి గుహలలో ఉండే విధంగా 8 ఇళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో ఒక ఇంటి మధ్యలో కుండలో శిశువు కళేబరాన్ని పెట్టి సమాధి చేయబడింది. కడప జిల్లాలోని పులివెందుల దగ్గర ఇలాంటి ఒక గుహను కనుగొన్నారు. ఆ గుహలో ఆనాటి ప్రజలు నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద గల గండ్లూరు గ్రామంలో కూడా ఇలాంటిది కనిపించింది. ఈ ఆధారాల వల్లనే కొత్త రాతి యుగపు బూడిద దిబ్బలనే పదాన్ని సాహిత్యంలో ఉపయోగించేందుకు దారితీశాయి.
ఈ యుగంలోనే మత విశ్వాసాలు ప్రారంభమయ్యాయి. పురుషాధిక్యత మొదలైంది. రాబర్ట్ బ్రూస్పూట్ ప్రకారం ఈ యుగ కాలంలో మొదటగా 'రాయచూరు'లో 'లింగ ఆరాధన' మొదలైంది. శ్రమ విభజన కూడా జరిగింది.
పురావస్తు శాస్త్రవేత్తలకు రాక్ ఆర్ట్ అనేది చాలా ఉపయోగకరమైనది. వీటి ఆధారంగా అప్పటి ప్రజల సంస్కృతిని, జీవన విధానాన్ని అంచనా వేయగలుగుతారు. ఈ రాక్ ఆర్ట్ రెండు విధాలుగా ఉంటుంది. గుహల్లో బండలపైన ఒక పదునైన రాయితోనో, ఉలితోనో చెక్కిన ఆకారాలు ఒకటి.
వివిధ రంగులతో గీచిన చిత్రాలు మరొకటి. వీటిని బట్టి వాటి కాలాన్ని నిర్ధారించవచ్చు.వీటి ఆధారంగా వైఎస్ఆర్ జిల్లా లో కనుగొన్న రాతి చిత్రాలను క్రీ.ఫూ.8000-1500 కు చెందినవిగా గుర్తించారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు
మండలం చింతకుంట గ్రామంలో, వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ లో ఐఐఐటి సమీపంలో ఉన్న కొండలపై
ఆది మానవుడు రాళ్ల పై గీచిన రేఖా చిత్రాల గురించి ఆస్ట్రియా పురాతత్వ శాస్త్రవేత్త ఇర్విన్ న్యూ మేయర్” లైన్స్ ఆన్ స్టోన్ ది ప్రి హిస్టారిక్ రాక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా" అనే పుస్తకంలో వీటి గురించి రాసినాడు. చింతకుంటలో మాదిరి దొప్పల్లెలో కూడా ఇలాంటి రేఖా చిత్రాలున్నాయి. అయితే ఆ పల్లె ఇప్పుడు మైలవరం జలాశయంలో మునిగిపోయింది.
దక్షిణ భారతదేశంలోనే మొదటి పెద్దదైన, ప్రముఖమైన మిసోలిథిక్ కాలానికి ( వీటిని 1981లో గుర్తించారు.మన రాష్ట్రంలో మధ్య రాతి యుగం (మిసోలిథిక్), కొత్త రాతి యుగం నాటి రాతి కళా స్థావరాలు చాలాచోట్ల ఉన్నాయి.
ఇవి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మహబూబ్ నగర్, ప్రకాశం, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్నాయి.
ఆ నాటి మానవుడు చెక్కుచెదరని విధంగా తనకు తెలిసిన నైపుణ్యం తో
రాళ్ల మీద వేసిన బొమ్మలను చూస్తే అచ్చెరువొందుతాము. జింకల బొమ్మలు, మానవాకృతి చిత్రాలున్నాయి. వాటికి శిరోవేష్టనం ఉంది. రేఖలు చెదిరి శరీరభాగం మీద అడ్డదిడ్డంగా ఉన్నాయి. మధ్య శిలాయుగంతోపాటు నవీన శిలాయుగ శిలా చిత్ర లేఖనాలు చింతకుంటలో ఉండటం చాలా అరుదైన విషయం.
విల్లంబులు కలిగి ఉన్న మానవులు మూపురం ఎద్దుల పక్కనే ఉన్నారు. శిలల మీద గంట్లు, గీట్లు పెట్టినట్లు చెక్కడాలు కూడా మూపురం ఎద్దులకే ఎక్కువగా వున్నవి. ఈ మూపురం ఎద్దులకు శైలీపరమైన పోలికలున్న శిలా చిత్రలేఖనాలు భారతదేశంలో ఎక్కడా కానరాలేదని పరిశోధకులు చెపుతున్నారు.
ఈ చిత్రాలు నేలకు 3 నుంచి 5 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అందులో మూపురం ఎద్దులు ఒకే ఒక గుండుపై ఉన్నాయి. ఈ గుండును స్థానిక ప్రజలు ఆవుల గుండు అంటారు. అలాగే మైథున క్రీడలో వున్న దంపతుల చిత్రం కూడా ఉంది. వేంపల్లె సమీపంలో ఉన్న ఇడుపులపాయలో కనిపిస్తున్న చిత్రాలలో
పాడెను(శవాన్ని) నలుగురు మోస్తున్న తీరు, ఆ శవంతో పాటు వెళ్తున్న ప్రజలు కనిపిస్తారు. ఇది ఆనాటి ప్రజలు చేసిన విధానమే ఇప్పటికే కొనసాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది.
ఇక్కడే మరో చోట
ఎర్రని రంగుల రేఖా చిత్రాలలో కొన్ని ఏనుగుల బొమ్మలు కూడా వున్నాయి.
ఎథ్నో-ఆర్కియాలజీ:
నియోలిథిక్ ప్రజలు పశుపోషణను మొదటిగా ఆచరించిన ప్రాచీన ప్రజలు. ఈరోజు కూడా గొల్ల, కురుబ అనే రెండు సమకాలీన పశుపోషక తెగల జీవనశైలి, సంస్కృతి అధ్యయనం చేయడం ద్వారా నియోలిథిక్ ప్రజల జీవన విధానాన్ని మనం బాగా అర్థం చేసుకోగలం. నియోలిథిక్ స్థలాల పరిసరాల్లో ఉన్న వ్యవసాయ భూములు పశుపోషక కులమైన గొల్ల కులానికి చెందినవిగా కనిపిస్తున్నాయి. ఈ గొల్లలు ఈ అధ్యయన గ్రామాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈనాటికీ ప్రభావశీలులుగా ఉన్నారు. ఎందుకంటే వారు వ్యవసాయంతో పాటు పశుపోషణను కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి, జీవనాధార పద్ధతులు, ఆర్థిక జీవితం, భౌతిక సంస్కృతిని మనం అధ్యయనం చేయడం ద్వారా, వీరు అనుసరించిన జీవన విధానం ఆధారంగా ప్రాచీన ప్రజల జీవన విధానాన్ని పునర్నిర్మించడం సాధ్యపడుతుంది. వారు కూడా వ్యవసాయం, పశుపోషణ, వేట మొదలైనవన్నీ ఆచరించినవారే.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
*References* :
An outline of Indian Prehistory__D K Bhattacharya
(ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి__డా. యం. అబ్దుల్ కరీం)
(ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర__
డా॥పి. జోగినాయుడు)
ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి__ సయ్యద్ రాజా
LINES ON STONE : The Prehistoric Rock Art Of India__ERWIN NEUMAYER
Kadapainfo.com
NEOLITHIC EXPLORATIONS KADAPA DISTRICT OF AP: A HISTORICAL SURVEY_Hemamanjari
కడపజిల్లా విజ్ఞాన దీపిక_డా.చింతకుంట శివారెడ్డి
PARIPEX-INDIAN JOURNAL OF RESEARCH | Volume 11
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి